వైభవ గోదావరి – 8

భద్రాచలం

తెలంగాణా రాష్ట్రంలో భద్రాచలం దగ్గర గోదావరిని గౌతమి అంటారు. గౌతమ మహర్షిచే తీసుకురాబడిన గంగయొక్క పాయ గౌతమి పేరుతో స్వామికభిముఖముగా, ఆయన కొలువైన భద్రగిరి పాదాలను తాకుతూ ప్రవహిస్తుంటుంది. ఇక్కడ నదీస్నానానికి అనువుగా వుంటుంది. సంకల్పం చెప్పేందుకు గోదావరి ఒడ్డున పురోహితులుకూడా వుంటారు.ఆదివారమునాడు గౌతమిలో స్నానం చేసి శ్రీరామ దర్శనం చేసినా, భద్రగిరి ప్రదక్షిణ చేసినా అత్యంత ఫలప్రదం అంటారు.

బ్రహ్మ పురాణంలో పేర్కొనబడిన భద్రాచలం యొక్క విశేషాలు.... భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుపొందిన దివ్య క్షేత్రం. ఈ భద్రగిరి చరిత్ర ప్రారంభం అయింది రామాయణ కాలంలోనే. ఆ కాలంలో ఈ ప్రాంతమంతా దండకారణ్యం. వనవాసం సమయంలో రాముడు ఇక్కడ గడిపాడని, బంగారు లేడిని చూడటం, మారీచ వధ, రావణుడు సీతను ఎత్తుకుపోవటం అన్నీ ఇక్కడికి కొంచెం దూరంలో వున్న పర్ణశాలలో జరిగాయనీ, ఈ ఆలయం ప్రాంతంనుంచే రాముడు గోదావరి దాటాడని అంటారు. రామాయణం ముగిసి శ్రీ రాముడు వైకుంఠం చేరాడు. కానీ యుగాల తరబడి తపస్సు చేస్తున్న ఆయన భక్తుడు భద్రుడు తన తపస్సు కొనసాగిస్తూనే వున్నాడు. ఆ తపో బలం వల్ల శ్రీ మహా విష్ణువు రామావతారం ముగిసి వైకుంఠం చేరిన చాలాకాలం తర్వాత భక్తునికిచ్చిన మాటకోసం మళ్ళీ వైకుంఠంనుంచి రామావతారంలో వచ్చి ఇక్కడ వెలిశాడు కనుక ఈ రాముణ్ణి వైకుంఠ రాముడంటారు. దానికి సంబంధించిన కధ ఏమిటంటే...

మేరు పర్వత పుత్రుడైన భద్రుడు రాముడు తనపై నివాసం ఏర్పరచుకోవాలని తపస్సు చేశాడు. ఆ సమయంలో రాముడు సీతని కోల్పోయి ఆవిడకోసం వెతుకుతూ వుంటాడు. అందుకని సీతని తీసుకువచ్చిన తర్వాత భద్రుని కోరిక తీరుస్తానని మాట ఇచ్చి సీతాన్వేషణలో వెళ్తాడు. భద్రుడు తన తపస్సు కొనసాగిస్తాడు కానీ రాముడు ఈ విషయం మరచిపోతాడు. తర్వాత అవతార పరిసమాప్తికూడా అవుతుంది.భద్రుడు మాత్రం తన తపస్సు తీవ్రం చేశాడు.  ఆ తపశ్శక్తికి వైకుంఠవాసుడికి భద్రుడి కోరిక గుర్తువచ్చి గజేంద్రమోక్షంలోవలె హడావిడిగా బయల్దేరాడు. విష్ణు మూర్తి అలవాటు ప్రకారం శంఖు చక్రాలు తీసుకున్నాడుగానీ తొందరలో అవి తారుమారయినాయి. కుడిచేతిలో వుండవలసిన సుదర్శన చక్రం ఎడమ చేతికి, ఎడమ చేతిలో వుండవలసిన శంఖు కుడి చేతికీ మారాయి. భక్తుడు కోరుకున్నది రామావతారంగనుక విల్లంబులు తీసుకున్నాడు. (రాముడికి రెండు చేతులే .. కానీ వైకుంఠవాసుడు చతుర్భుజుడుకదా).

శ్రీ లక్ష్మి సీతగా, శేషుడు లక్ష్మణుడుగా వెంటరాగా భద్రుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. చతుర్భుజాలలో శంఖ, చక్ర విల్లంబులతో, సీతా లక్ష్మణ సమేతంగా తనముందు సాక్షాత్కరించిన శ్రీరామచంద్రుని చూసి భద్రుడు పరవశుడై అనేక విధాల ప్రార్ధించాడు. స్వామి భద్రుని వరము కోరుకొనమనగా, నీ సాక్షాత్కారముకంటే ఇంకేమి వరంకావాలి, అయినా కోరుకొమ్మన్నావు గనుక నువ్విప్పుడు నాకు దర్శనమిచ్చిన విధంగానే నా శిరస్సుపై సదా నివసించమని కోరాడు. రామచంద్రుడు కూడా పంచ భూతములున్నంతకాలము భద్రునిపై తాను సీతా, లక్ష్మణ సమేతంగా విలసిల్లుతాననీ, తనతో కూడా భద్రుని దర్శించినవారికి సమస్త శుభములు కలుగుతాయని వరమిచ్చాడు. ఆ విధముగా శ్రీరామచంద్రుడు భద్రుని శిరస్సుపై స్ధిర నివాసమేర్పరచుకుని రామ భద్రుడయ్యాడు, సాక్షాత్తూ జగత్పాలకుని తనపై మోస్తూ భద్రుడు భద్రాచలమయ్యాడు. తర్వాత చరిత్రకందిన కధనం ప్రకారం .......

17వ శతాబ్దంలో అక్కడికి సమీపంలోని భద్రిరెడ్డిపాలెం నివాసి అయిన పోకల దమ్మక్క కలలో శ్రీరాముడు కనిపించి తాను భద్రగిరిమీద వున్నానని, తన మూర్తులని దేవతలు, ఋషులు పూజిస్తున్నారని, ఆవిడని ఆ విగ్రహాలు కనుగొని పూజించమని చెబుతాడు. మర్నాడు ఉదయం ఆవిడ అంతా వెతికి చివరికి ఒక పుట్టలో విగ్రహాలు కనుగొన్నది. గోదావరి నీటితో పుట్ట కరిగించింది. విగ్రహాలకు రోజూ పూజలు చేసి అడవిలో రాలిన పళ్ళు నైవేద్యం పెట్టింది. ఊరివారి సాయంతో స్వామికి నీడకోసం ఆకులతో పందిరి వేసింది. శ్రీరాముడు ఆమెతో తన భక్తుడు ఒకరు తనకు గుడికట్టిస్తారని చెప్పాడు. ఆ గుడికట్టించే భక్తుడికోసం దమ్మక్క ఓపిగ్గా వేచి చూసింది.

క్రీ.శ. 1674 లో కంచర్ల గోపన్న అనే తాసీల్దారు ఈ మందిర నిర్మాణానికి పూనుకున్నాడు. ఆయనే తర్వాత భక్త రామదాసుగా ప్రసిధ్ధికెక్కాడు. గోపన్న మేమమామ అక్కన్న గోల్కొండ ప్రభువు తానీషా దగ్గర మంత్రిగా వుండేవాడు. ఆయన తానీషాతో చెప్పి మేనల్లుడికి తహసీల్దారుగా ఉద్యోగం ఇప్పించాడు. పాల్వంచ తహసీల్దారుగా పని చేస్తున్న గోపన్న ఒకసారి భద్రాచలంలో జరిగే తిరణాలకి ఆ ప్రాంతంవారు వెళ్ళటం చూసి వారితో వెళ్ళాడు. పందిరి కింద వున్న రాముణ్ణి చూసి గుడి కట్టించాలనే తపనతో గ్రామస్తుల దగ్గర చందాలు వసూలు చేస్తాడు. అవి సరిపోక సిస్తుకింద వసూలు చేసిన ఆరు లక్షల రొక్కం తానీషా అనుమతి లేకుండా ఆలయ నిర్మాణానికి ఖర్చు పెడతాడు.

ఆలయం పూర్తికావస్తున్న సమయంలో గోపురంమీద ప్రతిష్టించవలసిన సుదర్శన చక్రం విషయంలో కూడా అవరోధాలెదురయినాయి. ఆ రాత్రి కలలో శ్రీరాముడు గోపన్నకి మరునాడు గోదావరిలో స్నానం చేస్తున్న సమయంలో చక్రం కనబడుతుందని చెబుతాడు. అలాగే మర్నాడు గోపన్న నదిలో స్నానం చేసే సమయంలో సుదర్శన చక్రం దొరుకుతుంది. భగవద్దత్తమయిన ఆ చక్రాన్నే ఆలయ గోపురంపై వుంచి ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. అప్పటినుంచీ గోపన్న కష్టాలపాలయ్యాడు. శిస్తు డబ్బు చెల్లించలేదనే నేరం మీద తానీషా గోపన్నని గోల్కొండలోని చెరసాలలో పెట్టి క్రూర హింసలు పెట్టాడు. 12 సంవత్సరాలు ఆ బందిఖానాలో నానా బాధలు పడ్డ గోపన్న ఆ బాధలు తట్టుకోలేక శ్రీరాముడితో మొర పెట్టుకుంటూ, అర్ధిస్తూ, కోపగించుకుంటూ అనేక కీర్తనలు, దాశరధీ శతకం వ్రాశాడు. అవి ఇప్పటికీ ప్రజలు భక్తితో పాడుకుంటున్నారు.

గోపన్న రామునిపట్ల చూపించిన భక్తివల్ల రామదాసుగా పేరు పొందాడు. తానీషా చాలా అదృష్టవంతుడు. గుడి కట్టించినా గోపన్నకు దొరకని రామ దర్శనం తానీషాకు దొరికింది. రామ లక్ష్మణులు తానీషా దగ్గరకు రామోజీ, లక్ష్మోజీ పేర్లతో గోపన్న సేవకులుగా వెళ్ళి ఆయన చెల్లించవలసిన సుంకం డబ్బు చెల్లిస్తారు. తానీషా వారికి రశీదు కూడా ఇస్తాడు. వారు దానిని గోపన్న తల దగ్గర పెట్టి మాయమవుతారు. మర్నాడు తానీషా గోపన్నను చెర విడిపించి విషయమంతా తెలుసుకుని, రామోజీ లక్ష్మోజీ కట్టిన శిస్తు డబ్బు ఆరు లక్షల మొహరీలు కూడా గోపన్నకు ఇస్తాడు. కానీ రామదాసు వాటిని స్వీకరించక, శ్రీరాముని గుర్తుగా రెండు మొహరీలు మాత్రం తీసుకుంటాడు. అవి ఇప్పటికీ ఆలయంలో వున్నాయి. తానిషా ఆలయ నిర్వహణా బాధ్యత వహించటమేగాక పాల్వంచ పరగణానుంచి వచ్చే సొమ్ము దేవాలయానికి చెందేటట్లు శాసనం చేశాడు. అంతేకాదు స్వామివారి కళ్యాణానికి ఏనుగుమీద ప్రత్యేక అధికారితో ముత్యాల తలంబ్రాలు పంపించసాగాడు. ఆ ఆనవాయితీ నేటికీ సాగుతోంది. స్వామివారి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు తీసుకువస్తారు.

విశేషాలు: భద్రాచల రామభద్రుని గురించి తన తండ్రియైన బ్రహ్మదేవుడిద్వారా విన్న నారద మహర్షి తన భూలోక సంచారంలో ఎక్కువ భాగము ఇక్కడ వుండి శ్రీరామనామము శ్ర్రావ్యంగా గానంచేసి, భక్తులకు బోధించాడు. కబీర్ దాసు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఆయనని దైవ దర్శనానికి అనుమతించలేదు. అప్పుడు స్వామివార్ల విగ్రహాలు మాయమయ్యాయి. కబీర్ దాసుని దర్శనానికి అనుమతించిన తర్వాత అవి మళ్ళీ అందరికీ కనిపించాయి. ఇక్కడ చూడవలసిన ఇంకొక ముఖ్య విశేషం భద్రశిల. ఆలయంలో భద్రుని సన్నిధిలోవున్న పెద్ద బండరాయికి చెవి ఆనించి వింటే మంద్రంగా శ్రీరామ శ్రీరామ అని వినపడుతుంది. భద్రుడు నేటికీ రామనామాన్ని స్మరిస్తూ అక్కడ శిలా రూపంలో వున్నాడని భక్తుల నమ్మకం.

పాపికొండలు: గోదావరి నదిలో ఒక రోజు పాపికొండలు విహారయాత్ర చేసిరావచ్చు. మధ్యలో పేరంటాలపల్లి దగ్గర ఆపుతారు. ఇక్కడ ప్రస్తుతం గిరిజనులచే నిర్వహింపబడుతున్న చిన్న శివాలయం వున్నది. ఇక్కడ పూజారి వుండరు. ఎవరికివారే పూజ చేసుకోవచ్చు. లాంచీవారే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు. లాంచీలు బయల్దేరే ప్రదేశానికి ఆటోలలో వెళ్ళాలి. వీటి బుకింగ్ ఏజెంట్లు ఆలయ పరిసర ప్రాంతాలలో చాలామందే వున్నారు. ఒకటి రెండు చోట్ల టికెట్ రేటు, ఆటోలు ఎవరు ఏర్పాటు చేసుకోవాలి వగైరా వివరాలు కనుక్కుని ముందే ఏర్పాటు చేసుకుంటే మంచిది. లాంచీలో రాజమండ్రిదాకా వెళ్దామనుకున్నా వెళ్ళవచ్చు. అయితే ఈ టూర్ రెండు రోజులు వుంటుంది. రేపు ఆంధ్ర ప్రదేశ్ వెళ్దాము.

- పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Purana Patralu - Mythological Stories