తోడు

 

తోడు

ఓ ముగ్గురు స్నేహితులు ఎడారిలో షికారుకని బయల్దేరారు. కానీ బయల్దేరిన కాసేపటికే దారి తప్పిపోయారు. దారి తెలుసుకుందామని వాళ్లు ఎంతగా పరుగులెత్తినా ఎడారిలోపలికి మరింత చొచ్చుకుపోయారే కానీ ఒక్క చెట్టుని కూడా చేరుకోలేకపోయారు. నిమిషాలు గడిచేకొద్దీ వారి ప్రాణాలన్నీ ఎండకు ఆవిరైపోవడం మొదలయ్యాయి.

‘ఇక నా వల్ల కాదు. నా ప్రాణాలు పోయేట్లున్నాయి’ అన్నాడు మొదటివాడు. ‘నా వల్ల కూడా కాదు’ అన్నాడు రెండోవాడు. ‘మీ ఇద్దరితో పాటే నేనూ చస్తాను’ అన్నాడు మూడోవాడు.

ఆ ముగ్గురి స్నేహితుల కళ్లూ అలా మూతపడబోతున్నాయో లేదో, వారికో సీసా కనిపించింది. అదేమిటో చూద్దామని చేతిలోకి తీసుకుని, మూత తీస్తే ఏముందీ... అందులోంచి ఓ జినీభూతం బయటకు వచ్చేసింది.

‘ఛీ! ఈ పాడు సీసాలో వందల సంవత్సరాలుగా మగ్గిపోయి ఉన్నాను. నన్ను ఈ బందిఖానాలోంచి తప్పించినందుకు కృతజ్ఞతలు. అందుకు బదులుగా మీ అందరికీ తలా ఓ వరాన్నీ ఇస్తాను. కోరుకోండి.’ అన్నాడు జినీ.

జినీని చూడగానే ఆ స్నేహితులకు ప్రాణం లేచొచ్చింది.

‘నేను కళ్లుమూసి తెరిచేసరికి మా ఊరిలో ఉండాలి’ అని కోరుకున్నాడు మొదటివాడు. అనుకున్నట్లుగానే ఎడారి నుంచి మాయమై వాళ్ల ఊరికి చేరిపోయాడు.

‘నేను ఇప్పటికిప్పుడు మా ఊరిలో, ఓ అందమైన భవంతిలో ఉండాలి’ అని కోరుకున్నాడు రెండోవాడు. కోరుకున్నట్లుగానే వాళ్ల సొంత ఊరిలో, ఓ అందమైన భవంతిలో తేలాడు.

వాళ్లిద్దరూ ఒక్కసారిగా మాయమయ్యేసరికి మూడోవాడికి వాళ్ల మీద బెంగ ఏర్పడిపోయింది. కలిసి చావడానికి కూడా సిద్ధమైన వారితో జీవితాంతం కలిసి బతకాలనుకున్నాడు. అందుకే ‘మా ముగ్గురు స్నేహితులూ చచ్చేవరకూ కలిసి ఉండేట్లు వరమియ్యి’ అని జినీని వేడుకున్నాడు.

మూడోవాడి కోరిక విన్న జినీ చిరునవ్వుతూ ‘తథాస్తు’ అనేసి మాయమైపోయాడు. వెంటనే మిగతా స్నేహితులు ఇద్దరూ అక్కడ ప్రత్యక్షమైపోయారు!