దశపాపహర దశమి - గంగావతరణం..!

 


జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష దశమిని ‘దశ పాపహర దశమి’ అని పిలుస్తారు. ఈ రోజు గంగామాత అవతరించిన రోజు. శాస్త్ర విహితంగా కొన్ని విధులను పాటిస్తూ పండుగను జరుపుకోవడం వల్ల పది రకాలైన పాపాలు అంటే దశ పాపాలు తొలగిపోతాయి. కనుక ఈ రోజు ‘దశపాపహర దశమి’గా ప్రసిద్ధి పొందింది. గంగానది ఆవిర్భవించిన రోజు కనుక ఉత్తరాదిన ‘గంగా దశహర గంగోత్సవం’గా పిలుస్తారు. గంగాదేవి ఆరాధనకు ఇది ప్రీతిపాత్రమైన రోజు. గంగాదేవి మాహాత్మ్యాన్ని గురించి స్కాంద పురాణంతో సహా పలు పురాణాలు, స్మృతి కౌస్తుభం, వ్రత నిర్ణయ కల్పవల్లి, వాల్మీకి రామాయణం, మహా భారతంలో గాంగేయుని (భీష్ముని) వృత్తాంతంలో వర్ణించడం జరిగింది. వనవాసానికి వెళ్తూ, సీతాదేవి గంగను పూజించి, తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుతానని మొక్కుకున్నట్టు రామాయణ కథ.
 
ఇంతటి మాహాత్మ్యం ఉన్న గంగామాతను ప్రస్తుతిస్తూ స్కాంద పురాణం
 
‘‘జ్యేష్ఠమాసి సితే పక్షే దశమీ హస్త సంయుతా
హరతే దశపాపాని తస్మార్దశ హరా స్మృతా!’’

 

అన్నది. ఈ రోజు గంగా స్నానం, పూజ దశ విధాలైన పాపాల నుండి విముక్తి కలిగిస్తుంది. లోకంలో మనుషులు తెలిసీ, తెలియక పాపాలను చేయడం సహజం అయితే వాటి నుండి వచ్చే ఫలాలను అనుభవించినప్పుడు కాని పరిస్థితి అర్థం కాదు. అప్పుడు మాత్రమే అశుభాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదృష్టం కొద్దీ మనం చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి ఎన్నో ఉపాయాలను మన పూర్వులు శాస్త్రాల రూపంలో మనకు అందించారు. వాటిని ఆచరించి విముక్తి పొందవచ్చు. అటువంటి అవకాశమే ‘దశ పాపహర దశమీ వ్రతం’.

 

 
పది పాపాలూ..  ఏమిటంటే.?

పది విధాలైన పాపాలను సామాన్యంగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో అప్పుడు చేస్తూనే ఉంటారు. అవి శారీరక, వాచిక, మానసిక సంబంధం కలిగి ఉంటాయి.

 
శారీరకంగా చేసే పాపాలు మూడు. అవి: 

అపాత్రదానం

శాస్త్రం అంగీకరించని హింస చేయడం

పరస్త్రీ లేదా పురుషుని వ్యామోహం కలగటం. 


వాచికంగా (నోటిద్వారా) చేసే పాపాలు నాలుగు. అవి: 

పరుషంగా మాట్లాడడం

అసత్యం పలకడం

చాడీలు

వ్యర్థ ప్రలాపాలు చేయడం

సమాజం వినలేని భాషను ఉపయోగించడం. 

 

మానసికంగా (మనస్సుద్వారా) చేసే పాపాలు మూడు. అవి: 

పర ద్రవ్యాన్ని తస్కరించాలనే దుర్బుద్ధి, ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం, వ్యర్థమైన అహంకారాన్ని కలిగి ఉండడం. వ్రతం ఎలా చేయాలంటే. ఈ రోజున గంగాస్నానం చేయడం వల్ల ఆ పాపాలన్నిటినీ గంగాదేవి హరిస్తుందని స్కాంద పురాణం చెప్పింది. వాస్తవానికి ఇది పది రోజులు ఆచరించవలసిన వ్రతం. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకూ అనుష్ఠించవలసి ఉంది. అందరికీ ఇలా చేయడం కుదరకపోవడంతో ఒక్క రోజుకే- అంటే చివరి రోజైన దశమి నాటికి పరిమితమైంది.


పవిత్రమైన దశపాపహర దశమి రోజున గంగా నదిలో స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. అది కూడా శివుని నివాస స్థానమైన కాశీ క్షేత్రంలోని దశాశ్వమేథ ఘాట్‌లో చేస్తే విశేషమైన ఫలితాన్నిస్తుందని పేర్కొంటోంది. అందుకు వీలుపడని పక్షంలో మరేదైనా నదిలో కానీ, కాలువలో లేదా చెరువులో కానీ, అదీ కుదరకపోతే ఇంటిలోని బావి వద్ద గంగా స్తోత్రం చేస్తూ, భక్తి శ్రద్ధలతోచేయాలి.


 స్నానం చేసేటప్పుడు ఈక్రింది శ్లోకం చదవాలి..

‘‘మమ ఏతజ్జన్మ జన్మాంతర సమూద్భూత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నాన మహం కరిష్యే!’’- అని సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. స్నానం చేశాక- పితృ తర్పణాలు, నిత్యానుష్ఠానాలను యథావిధిగా నిర్వర్తించాలి. తరువాత తీర్థ పూజ చేయాలి. పూజలో ‘‘నమశ్శివాయైు, నారాయణ్యై, దశపాపహరాయైు, గంగాయైు!’’ అనే మంత్రం చెబుతూ నారాయణుణ్ణీ, రుద్రుణ్ణీ, బ్రహ్మనూ, సూర్యుణ్ణీ, భగీరథుణ్ణీ, హిమవంతుణ్ణీ ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజించాలని శాస్త్రవచనం.


 


దశపాపహర వ్రతం చేయడానికి వీలుకానివారు గంగామాత ద్వాదశనామాలు- ‘‘నందినీ, నళినీ, సీతా, మాలినీ, మహాపగా, విష్ణు పాదాబ్జ సంభూతా, గంగా,  త్రిపథగామినీ, భాగీరథీ, భోగవతీ, జాహ్నవీ, త్రిదశేశ్వరి’’ అనే పన్నెండు నామాలను తలచుకుంటూ అందుబాటులో ఉన్న జలవనరులలో మునకలు వేస్తే- గంగానదీ స్నానాన్నీ, వ్రతాన్నీ నిర్వహించగా ప్రాప్తించే ఫలానికి సమానమైన ఫలం పొందుతారని శాస్త్రం చెబుతోంది. దశపాపహర వ్రతం చేసినా, నాడు స్కాంద పురాణయుక్తంగా గంగాస్తవం చేస్తూ గంగలో స్నానం చేసినా సకల సౌభాగ్యాలతోపాటు అష్టైశ్వర్యాలనూ... కరుణాంతరంగ... గంగామాత అనుగ్రహిస్తుందంటారు. ఇహలోక సుఖాలతో పాటు మోక్షం కూడా లభిస్తుందని స్కాంద పురాణ వచనం.


More Shiva