పెదరాయుడి తీర్పు

 

పెదరాయుడి తీర్పు

పెదరాయుడు ఆ రోజు ఒక ముఖ్యమైన గొడవకు సంబంధించిన తీర్పుని ఇవ్వబోతున్నారు. ఆయన తీర్పుని వినడానికి చుట్టుపక్కల గ్రామాల్లోని జనమంతా ఆ ఊరి రచ్చబండ దగ్గరకు చేరారు. అందరూ ఎదురుచూస్తుండగా పెదరాయుడి గుర్రబ్బండి చప్పుడు చేసుకుంటూ రచ్చబండ దగ్గరకు చేరుకుంది. అందులోంచి తొమ్మిదంగుళాల చుట్టని కాలుస్తూ పెదరాయుడుగారు కిందకి దిగి, తన కోసం అద్దెకి తెప్పించిన కుర్చీ దగ్గరకు వెళ్లి కూర్చున్నారు. రాయుడుగారు ఏం తీర్పునిస్తారా అన్ని జనాలంతా ఉద్వేగంగా ఉన్నారు. గొడవకు దిగిన రాము, సోము ఇద్దరూ కూడా తీర్పు తమకు అనుకూలంగా వస్తుందో లేదో అని గోళ్లు కొరికేసుకుంటున్నారు.

ఇంతలో పెదరాయుడుగారు గొంతు సవరించుకున్నారు. ‘నేను తీర్పుని ఇవ్వబోయే ముందు మీ అందరికీ ఓ రహస్యం చెప్పాలి’ అన్నారు. జనాలంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.

‘నిన్న సాయంత్రం మా ఇంటికి రాము వచ్చాడు. తీర్పు తనకు అనుకూలంగా చెప్పమని పదివేలు నాకు ఇచ్చాడు. రాము వచ్చి వెళ్లిన కాసేపటికి సోము వచ్చాడు. తీర్పు తనకే అనుకూలంగా ఉండాలని చెప్పి పదివేల నూటపదహార్లు నా చేతిలో పెట్టాడు. ఈ పెదరాయుడు డబ్బుకి లొంగుతాడనుకున్నారా!’ అంటూ హుంకరించాడు.

రాము, సోము మొహాల్లో నెత్తుటి చుక్క లేదు. ఇంతలో పెదరాయుడుగారు తన జేబులోంచి డబ్బులని బయటకు తీశారు. నిదానంగా సోము దగ్గరకి వెళ్లి ‘నువ్వు రాముకంటే నూటపదహారు రూపాయలు ఎక్కువగా ఇచ్చావు. ఇదిగో ఈ నూటపదహార్లు. ఇప్పుడు మీరిద్దరూ నాకు ఇచ్చిన సొమ్ము సమానం అయ్యింది కాబట్టి, ఇక నేను నిష్పక్షపాతంగా తీర్పుని చెబుతాను’ అంటూ స్లోమోషన్‌లో కుర్చీ దగ్గరకి వెళ్లిపోయారు.