వినాయకునికి ఇష్టమైన చోటు – మోరేగావ్‌

 

 


గణపతి పూజ అంటే మహారాష్ట్రే గుర్తుకువస్తుంది. కానీ మరాఠీలు మాత్రం మోరేగావ్‌ను తల్చుకుంటారు. పూనెకు దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న ఊళ్లోని మోరేశ్వరుడంటే మరాఠీలకు మహా అభిమానం. ఇంతకీ ఎవరీ మోరేశ్వరుడు. ఆయన వెనుక ఉన్న గాథలు ఏమిటి...

 

వినాయకుడు నాలుగు యుగాలలోనూ నాలుగు అవతారాలుగా జన్మించాడని గణేశ పురాణం చెబుతోంది. వాటి ప్రకారం ఆయన త్రేతాయుగంలో మోరేశ్వరునిగా అవతరించాడట. ఆ సమయంలో ఆయన మయూరాన్ని తన వాహనంగా స్వీకరించాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. త్రేతాయుగంలో సింధుడనే రాక్షసుడు ఉండేవాడు. అతను ఎంత క్రూరుడంటే... తల్లి కడుపులో పడిన వెంటనే ఆ వేడిని ఆ మాతృమూర్తి కూడా భరించలేకపోయింది. దాంతో తన పిండాన్ని సముద్రంలో విడనాడింది. అలా సముద్రంలో జన్మించాడు ఆ రాక్షసుడు. అందుకనే అతనికి సింధుడనే పేరు వచ్చింది.

 

అసలే రాక్షసుడు. ఆపై సింధుని పొట్టలో అమృతభాండం ఉంది. దాన్ని నాశనం చేసేంతవరకూ సింధునికి మరణం ఉండదన్న అభయమూ ఉంది. దాంతో సింధుని అకృత్యాలకు అంతు లేకుండా పోయింది. ఇక అతగాడిని ఎదుర్కొనేందుకు స్వయంగా ఆ వినాయకుడే రంగంలోకి దిగాడు. తన గణాలతో కలిసి సింధుని రాజ్యం మీదకు దండెత్తాడు. సింధుని గర్భాన ఉన్న అమృతభాండాన్ని బద్దలుకొట్టి అతన్ని సంహరించాడు.

 

రాక్షస సంహారం ముగిసిన తర్వాత తన వాహనాన్ని సోదరుడైన కుమారస్వామికి అందించాడు. అప్పటి నుంచి కుమారస్వామి నెమలి వాహనుడైనాడు. మరోవైపు మోరేశ్వరునిగా మారి లోకాన్ని రక్షించిన వినాయకుని బ్రహ్మ స్తుతించాడు. ఆయనకు తన కుమార్తెలయిన సిద్ధి, బుద్ధిలను ఇచ్చి వివాహం చేశాడు. ఆపై తనే స్వయంగా ఒక ఆలయాన్ని నిర్మించాడు. అదే మోరేగావ్‌లోని మోరేశ్వర ఆలయం.

 

సింధు వృత్తాంతమే కాకుండా మోరేగావ్‌ ఆలయం వెనుక మరో గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకనాడు త్రిమూర్తులు తమ ముగ్గురికీ కూడా సృష్టికర్త అయినవాడు ఎవరో తెలుసుకోవాలన్న తపనతో తపస్సుని మొదలుపెట్టారట. అప్పుడు గణేశుడు ఆయనకు ఓంకార రూపంలో దర్శనమిచ్చాడట. అలా దర్శనం ఇచ్చిన స్థలం మోరేగావ్‌ అని నమ్ముతారు. గణపతే ఈ సృష్టికి అధిపతి అని నమ్మే గాణపత్య శాఖవారు ఈ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. ఆ శాఖకు చెందినవారు జీవితకాలంలో ఒక్కసారైనా మోరేగావ్‌కు రావాలని కోరుకుంటారు.

 

మోరేగావ్‌ ప్రస్తుత ఆలయం ఎప్పుడు నిర్మించారో కూడా తెలియనంత పురాతనం. అయితే ఈ ప్రాంతాన్ని పాలించిన పీష్వాలకి మాత్రం ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా దానధర్మాలు చేసినట్లు తెలుస్తోంది. కొందరు ముస్లిం పాలకులు సైతం ఇక్కడి వినాయకుడంటే అభిమానం చూపేవారట. ఇక ఈనాటి మరాఠీల సంగతైతే చెప్పనే అవసరం లేదు. 

 

అష్టవినాయక ఆలయాల పేరిట వారు ఎనిమిది వినాయక ఆలయాలను ముఖ్యమైనవిగా భావిస్తారు. వాటిలో మొట్టమొదటి ఆలయం ఇదే! అసలు భూమ్మీద వినాయకుని అత్యంత ఇష్టమైన ప్రదేశంగా గణేశ పురాణం పేర్కొంటోంది. ప్రళయం తర్వాత వినాయకుడు ఇక్కడే యోగనిద్రలో విశ్రాంతి తీసుకుంటాడని చెబుతోంది.

 

 మోరేగావ్‌ ఆలయ చరిత్రే కాదు నిర్మాణం కూడా చాలా విశిష్టంగా ఉంటుంది. నాలుగు వైపులా కోటబురుజులా ఉండే ఈ ఆలయంలో చాలా ఉపాలయాలు ఉన్నాయి. ఇక గర్భగుడిలోని విగ్రహం మీద మూడో కన్ను, తల వెనుక నాగపడగ ఉండటం విశేషం. మూషికవాహనంతో పాటుగా నంది వాహనం కూడా ఈ స్వామిని సేవిస్తూ కనిపిస్తాయి. మోరేగావ్ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడిపోతుంటుంది. 

 

అయితే ప్రతి చవితికీ జరిగే విశేష పూజలలో పాల్గొనేందుకు మరింతమంది భక్తులు విచ్చేస్తారు. ఇక వినాయక చవితి సంగతైనే చెప్పనక్కర్లేదు. నెల రోజుల పాటు అంగరంగవైభవంగా ఈ పండుగ సాగుతుంది. మోరేగావ్‌ ఆలయం సమీపంలో కర్హా అనే నది ప్రవహిస్తోంది. ఆ నది సాక్షాత్తు బ్రహ్మ కమండలం నుంచి ఉద్భవించిందని చెబుతారు. ఆ నదిలో స్నానమాచరించి స్వామిని దర్శించి తన కోరికలన్నింటికీ ఆయనకు విన్నవించుకుంటారు. తమ సుఖదుఖాల బాధ్యతను ఆ స్వామి మీద వేసి నిశ్చింతగా తిరుగు ప్రయాణం కడతారు.

 

- నిర్జర. 

 


More Vinayaka Chaviti