మేషరాశి - అశ్విని 1,2,3,4 (చూ, చె,చో,లా)

భరణి 1,2,3,4 (లీ,లూ, లే, లో) - కృత్తి 1వ పాదం (అ)

ఆదాయం:8      వ్యయం:14     రాజపూజ్యం:4    అవమానం:3

    ఈ రాశి వారికి గురువు వత్సరాది 12-09-2017 భాద్రపద ఒ|| సప్తమి మంగళవారము వరకు 6వ స్థానములో లోహ మూర్తియై ఉండును. తదుపరి వత్సరాంతము 7వ స్థానములో రజిత మూర్తియై ఉండును. శని వత్సరాది 20-06-2017 జ్యేష్ఠ ఒ|| ఏకాదశీ మంగళవారము వరకు 9వ స్థానములో రజిత మూర్తియై ఉండును. తిరిగి 26-10-2017 కార్తీక శు||షష్ఠి గురువారం వరకు వక్రగతుడై 8వ స్థానమున సువర్ణ మూర్తియై ఉండును. తిరిగి వత్సరాంతము 9వ స్థానము రజిత మూర్తియై ఉండును. రాహుకేతువులు 17-08-2017 వరకు రాహువు 5వ స్థానమున, కేతువు 11వ స్థానమున సువర్ణమూర్తులై ఉందురు. తదుపరి వత్సరాంతము రాహువు 4వ స్థానమున, కేతువు 10వ స్థానమున తామ్ర మూర్తులై ఉందురు. సెప్టెంబరు వరకు కాస్త  అతి సామాన్యంగా పరిస్థితులు ఉంటాయి. తరువాత అనుకూలము.

    ఈ విధమైన గ్రహస్థితిని పరిశీలించి చూడగా ఈ సంవత్సరము పనుల యందు నిరాశ-నిస్పృహలను దరిరానీయకండి. పనులు కాస్త ప్రయాసచే పూర్తి చేసుకునే అవకాశము గలదు. పనుల యందు మిశ్రమ ఫలితము లభించగలదు. ప్రతి క్షణమును ఉపయోగించుకునే ప్రయత్నము చేయండి. పట్టుదలతో స్వబుద్ధి, స్వశక్తితతో ముందుకు నడవండి. శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరించండి. అయితే తొందరపాటు మాత్రము పనికిరాదు. కాలయాపన మీ ప్రధాన శత్రువుని గ్రహించండి. పనులు చేయాలని, నూతన విద్యలు అభ్యసించాలని ఆలోచన, కుతూహలము, ఆరాటము ఉంటే సరిపోదు కదా! అందుకు కావలసిన కృషి అవసరము. ఆరంభించి పరిత్యజించకుండా కష్టాలను ఎదురుకొని ధీరోన్నతులై పూర్తి చేసే ప్రయత్నము చేయండి. అక్టోబరు వరకు అత్యుత్సాహము పనికిరాదు. గత సంవత్సరము కన్నా ఈ సంవత్సరము బాగుంటుంది. మీలో ఉన్న రహస్యాలని గాని, వృత్తి పరమైన, వ్యక్తిగతమైన విషయాలని సాధ్యమైనంత వరకు గోప్యంగా గంభీరముగా ఉంచే ప్రయత్నము చేయండి. శ్రమ మీది ఫలితము మరొక్కరిది అయ్యే అవకాశము గలదు. ఆరోగ్య విషయంలో మార్పు అనగా సమస్యలు తీర గలవు. స్త్రీలకు గత సంవత్సరము అనుభవించిన అవస్థలు తొలగిపోగలవు. దుర్జన సాంగత్యము  పొంచి ఉన్నది. తస్మాత్‌ జాగ్రత్త ఆర్థిక పరమైన విషయాలలో అజాగ్రత్త, నిర్లక్ష్యము పనికిరాదు. వర్షారంభములలో పరోక్ష శత్రువుల ద్వారా సమస్యలు ఉత్పన్నము కావచ్చును. వృధా ప్రయాణములు చేయవలసిన పరిస్థితి అధిక  ధనవ్యయము. స్నేహితతుల ద్వారా నమ్మక ద్రోహము, సోదరుల ద్వారా మానసిక అశాంతి, అనవసర వివాదము, ధనము సకాలములో చేతికందిననూ దానిని సద్వినియోగ పరుచుకోలేని పరిస్థితి వివాదాస్పద భూములు కాని, గృహ నిర్మాణ స్థలాలు కాని కొనుగోలు చేయకండి. అనవసర ప్రలోభాలకు లొంగకూడదు. అదాయ మార్గాలు కొందరికి కనిపించకపోవడం ఆర్థిక వనరులు లోపించుట మొ||నవి సంభవించవచ్చును.

 

కొందరికి పేదతనము శాపంగా మారును. తండ్రిగారి ఆరోగ్యము కాస్త చికాకు కల్గించ వచ్చును. వైద్యుడిని సంప్రదించుట, ఔషద సేవనము తప్పక పోవచ్చును. వాహనములు నడుపునపుడు తగు జాగ్రత్తలు అవసరము. నిర్లక్ష్యము అజాగ్రత్త పనికిరాదు. ఫేస్‌బుక్‌, స్నేహాల విషయంలో కూడా కాస్త నియంత్రణ అవసరము. స్వధర్మాచరణలో అనేక ఆటంకములు ఎదురయ్యే అవకాశము గలదు. చట్ట వ్యతిరేకమైన సంఘ వ్యతిరేకమైన పనులు చేసే వారు పరిచమయ్యే అవకాశము గలదు. తస్మాత్‌ జాగ్రత్త. పాప కార్యాసక్తి పెరగవచ్చును. మనస్సుకు వ్యతిరేకముగా ధనం ఖర్చు అయ్యే అవకాశము గలవు. వ్యాపార భాగస్వాముల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడిననూ, కాస్త ఓపిక వహించి ఏమయినా నిర్ణయం తీసుకొన దలచినచో అక్టోబరు వరకు కాస్త వేచి ఉండండి. మతపరమైన, ధర్మపరమైన, ఆధ్యాత్మిక పరమైన విధులు నిర్వహించే వారు అపఖ్యాతిపాలు అగుట జరుగవచ్చును. సెప్టెంబరు 12వ తేదీ వరకు ప్రతి విషయంలోనూ ఒకింత ఓపిక అవసరము. ఆత్మీయుల ఆరోగ్య విషయంలో ఒకింత కలవరము. పరోక్ష అవమానములు ఎదురైనా ఓపికతో వాటిని సహించి సరియైన సమయానికై వేచి ఉండాలని నిర్ణయించుకుంటారు. సన్నిహితులతో అభిప్రాయ భేదాలు రావచ్చును. తగు  జాగ్రత్త అవసరము. తమను ప్రేమించిన వారికి దూరంగా ఉండటయు, అన్యులతో స్నేహ సంపర్కాలు, సంతానము యొక్క ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ చూపాలి. వ్యాపార భాగస్వాములతో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. యజమానుల మధ్యన అభిప్రాయ భేదాలు రావచ్చును. వ్యసనాలకు దూరంగా ఉండండి. పాదములు, ఉదరము, కాళ్ళు మొ||గు అవయవాలకు సంబంధించి సమస్యలు.

    ఈ రకమైన ఫలితాలు చూసి కంగారు పడవలసిన అవసరము లేదు. అక్టోబరు నుండి అన్ని విధాల అనుకూలముగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అభివృద్ధి కనపరుచున్నది. బాధ్యలతో పాటు పదోన్నతి మరియు వేతవ వృద్ధియగును. ఆర్థికపరమైన అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అభివృద్ధి కొరకు ఋణాలు చేయవలసి రావచ్చును. వ్యాపారస్తులు కూడా గతంలో ఉన్నటివంటి సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో స్వంత  యాజమాన్యము ఏర్పడవచ్చును. సంతానానికి ఉన్నత విద్యలు అందిస్తారు. అందు కొరకు కొంత ధనవ్యయము కావచ్చును. విద్యార్థులకు ఉన్నత విద్యలకై ప్రవేశాలు లభిస్తాయి. అవివాణితులకు వివాహ ప్రయత్నాలు సఫలము అవుతాయి. మీ వ్యక్తిత్వానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సంస్కృతి , సంప్రదాయాలు కులాచారము మొ||న విషయాలలో ప్రవేశము, ఆసక్తి పెరుగుతుంది. ఉన్నత స్థాయి  వ్యక్తుల పరిచయం లభిస్తుంది. కొన్ని విషయాలు గోప్యంగా ఉంచవలసిన పరిస్థితి రావచ్చును. మీ అతి మంచి తనం వల్ల ఒకానొక సందర్భంలో నిందలు భరించవలసిన పరిస్థితి ఉత్పన్నం కావచ్చును. స్థిరాస్థిని వృద్ధి చేసుకునే ప్రయత్నాలు సఫలమవుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఋణ భయము గలదు. తస్మాత్‌ జాగ్రత్త. అగ్ని, జల విషయంలో జాగ్రత్త అవసరము. వినోద-విహార యాత్రలలో నీటికి, అగ్నికి దూరంగా ఉండండి. ఇతరులు చేసిన తప్పులకు మీరు జవాబు చెప్పాల్సిన పరిస్థితి. కారణం మీ అతి మంచి తనము కావచ్చును. సంతానము కొరకు వేచి చూస్తున్న వారికి సంతాన సాఫల్యత గలదు. ముఖ్యమైన ప్రయాణాలు లాభిస్తాయి.

    శారీరక సౌష్టవము, దేహకాంతి పెరుగుతుంది. పై అధికారుల సహాయము పెరుగుతుంది. నూతన వాహన ప్రాప్తి గలదు. వాక్‌ చాతుర్యము పెరుగుతుంది. జనాకర్షణ కూడా పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. విద్యార్థులకు శ్రీ హయగ్రీవస్తోత్ర పారాయణం ద్వారా మేధస్సు పెరుగుతుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు కొద్ధిగా ప్రయాసచే సఫలమవుతాయి.

    ఇక రాహు, కేతువుల ఫలితాలు పరిశీలించినట్లయితే వృధా కాలయాన చేసే అవకాశము గలదు. గర్భీణులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తమ పై స్త్రీ-పురుష ఆధిపత్యము పెరుగుతుంది. వివాహాలు, ప్రయత్నాలు కొందరికి వాయిదా పడవచ్చును. ఉద్యోగములో ఆత్మ విశ్వాసము కొందరికి లోపించవచ్చును. కొందరికి ఒకానొక సమయంలో ఒంటరితనము మరియు మానసికంగా నిరాశ ఏర్పడు అవకాశము గలదు. ఊహలలో విహరించడం వాస్తవంలో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడవచ్చును. కొందరికి స్థానచలము కనపడుచున్నది. ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు సకాలంలో చెల్లించే ప్రయత్నము చేయండి. అపరాధ రుసుము కట్టవలసిన పరిస్థితులు ఉత్పన్నము కావచ్చును. ఎంత ఆరాటపడిననూ మానసిక సంతృప్తి ఏర్పడక పోవుట, ప్రయాణాలలో విలువైన వస్తువులు తగు విధంగా భద్రపరుచుకోవాలి. విద్యార్థులు తమ పరీక్షలలో అన్నీ పేపర్స్‌లో ఒకేసారి ఉత్తీర్ణత సాధించుట సందేహము. మతపరమైన వివాదాలలో కొంత అపఖ్యాతి, అగౌరవము, ఎత్తు ప్రదేశాల పై సాహసకృత్యాలు చేయకండి. ప్రమాద సూచనలు కలవు.

    దుర అహంకారము, గాంభీర్యము దరిరానీయకండి. సామాజిక సంబంధాలలో విఘాతము ఏర్పడవచ్చును. ఆకస్మిక ధన ప్రాప్తి అవకాశము గలదు. సంవత్సరము చివరలో కొందరికి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశము గలదు. విదేశాలలో ఉన్న వారికి సంవత్సర మధ్యకాలంలో ఉద్యోగ ప్రాప్తి శాశ్వత నివాస స్థిరత్వానికి మార్గము సుగమము గాగలదు. తీర్థయాత్రలు చేసే అవకాశము గలదు. గృహంలో మరొక్క ఆదాయము అరుధంగాగలదు. వ్యవసాయములో లాభాలు చేకూరును. వృత్తిలో సత్కారాలు, సన్మానాలు లభించును.    ఇంకా ఉత్తమ ఫలితాల కొరకు శని, రాహు, అంగారక ధ్యాన శ్లోకాలు చేయండి. గోసేవ చేయండి. శమీ వృక్షాన్ని పోషించండి.   


More Rasi Phalalu 2017 - 2018