శ్రీ నారసింహ  క్షేత్రాలు - 15


ఛత్రవట నరసింహస్వామి, పెంచలకోన

నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిధ్ధి చెందిన ఛత్రవట నరసింహస్వామి ఆలయం నెల్లూరు జిల్లా, పెంచలకోనలో వున్నది.  ఉగ్ర నరసింహుడు చెంచులక్ష్మిని చూసి శాంతపడింది, ఆడి పాడి మనువాడింది ఇక్కడేనంటారు.   ఆ తరంవారికి చెంచులక్ష్మి అనగానే .. చెంచులక్ష్మి సినిమా, అంజలీదేవి, నాగేశ్వరరావు, చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా అనే పాట .. గుర్తు రాకుండా వుండవు కదా.  ఆ ఆటపాటలన్నీ ఇక్కడేనంట. (సినిమా కాదు .. ఒరిజినల్).

 

ధర్మచ్యుతి జరిగి రాక్షసుల బాధలకు లోకాలు తల్లడిల్లుతున్నప్పుడు, స్ధితి కారకుడైన శ్రీ మహా విష్ణువు సర్వ జీవ సంరక్షణార్ధమై, వివిధ రూపాలలో, వివిధ నామాలతో ఆవిర్భవించి దుర్మార్గులను మట్టుబెట్టి సన్మార్గులను రక్షిస్తూ వుంటాడు.  అలా శ్రీమన్నారాయణమూర్తి అనేక అవతారాలు ఎత్తాడు.  వాటిలో దశావతారాలు అందరికీ తెలిసినవేకదా.    పండితులు ఈ అవతారాలను మూడు తరగతులుగా విభజించారు.  అవి 1. పూర్ణావతారాలు .. అవే .. రాముడు, కృష్ణుడు, 2. ఆవేశావతారాలు.. అవి .. పరశురామావతారము, నరసింహావతారము, ఇంక 3. అంశావతారములు ..  అవి విష్ణువు శక్తిలో కొంత భాగముతో ఆవిర్భవించినవి..అవి మత్స్య, కూర్మ, వరాహ వగైరా మిగతావి.  ఈ దశావతారాలు భూమిమీద జీవుల పరిణామ విధానాన్ని తెలియజేస్తాయని పండితుల అభిప్రాయం.

 

 

వీటిలో నాల్గవదయిన నరసింహావతారము చాలా ఉత్కృష్టమైనది అంటారు.  ఎందుకంటే ఉత్కృష్టమయిన మానవజన్మ, మృగశ్రేష్టమైన సింహము సమ్మేళనముతో రూపొందిన అవతారం, అమిత శక్తివంతమైన, ఆవేశపూరితమైన అవతారం ఇది.  ఈ అవతారంగురించి పద్మ, కూర్మ, అగ్ని, విష్ణు పురాణాలలో చెప్పబడింది.  భారత దేశంలో మిగతా చోట్లకన్నా దక్షిణ భారత దేశంలో ప్రాచీన కాలంనుంచి నృసింహస్వామి ఆరాధన, ఉపాసన వున్నది.  దానికి కారణం బహుశా స్వామి ఇక్కడే ఆవిర్భవించి, ఈ ప్రాంతాలలో తిరుగాడటం కావచ్చు.  కులంతో నిమిత్తం లేకుండా చాలామంది నరసింహస్వామిని తమ కులదైవంగా భావిస్తారు.  ఇక్కడివారు స్వామి మీద భక్తితో తమ పిల్లలకు పెంచలయ్య, పెంచలమ్మ వగైరా పేర్లను పెట్టుకుంటారు.

ఈ ప్రాంతంలో ఇదివరకున్న దట్టమైన అరణ్యాలు ఇప్పుడు లేకపోయినా, ఇప్పటికీ అరణ్యాలు, జలపాతాలతో శోభిల్లుతూ, రకరకాల ప్రకృతి సంపదకు ఆలవాలమై వుంది. ఇక్కడ స్వామి స్వయంభు.  ఈయన సాకారుడు కాదు నిరాకారుడు.  రెండు శిలలు పెనవైచుకున్నట్లు కనిపిస్తాడు. స్వామి రూపం గురించి రెండు కధలు ప్రచారంలో వున్నాయి.  పురాణాల ప్రకారం నరసింహస్వామి యోగముద్రలో పెద్ద బండగా వెలిశాడని, అందుకే ఈ క్షేత్రానికి  పెనుశిల (పెద్ద బండ) అనే పేరు వచ్చింది అని ఒక కధనం.  హిరణ్యకశిపుణ్ణి చంపిభయంకర ఆకారంతో ఇక్కడ తిరుగుతున్న స్వామి చెంచు లక్ష్మిని చూసి శాంతించారు.  ఆమెని వివాహమాడి, ఆమెని పెనవేసుకుని ఇక్కడ ఆ రూపంలో ఆవిర్భవించారని ఇంకొక కధనం.    ఈయనకి వెండి తొడుగు అలంకరించి వుంటుంది.

 

ఇదివరకు ఈ ప్రాంతమంతా చెంచులు వుండేవాళ్ళుగనుక చెంచులకోన అనేవారు.  ఆ  చెంచులకోనే నేటి పెంచలకోనగా మారిందంటారు.  స్వామి వారికి  ఛత్రవట నరసింహస్వామని, వెండిగొడుగుల వాడని పేర్లున్నాయి.  బ్రహ్మోత్సవాలకు ముందు, వెనుక, సుమారు నెల రోజులు  పెంచలకోన సమీపంలోని భైరవకోనలో స్వామి స్నానాద్యనుష్టానాలు చేసుకుంటారని, ఆ సమయంలో సప్త ఋషులు స్వామివారికి దివ్య ఛత్రము పడతారని భక్తుల నమ్మకం.  అందుకే ఆయనకి ఛత్రవటి నరసింహస్వామని పేరు.  బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు స్వామి వారికి మొక్కుబడిగా గొడుగులు సమర్పించుకుంటారు.  ఈ గొడుగులను ప్రత్యేకంగా అలంకరించి, ఊరేగింపుగా తీసుకొస్తారు.  ఈ క్షేత్రం దట్టమైన కీకారణ్యంలో వున్నప్పటికి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు క్రిమి కీటకాలనుండి తలెత్తవు. అందువల్ల ఈ స్వామిని కొండి కాసులవాడని కూడా పిలుస్తారు.    
ఆదిలక్ష్మి
స్వామి చెంచులక్ష్మీని  వివాహమాడినట్లు  తెలుసుకున్న  ఆదిలక్ష్మీ అమ్మవారు ఆగ్రహించి  స్వామికి  దూరంగా వెళ్ళినట్లు కధనం.  అందుకే ఆదిలక్ష్మి అమ్మవారికి ఇక్కడ విడిగా దేవస్ధానం వుంటుంది.
క్షేత్రపాలకుడు
ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి కూడా స్వామి ఆలయ సమీపంలోనే విడిగా ఆలయం వున్నది.
ఆలయం
త్రేతాయుగంనాటి ఈ ఆలయం కాలగమనంలో శిధిలంకాగా, పునరుధ్ధరింపబడటానికి కారణం ఒక గొర్రెలకాపరి.  పెంచలకోనకు ఆరు కిలో మీటర్ల దూరంలో గోనుపల్లిలో వుండే ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడువులలోకి వెళ్తుండేవాడు.  ఒక రోజు స్వామి ఆయనకు  వృద్ధుని రూపంలో కనిపించి నరసింహస్వామి శిలా రూపంలో ఇక్కడ వెలసి వున్నారని గ్రామస్దులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పమన్నారు.  ఆ గొర్రెలకాపరిని  వెనుతిరిగి చూడకుండా వెళ్లాలని స్వామి  ఆదేశించగా అతను సరేనని కోద్ది దూరం వెళ్ళిన తరువాత వెనుతిరిగి చూడడంతో శిలగా మారినట్లు   చెబుతారు.   (ఈ గొర్రెల కాపరి ఆలయం గోనుపల్లి గ్రామానికి దగ్గరలో వుంది.)  విషయం తెలుసుకున్న గ్రామస్దులు స్వామి వారికి దేవస్ధానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోనలోని గర్భగుడి సుమారు 700 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు తెలుస్తుంది.1959లో ఈ దేవస్ధానం దేవాదాయశాఖవారి అధీనంలోకి వచ్చింది.  అప్పటినుంచి అభివృధ్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి.
ఇతర విశేషాలు
భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగాడని, శకుంతలను, ఆయనను పెంచిన కణ్వమహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకున్నారని  అక్కడ వున్న ఏరును కణ్వలేరుగా పిలిచేవారని కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లు కూడా కధనం.
ఈ ఆలయానికి అతి సమీపంలో మాతా విజయేశ్వరీదేవి ఆశ్రమం వున్నది.
దర్శన సమయాలు
మధ్యాహ్నం 12 గం. లు 3 గం.ల మధ్య ఆలయం మూసి వుంటుంది.   రాత్రి 7-30కి ఆలయం మూసివేస్తారు.
మార్గము
జిల్లా ముఖ్యకేంద్రం నెల్లూరునుంచి గంటకొక బస్సు (80 కి.మీ. ల దూరం), రాపూరునుంచి అరగంటకొక బస్సు (రాపూరు మండలంలోని గోనుపల్లి గ్రామానికి 7 కి.మీ. ల దూరం) వున్నాయి. ఫోన్ నెంబర్లు  08621 – 221604,   సెల్   9491000737

 

-పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Punya Kshetralu