శ్రీ బాలాత్రిపురసుందరీదేవి అలంకారం

 

 

దసరా వచ్చేసింది. ఈ నవరాత్రులూ దేశం అంతా అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతుంది. ప్రతి ఇల్లూ ఓ దేవాలయంగా మారిపోతుంది. ఈ సృష్టకి మూలం అయిన ఆ జగజ్జనని ఆరాధించేందుకు దసరా అంత గొప్ప సందర్భం మరొకటి లేదు. అందుకే ఈ నవరాత్రులలోనూ, అమ్మవారిని తొమ్మిది రూపాలలో కొలుచుకుంటూ తనివితీరా ఆమెని తలుచుకుంటాము. అమ్మవారి ప్రతి ఒక్క రూపానికీ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ రూపంలో అమ్మవారిని పూజిస్తే ఒక ప్రత్యేక ఫలితం వస్తుంది.


నవరాత్రులలో అమ్మవారిని బాలాత్రిపురసుందరి రూపంలో పూజించాలి. త్రిపురసుందరి అంటే ముల్లోకాలలోనూ అందంగా ఉండేది అని అర్థం. త్రిపుర అనే మాటను మూడు కాలాలకు, మూడు స్థితులకు, మూడు శక్తులకూ ప్రతీకగా పేర్కొనవచ్చు. శ్రీచక్రంలో కనిపించే మూడు దేవతలలో బాలాత్రిపుర సుందరి మొదటి దేవత. అందుకే అమ్మవారి అనుగ్రహం కావాలని కోరుకునే సాధకులు ముందు చిన్నపిల్ల రూపంలో ఉండే ఈ బాలాత్రిపుర సుందరి దేవినే పూజిస్తారు. ఈ అమ్మవారి అనుగ్రహంతోనే షోడశ విద్యలు మన సొంతం అవుతాయని నమ్ముతారు.


ఇంతకీ ఈ అమ్మవారిని ఎలా పూజించాలో, దాని వల్ల ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పనే లేదు కదూ!
అమ్మవారిని ఈ రోజు లేత గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించాలి. వీలైతే మనం కూడా ఈ రోజు అదే రంగు వస్త్రాలను ధరించాలి. బాలాత్రిపుర సుందరి అష్టోత్తరాన్ని చదువుకొంటూ, ఆ త‌ల్లిని తుమ్మిపూలతో పూజించాలి. ఈ రోజు అమ్మవారికి బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఒకవేళ  అష్టోత్తరాన్ని చదువుకోలేని పక్షంలో...


అరుణకిరణజాలై రంజితాశావకాశా ।
విధృతజపవటీకా పుస్తకాభీతిహస్తా ।
ఇతరకరవరాఢ్యా ఫుల్లకహ్లారసంస్థా ।
నివసతు హృది బాలా నిత్యకల్యాణరూపా ॥


అనే ధ్యాన మంత్రాన్ని చదువుకోవాలి. ఇది కూడా కుదురలేదంటారా... మరేం ఫర్వాలేదు. అమ్మవారి షొడాక్షరి మంత్రాన్ని చదువుకుంటే చాలు.. ఆ తల్లి ప్రసన్నం అయిపోతుంది. `ఓం ఐం క్లీం సౌ క్లీం ఐం నమః` అన్నదే ఆ షోడాక్షరి మంత్రం. నవరాత్రిలో మొదటి రోజు అమ్మవారిని ఓ చిన్న పిల్లలా అంటే బాలాత్రిపుర సుందరిగా ఊహించుకుంటూ, మనసులో ఈ షోడాక్షరి మంత్రాన్ని ధ్యానం చేసుకుంటే చాలు... మనం తలపెట్టిన పనులన్నీ ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తయిపోతాయి. మనసులో ఇంతకు ముందెన్నడూ రాని లాభసాటి ఆలోచనలు వస్తాయి. దారుణమైన గ్రహదోషాలు కూడా తీరిపోతాయి. పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుంది. గర్భిణీ స్త్రీలకు పండంటి బిడ్డ పుడతాడు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి చదువు బాగా అబ్బుతుంది. రాజకీయ నాయకులు, మీడియాలో ఉన్నవారు ఈ రోజు షోడాక్షరి మంత్రాన్ని నిష్టగా జపిస్తే విజయంతో పాటు కీర్తిప్రతిష్టలూ, ధనసంపాదన మెరుగుపడతాయి. రోజంతా ఈ మంత్రాన్ని జపించిన తర్వాత ఎవరైనా ముత్తయిదువకి రవికల గుడ్డని దానం చేస్తే మరీ మంచిది. ఇక ఈ రోజు అమ్మవారిని బాలాత్రిపుర సుందరిగా పూజించాలనుకునేవారు చల్లటి పదార్థాలను తినడం నిషేదమని శాస్త్రాల్లో పేర్కొంటున్నారు. మరింకేం పైన చెప్పిన పద్ధతిలో అమ్మవారిని బాలాత్రిపుర సుందరి రూపంలో పూజించి ఆమె అనుగ్రహానికి పాత్రులవుదాం.

 


More Dasara - Navaratrulu