Home » Beauty Care » చర్మానికి కాంతిని అందించే హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్‌లు.. వేసవిలో తప్పక ట్రై చేయండి!
చర్మానికి కాంతిని అందించే హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్‌లు.. వేసవిలో తప్పక ట్రై చేయండి!

మారుతున్న వాతావరణం కారణంగా చర్మం చాలా ప్రభావితం అవుతుంది. చర్మం డల్ గా మారడం, కాంతి కోల్పోవడం, చర్మం కందిపోవడం, చర్మం మీద టాన్ ఏర్పడటం వంటివి ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా జరుగుతాయి. అమ్మాయిలకు వేసవి అంటే చర్మానికి కఠిన పరీక్షలు పెట్టే కాలం. అయితే చర్మాన్ని హైడ్రేటింగ్ గా ఉంచుకుంటే చర్మం అందంగా, కాంతివంతంగా కూడా కనిపిస్తుంది. ఇందుకోసం హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్ లు వాడాలి. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతూ చర్మ కాంతిని మెరుగుపరిచే ఫేస్ మాస్క్ ల గురించి తెలుసుకుంటే..
తేనే, పెరుగు మాస్క్..
తేనె సహజంగా తేమను లాక్ చేస్తుంది, ఇది గాలి నుండి తేమను గ్రహించి చర్మంలోకి పీల్చుకుంటుంది. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం మృత కణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. ఒక టీస్పూన్ తేనెను రెండు టీస్పూన్ల పెరుగుతో కలపాలి. దీనిని ముఖంపై 15-20 నిమిషాల పాటు ఉంచి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.
కలబంద, దోసకాయ మాస్క్..
చర్మం ఎండకు కమిలిపోయినా లేదా బిగుసుకుపోయినట్లు అనిపించినా కలబంద, దోసకాయ మాస్క్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దోసకాయలో 95% నీరు ఉంటుంది, ఇది చర్మాన్ని తక్షణమే తేమగా ఉంచుతుంది. దోసకాయ రసం లేదా తురిమిన దోసకాయను తాజా కలబంద జెల్‌తో కలపాలి. దీనిని ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ మాస్క్ తేమను అందించడమే కాకుండా, చర్మపు చికాకును కూడా తగ్గిస్తుంది.
అరటి పండు, ఆలివ్ నూనె మాస్క్..
అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మం స్థితిస్థాపకతను కాపాడతాయి. ఆలివ్ నూనె తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి, అర టీస్పూన్ ఆలివ్ నూనె కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇది చర్మం మీద ముడుతలు రాకుండా అడ్డుకోవడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
బొప్పాయి, పాలు మాస్క్..
బొప్పాయిలో చర్మాన్ని కాంతివంతం చేసే పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, అలాగే పచ్చి పాలు ఒక అద్భుతమైన సహజ క్లెన్సర్, మాయిశ్చరైజర్. కొన్ని బొప్పాయి ముక్కలను పేస్ట్‌లా చేసి, దానికి 2 టేబుల్ స్పూన్ల పచ్చి పాలు కలపాలి. దీనిని ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేయాలి. ఈ మాస్క్ టానింగ్‌ను తొలగించి, చర్మాన్ని తేమగా ఉంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఓట్స్, పాలమీగడ మాస్క్..
ఓట్స్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి, పాల మీగడలోని కొవ్వులు పొడి చర్మానికి లోతైన పోషణను అందిస్తాయి. పొడి చేసిన ఓట్స్‌ను కొద్దిగా పాల మీగడతో కలపాలి. దీనిని స్క్రబ్‌లాగా అప్లై చేసి, సున్నితంగా రుద్దాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి.
*రూపశ్రీ.
