TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
కవిగారు గెలిచారు (ఉగాది స్పెషల్)
ఆ కవిగారిని పాపం ఉగాది నాడు ఏ కవిసమ్మేళనానికీ పిలవలేదు. పోనీ ఫోన్లో కవితలు చదువుదామంటే ముందుజాగ్రత్తగా ఎవ్వరూ ఫోన్లు తీయడం లేదు. వీధిలోని జనం ఆయనని చూసీచూడగానే, పరుగు లంకించుకుంటున్నారు. అలాంటి సమయంలో తలుపు చప్పుడైంది. ఎదురుగా చూస్తూ ఒక జంట ధైర్యంగా నిల్చొని ఉంది.
‘చెప్పండి! ఏమిటిలా వచ్చారు?’ అని పలకరించారు కవిగారు.
‘మీ కవితల గురించి విని ఇలా వచ్చాం. ఏదీ ఈ ఉగాది శుభసమయాన ఓ కవితని వినిపించండి!’ అని ప్రాథేయపడింది ఆ జంటలో ఉన్న భార్య.
ఆవిడ ఇలా అడిగిందో లేదో అలా ఉన్నఫళంగా ఆశువుగా ఓ భీకరమైన కవితని వదిలారు కవిగారు. ఉగాది కోయిలనీ, మామిడిపూతనీ, వేపచిగురునీ, కొత్త చింతపండునీ... తన కవితలో చీల్చి చెండాడేశారు.
కవిగారి కవిత ముగిసి రెండో కవితను అందుకునేలోపే, వచ్చిన జంట ఆయన చేతిలో 2,500/- పెట్టి కాళ్ల మీద పడ్డారు.
వారి చేష్టలకి కవిగారి హృదయం చెమ్మగిల్లింది. ‘కవిసమ్మేళనాలలో కూడా ఇంత ప్రతిస్పందన రాలేదు. డబ్బు అసలే రాలేదు. నా కవిత మిమ్మల్ని ఇంతగా ప్రభావితం చేసిందా’ అని అడిగారు ఆనందభాష్పాలతో.
కవిగారి కన్నీరుని చూసిన భార్య అంది కదా ‘మరేం లేదండీ! నేను ఇవాళ చేసిన ఉగాది పచ్చడిని తిని, ప్రపంచంలో ఇంతకంటే భయంకరమైన అనుభవం మరొకటి ఉండదని మా ఆయన అన్నారు. అది తప్పని నిరూపిస్తానని ఐదువేలు పందెం కాశాను. ఇదిగో మీ కవితను వినీవినగానే, తను ఓడిపోయానని మా ఆయన ఒప్పుకోక తప్పలేదు. పందెం సొమ్ములో మీ వంతుగా సగం ఇచ్చుకుంటున్నాను’ అంటూ జారుకుంది.
- నిర్జర.
|