కూడలి శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం

 

నిండుగా నీటితో పారే  వాగు, దాని పక్కనే ఆలయాల సమూహం, ప్రశాంత వాతావరణం, కార్తీక మాసంలో కావాల్సినవి ఇవ్వే కదండీ.  అందుకే మా స్నేహ కిట్టీ పార్టీ మిత్రులం మొన్న సోమవారం ఉదయం 7 గంటలకల్లా బయల్దేరి మినీ బస్ లో అలా మెదక్ జిల్లా లోని కూడలి దాకా వెళ్ళి వచ్చాము. ఇదివరకు ముక్కోటి దేవతలు ఇక్కడ కూడి, వెళ్ళారుట.  అందుకని కూడవెల్లి అనే పేరు వచ్చింది అంటారు. అలాగే రెండు వాగులు ఇక్కడ కలుస్తాయిగనుక కూడలి అంటారు.

 

ఈ ఆలయాలను మేము ఇంతకు ముందు సందర్శించాము.  అప్పుడా వాతావరణం నన్ను చాలా ఆకర్షించింది. అందుకే మా వాళ్ళు కార్తీక మాసం, వన భోజనాలంటే అక్కడికి బయల్దేరదీశాను.  ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అక్కడ పూజారి శ్రీ సంకేత్ శర్మ (చిన్న వాడు..ఇంకా విద్యార్ధే. ప్రస్తుతం జ్యోతిష్యంలో పి.జి. చేస్తున్నారు) నుంచి కొన్ని వివరాలు తెలుసుకున్నాను. తర్వాత ఈయన నాకు ఫేస్ బుక్ ఫ్రెండ్ అయ్యారు.  ఈ వయసులో ఇంత తిరుగటమేకాక, ఆ ఆలయాల విశేషాలు అందరికీ అందజేస్తున్నానని చిన్న అభిమానం నేనంటే.   ఈ మారు ఆయనకి ఫోన్ చేశాను, రావాలనుకుంటున్నాము, స్నానాలు చెయ్యటానికి వాగులో నీళ్ళు వున్నాయా అని.  వున్నాయి రండి అన్నారు.

 

మేము వెళ్ళేసరికి 10-50 అయింది.  మా మిత్రులు బస్ దిగగానే ఎదురుగా వున్న వాగు దగ్గరకెళ్ళి స్నానాలు ముగించుకుని, ఒడ్డునే వున్న శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయానికి వచ్చారు.

వాగు విశేషాలు:
ఇక్కడ రెండు వాగులు కలుస్తాయి.  వీటిలో ఒకటి తూర్పునుంచి, ఇంకొకటి దక్షిణంనుంచి వచ్చి రెండూ కలిసి పడమరకి ప్రవహిస్తాయి.  రెండు వాగులు కలుస్తాయికనుక కూడలి అని పేరు.  పూర్వం మాండవ్య మహర్షి అక్కడ తపస్సు చేశారు కనుక ఒక వాగుకి ఆయన పేరుతో మాండవీ నది అంటారు. శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం.

ఇందులో పానవట్టం మీద రెండు శివ లింగాలతోబాటు విఘ్నేశ్వరుని విగ్రహం కూడా వున్నది. అందులో పక్కన వున్న లింగం కాశీనుంచి తేబడ్డది.  ఇంకొకటి సైకత లింగం.  శ్రీరామచంద్రుడు రావణ సంహారం అయిన తర్వాత అయోధ్యకి తిరిగి వెళ్తూ బ్రహ్మ హత్యా దోష నివారణార్ధం శివ లింగాలని ప్రతిష్టించి, వాటిని అర్చించి వెళ్ళారుట.  వాటిలో ఈ సైకత లింగం కూడా ఒకటి.  మరి ఇసుక లింగానికి అభిషేకాలెలా చేస్తారంటే జీడి గింజల చూర్ణం కవచంలా పెట్టం వల్ల అభిషేకం చెయ్యటం కుదురుతోందన్నారు.  

కార్తీక సోమవారం కదా, భక్తుల రద్దీ ఎక్కువగా వున్నది.  పైగా అంతా చుట్టు పక్కల ఊళ్ళనుంచి వచ్చేవాళ్ళే ఎక్కువట.  ఆ రద్దీలోనే సంకేత్ శర్మ గారి ఆధ్వర్యంలో మా మిత్రులమంతా శివునికి అభిషేకం చేశాము.  శివాలయంలో దీపాలు వెలిగించాము. కార్తీక మాసంలో దీపదానం చేస్తే మంచిదట. అవి కూడా చేశాము.

 

దీపాలు అంటే గుర్తొచ్చింది.  అక్కడ మేము చూసిన స్పెషల్ ఏమిటంటే అనంత కోటి దీపం.  బీగం బజార్ లో అమ్ముతారుట.  అది వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించినట్లట.  ఆలయంలో ఎవరో వెలిగించారు.  దాని గురించి మొదటిసారి విన్నాము మేము.  మాలాంటి వారికోసం ఫోటో తెచ్చాను.
ఈ ఆలయంలో శివుడి గర్భగుడి ముందు మూడు నందులు వుంటాయి.  

అందులో మధ్యన వున్నది పెద్దది.  ఇలా మూడు నందులు ఎందుకు వున్నాయి వివరం తెలియదుగానీ, శుక్లపక్ష త్రయోదశినాడు ప్రదోష సమయంలో వీటికి అభిషేకాలు జరుగుతాయిట.  ముఖ్యంగా సంతానం కోరుకునేవారు ఈ అభిషేకాలు చేస్తారుట. ఆలయం సింహద్వారం వెలుపల కూడా ఒక నంది వున్నది.  ఆ విగ్రహం అక్కడక్కడ శిధిలమయి వున్నది.  రజాకార్ల సమయంలో ఆ విధ్వంసం జరిగిందన్నారు.

 

పార్వతీ దేవి:
శివాలయంలోనే  పార్వతీ దేవికి ఉపాలయం వున్నది.  అక్కడ  పార్వతీ దేవికి ఒడి బియ్యం పోశారు అలవాటు వున్న కొందరు. మా కాలనీలో వున్న రచయిత్రినని, ఆలయాల గురించి వారికి తెలియజేసి కార్తీక మాసంలో వన భోజనాలకి సలహాలిస్తానని, మా వాళ్ళు అక్కడ నాకు శాలువా కప్పి దేవుడి పూలు, పళ్ళు చేతికిచ్చి, శ్రీ సాకేత్ శర్మగారిచేత ఆశీర్వచనం చెప్పించారు.  నాకిది సర్ప్రైజ్.

నా యాత్రా దీపిక – 7 మెదక్  - పరిసర ప్రాంతాలు శ్రీ శర్మగారికిచ్చాను.  ఇంతకు ముందే ఆయనకి ఆ పుస్తకం మిత్రులెవరో బుక్స్ ఎగ్జిబిషన్ లో కొనుక్కొచ్చి ఇచ్చారుట. ఇవ్వన్నీ అయ్యే సరికి మధ్యాహ్నం రెండు.  పూజలు అయినాయికదా.  అందరికీ ఆత్మారాముడి గోల మొదలయింది.  ఆలయ ఆవరణలోనే మేము తెచ్చుకున్న భోజనాలు చేశాము.  మాతోబాటు ఆలయానికి వచ్చిన నలుగురయిదుగురిని పిలిచి భోజనం పెట్టాము. తర్వాత నెమ్మదిగా అక్కడ వున్న ఆలయాలు చూశాము.  అవేమిటంటే....

 

ఆంజనేయస్వామి ఆలయం:
శివాలయానికి ఎదురుగానే క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామి ఆలయం వున్నది. శ్రీ శివ పంచాయతన ఆలయం ఇక్కడ వున్న ఆలయాలలో మరొకటి శ్రీ శివ పంచాయతన ఆలయం.  దీనిలో మధ్యలో శివుడు, చుట్టూ ఉపాలయాలలో నాలుగు పక్కల ఉపాలయాలలో పార్వతీ దేవి,  కుమార స్వామి, వినాయకుడు, వీరభద్రుడు,  వున్నారు.  ఇక్కడ కుమార స్వామి ప్రత్యేకత ఆరు ముఖాలతో, నెమలి వాహనం మీద ఆసీనుడై వుంటాడు.  ఇలాంటి శిల్పం అరుదట. ఇంకొక శివాలయం కూడా వున్నదిగానీ శిధిలావస్తలో వున్నది.

శ్రీ వీరభద్రస్వామి ఆలయం:
ఒకసారి పక్క వాగు పొంగి వీరన్న (వీరభద్రస్వామి) గొంతుదాకా నీళ్ళొస్తే ఆయన కోపంతో   ఆడదానివి నన్ను తాకే అర్హత నీకు లేదు  అని బొబ్బలు పెడుతూ (అరుస్తూ) శపించాడుట.  అందుకే ఆయన్ని బొబ్బల వీరన్న అంటారు.  తర్వాతెప్పుడూ ఆ వాగు ఆలయాలను సమీపించలేదుట.

శ్రీ రాధా రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయం ఈ ఆలయాలు ప్రైవేటు యాజమాన్యంలోనే వున్నాయిట.  మమ్మల్ని చూసి పక్క ఇంట్లోనే వున్న శ్రీమతి లోకేశ్వరి గారు వచ్చారు.  ఆవిడ అత్యంత శ్రావ్యంగా పాడిన పొడగంటిమయ్యా మిమ్ము, వగైరా పాటలను వింటుంటే మాకెవరికీ అక్కడనుంచీ రాబుధ్ధి కాలేదు.  తర్వాత ఆవిడే  స్వామికి హారతి ఇచ్చారు. సాధారణంగా కృష్ణుడి ఆలయాలు రుక్మిణీ, సత్యభామా సమేతంగా వుంటాయి.  కానీ ఇక్కడ వేణుగోపాలుడు రాధా రుక్మిణీ సమేతుడు.

 

శ్రీ సంకేత్ శర్మగారు చక్కగా అభిషేకం చేయించటమేగాక వివరాలన్నీ ఓపికగా చెప్పారు.  ఈ మధ్య చాలా ఆలయాలలో వివరాలు చెప్పేవారే లేరు.  మాకు తెలియదు, మా తాతల నాటిది అంటారు. తాతల కన్నా అనేక తరాల ముందునుంచీ వున్న ఆలయాల గురించి కూడా.  అందుకనే తెలిసినంత మటుకూ వివరాలు కనుక్కుని అందరికీ తెలియజేద్దామని నా తపన.  శ్రీ సంకేత్ శర్మగారికి ధన్యవాదాలు చెప్పి సాయంకాలం 4-30కి తిరుగు ప్రయాణమయ్యి 8 గం. లకి ఇల్లు చేరుకున్నాము.. జనాల గందరగోళం లేని ప్రశాంత ప్రదేశంలో, కాలువ ఒడ్డున కొంతసేపు గడపాలనుకునే వాళ్ళు, కాలువ స్నానం చెయ్యాలనుకునేవాళ్ళు దర్శించవలసిన ప్రదేశం ఇది.  ఆహారం, మంచినీళ్ళు తీసుకు వెళ్ళటం మరచి పోవద్దు.  అక్కడేమీ దొరకవు. దర్శన సమయాలు   ఉదయం 5 గం. ల నుంచి 12 గం.లదాకా,  తిరిగి మధ్యాహ్నం  2 గం. లనుంచి  9 గం.ల దాకా.

మార్గం:
సిద్దిపేటనుంచి మెదక్ వెళ్ళే దోవలో భోంపల్లి క్రాస్ రోడ్స్ తర్వాత  కుడివైపు కనబడే కమాన్ లోంచి వెళ్తే కూడలి చేరుకోవచ్చు.  

వివరాలకి  శ్రీ సంకేత్ శర్మ   సెల్ నెంబరు   9963092952
sankethsharma@india.com

 

 

 

 

 

 

పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Punya Kshetralu