కైలాస కోన గుహాలయం

(Kailasa Kona Guhalayam)


చిత్తూరు జిల్లా నారాయణపురానికి సమీపంలో కైలాసకోనలో ఉన్న గుహాలయం దర్శించుకోదగ్గ ఆలయం. ఇది కైలాస కోన కొండపై ఉంది. పక్కనే జలపాతం ప్రవహిస్తూ ఆ ప్రదేశం మహా శోభాయమానంగా ఉంటుంది.

 

కైలాస కోన గుహాలయంలో ఒక శివలింగం ఉంటుంది. శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం, దాని పక్కన వీరభద్రుని ప్రతిమ ఉన్నాయి.

 

గుహాలయంలో వీరభద్రుని విగ్రహం పక్కన ఆదిశంకరాచార్యుల శిల్పం ఉంది.

 

పూర్వం ప్రత్యేకంగా దేవాలయాలు నిర్మించడం కంటే ముందు కొండ గుహలనే ఆలయాలుగా మలచేవారు. ఈ గుహాలయాలు ప్రాచీన సౌందర్యాన్ని ప్రతిఫలిస్తూ ముగ్ధమనోహరంగా ఉంటాయి.

 

క్షేత్ర మాహత్యాన్ని అనుసరించి ఈ గుహాలయం కథ ఇలా ఉంది.

 

నారాయణపురంలో పద్మావతీ వేంకటేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని చూసేందుకు కైలాసం నుండి విచ్చేసిన శివపార్వతులు ఇక్కడి ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం ఈ పర్వతం మీదే గడిపారట. పార్వతీపరమేశ్వరులు నివసించడం వల్ల ఈ కొండకు కైలాస కోన అనే పేరు వచ్చిందనే కథనం బహుళ ప్రచారంలో ఉంది.

 

పర్వత ప్రాంతమే ఒక ప్రశాంతతను, మధుర భావనను కలిగిస్తుంది. అలాంటిది చక్కటి గుహాలయం, ఆ పక్కనే మనోహరంగా ప్రవహించే జలపాతం చూడముచ్చటగా ఉంటాయి. ఆ ప్రదేశంలో అడుగు పెట్టగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే అలజడులు, ఆందోళనలు మటుమాయమై ఊరట లభిస్తుంది.


More Punya Kshetralu