ఎందరో అమ్మలు .. అందరికీ వందనాలు

 

 

మేలో మదర్స్ డే వస్తోంది.  మనందరికీ అమ్మ అంటే ఎంతో ప్రేమ.  ఈ డే మన సంస్కృతి కాకపోయినా  రోజూ వుండే అమ్మ పట్ల ఇంకాస్త ఎక్కువ ప్రేమ కురిపించటానికి, అమ్మని ఇంకా ఎక్కువ అభిమానించటానికి, దూరంగా వున్న అమ్మలని కలుసుకోవటానికి, వేరే లోకంలో వున్న అమ్మని స్మరించటానికి ఇదొక మార్గం.  తల్లిపట్ల ప్రేమ ఎంత చూపించినా తరుగుతుందా!?  కానీ అందరూ ఇలాగే వున్నారా?  వుంటే దేశం ఇలా వుండదుకదా!!

 

అనేక మంది అమ్మలు కడుపారా బిడ్డల్నిగన్న ప్రేమామృత మూర్తులు, ఎన్నో వెతలకు గురవుతున్నారు.  కన్న బిడ్డల్ని ప్రేమగా పెంచారు.  తమ కడుపులు మాడ్చుకుని వాళ్ళ కడుపులు నింపారు.  తాము కూలీ పనికి వెళ్ళినా బిడ్డలు మారాజుల్లాగా ఉద్యోగాలు చేయాలనుకున్నారు.   బడికి పంపారు.  చదువుకొమ్మన్నారు.  వాళ్ళ గురించి ఎన్నో కలలు కన్నారు.  కొందరయితే భర్త ఎంత దుర్మార్గుడయినా ఆ ఛాయలు బిడ్డలమీద పడకుండా వాళ్ళని తీర్చి దిద్దుతారు.           

 

పిల్లలు కూడా తల్లిదండ్రులని మీకెలా అని ప్రశ్నించకుండా వాళ్ళు తమకి అందించిన ఐశ్వర్యాలన్నీ అందుకుంటారు.  తల్లి దండ్రుల కోరిక మేర సంపాదన మార్గంలో పడతారు.  అప్పటి దాకా అన్ని కధలూ బాగానే వుంటాయి.  అక్కడనుంచే వస్తుంది అసలు చిక్కు.  సంపాదించుకుంటున్నాడు.  పెళ్ళయింది.  తన సంసారం, బాధ్యతలు పెరుగుతున్నాయి.  దానితో తల్లిదండ్రులు తన సంసారంలో భాగం కాకుండా పోతారు.  వాళ్ళని వదిలించుకోవటానికి అనేక మార్గాలు వెతకటం.  ఊరికని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడో వదిలి పెట్టి వచ్చేవాళ్ళొకళ్ళయితే, ఎక్కడికి పోతారనే ఆలోచన కూడా లేకుండా ఇంట్లోంచి గెంటేసే వాళ్ళొకళ్ళు.  పట్టెడన్నం పెట్టలేక నానా యాతన పెట్టే వాళ్ళొకళ్ళయితే, కన్నవారనే ఆలోచన కూడా లేకుండా చంపేసే వాళ్ళింకొకళ్ళు.  అత్త మామలంటే కోడలికి పడక దూరంగా పెట్టేవాళ్ళు ఇంకొందరు.

 

ముగ్గురు నలుగురు పిల్లలున్న ఇంట్లో మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకి తగాదాలు.   వాడిని బాగా చూసింది, వాడి దగ్గరే వుండమని ఒకడంటే, మా దగ్గరేముంది వాడెక్కువ సంపాదిస్తాడు వాడి దగ్గరే వుండమని ఇంకోడు.  మధ్యలో నడి బజారులో కన్నవారు.  రోజూ ఇలాంటి సంగతులెన్నో చూస్తున్న మనం మదర్స్ డే, ఫాదర్స్ డే చేసుకోవాలా?

 

మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అని చాటి చెప్పిన భారత దేశం  ఇలాంటి దుస్ధితినెదుర్కొటోందంటే కారణం ఏమిటి  స్వార్ధం .. స్వార్ధం .. స్వార్ధం.  ప్రతి మనిషిలోనూ పెరిగిపోతున్న స్వార్ధం.  తను బాగుంటే చాలు అనే ఆకాంక్ష.  తనకి ఆసరా ఇచ్చిన వారిని మర్చిపోయే కుత్సిత బుధ్ధి.  ఇవ్వన్నీ ఎక్కడనుంచీ దిగుమతి అయినా పరిణామాలు అనుభవిస్తున్నది మాత్రం ఏ స్వార్ధమూ లేని మాతృమూర్తులు.

 

విదేశీ పోకడలతో కొన్ని అలవాట్లు చేసుకుంటున్నాము మనం.  వాటిలో ఈ డేస్ కూడా ఒకటి.  ఉదయం నిద్ర లేవగానే మాతృదేవోభవ .. అంటూ తల్లి దండ్రులకు నమస్కరించే పిల్లలకు భవిష్యత్ బంగారం కాదా.  ఈ సంస్కృతిని మనం మర్చిపోయాం, అందుకే మన పిల్లలకి నేర్పటంలేదు.  అందుకే కొంతమంది పిల్లలు ఈ రోజుల్లో తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవటం కూడా వేస్ట్ అనుకుంటున్నారు.  వాళ్ళ డిగ్నిటీకి భంగం అనుకుంటున్నారు.

 

కొందరు మధ్య తరగతి తల్లిదండ్రులు తమకున్న సర్వస్వం ధారపోసి పిల్లల్ని పైకి తెస్తారు.  వాళ్ళు చదువులు, ఉద్యోగాలని విదేశాలు, వేరే ఊళ్లు వెళ్లి వృధ్ధులయిన తల్లిదండ్రులని పట్టించుకోకపోవటం, ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి, మీరు బాగానే వున్నారు కదా, ఓ పది రోజుల్లో మేము వస్తున్నాము, ఏం బెంగ పెట్టుకోకండి అని ఊరడించటం, ఆ పది రోజులు తల్లిదండ్రుల ఆఖరి రోజుల దాకా రావు. 

 

 

బిడ్డలకి దూరమయిన ఆ తల్లిదండ్రుల బాధ భగవంతుడికే తెలుసు.  వాళ్ళ ఆర్ధిక పరిస్ధితి బాగుంటే కొంత పర్వాలేదు.  లేకపోతే వార్ధక్యంలో ఎవరి ముందు చెయ్యి జాపాలో తెలియదు.  ఆ అవసరం లేకపోయినా ఏ కాలో చెయ్యో నొచ్చినా వేళ్టికి ఇంత ముద్ద పెట్టేవాళ్ళు, సమయానికి డాక్టరు దగ్గరకి తీసుకెళ్ళేవాళ్ళు, షాపునుంచి మందులు తెచ్చేవాళ్ళు లేక ఇబ్బందులు పడేవాళ్ళు ఎందరో.

 

అందరూ తల్లిదండ్రులని అలా వదిలేస్తున్నారని నేను అనను.  చదువుకున్న వారు, ఆర్ధిక స్వాతంత్ర్యం వున్నవారు కొంత బాగానే వుంటారు.  వాళ్ళల్లో బరువులు, బాధ్యతలు తక్కువగనుక ఆప్యాయతలు కొంచెం ఎక్కువగానే వుంటాయి.  ఏ మనిషికయినా కాలూ చెయ్యీ ఆడుతూ, ఆరోగ్యంగా తిరుగుతున్నంతమటుకూ, ఆర్ధికంగా బాగున్నంతమటుకూ  ఏ ఇబ్బందీ వుండదు.  అది లేనప్పుడే మొదలవుతుంది అసలు కధ.

 

ఆస్తి పాస్తులు వుంటే ఒక రకం, లేకపోతే ఇంకో రకం.  ఆస్తిపాస్తులు లేకపోతే దైనందిక ఖర్చులే కాకుండా, వృధ్ధాప్యంలో పెరిగే ఆస్పత్రి ఖర్చులూ, మందుల ఖర్చులూ ఎలా అని కొందరి సమస్య అయితే, తమని నాలుగు తన్ని వున్న కొంచెం ఎవరన్నా దోచుకు పోతే ఎట్లా అనే సమస్య ఇంకొందరిది.

 

మదర్స్ డే అని వృధ్ధాప్యం మీద చర్చిస్తున్నానేమిటి అంటున్నారా?   మనం నిజమైన మదర్స్ డే జరుపుకోవాలని నా ఆకాంక్ష.  అంటే మన సంస్కృతి ననుసరించి  మనం జరుపుకోవాల్సింది మదర్స్ డే కాదు .. మాతృదేవో భవ అనే తారక మంత్రాన్ని ఆచరణలో పెట్టాలి.  మాతృ రక్షణోద్యమాన్ని చేపట్టాలి. 

 

ఈ మధ్య చాలామందిలో సేవా దృక్పధం పెరుగుతోంది.  దానిలో భాగంగా కొందరు  వృధ్ధాశ్రమాలకి వెళ్ళి వాళ్ళతో గడుపుతున్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తుననారు. సంతోషం.  కానీ ఇది సరిపోదు.   సమాజంలో ప్రేమాభిమానాలు పరిఢవిల్లేటట్లు చెయ్యాలి.  చదువుకున్నవారిగా, రచయిత్రులుగా ముందు మన బాధ్యత మనం నెరవేర్చుదాము.  మన రచనల ద్వారా సమాజంలో చెడుని తెగ నరికి మానవతా విలువలు పెంచే ప్రయత్నం చేద్దాం.

 

అమ్మ అంటే మీ అమ్మే అనుకోకండి.  మీ చుట్టూ వున్న అమ్మలను కూడా చూడండి. బిడ్డలు దగ్గరలేని అమ్మలని బిడ్డలలాగా పలకరించండి.  వారి దిగులు కొంతయినా తీర్చండి.   సంతోషంగా వున్న వాళ్ళకి మీ అండదండలు అవసరం లేదు.  కానీ సమస్యలు వున్న వాళ్ళకి అవసరమైన సహాయం చెయ్యండి.  ధనికుల కాలనీల్లో ఇలాంటి అవసరాలు వుండకపోవచ్చు కానీ  పేద వాళ్ళు ఎవరో వస్తారని ఎదురు చూస్తారు.  అవసరమైన వారికి కొద్దిగా ఆసరా ఇవ్వండి.   కావాలనుకుంటే  కౌన్సిలింగ్ ఇవ్వండి.  తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకి జన్మనిచ్చే తల్లిని వీధిన పడనీయకండి.

ఈ మధ్య యవత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది.  శుభం భూయాత్.

(మదర్స్ డే సందర్భంగా చెలిమి గ్రూప్, వారు నిర్వహించిన వ్యాస రచన పోటీలో ప్రధమ బహుమతి గెలుచుకున్న వ్యాసం.)

 

-పి.యస్.యమ్. లక్ష్మి

 (తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Purana Patralu - Mythological Stories