Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial- 29
?>

తిరుమల వైభవం సీరియల్ - 29

Tirumala vaibhavam Serial- 29

దేసు వెంకట సుబ్బారావు

 

కప్పములు

తిరుమగనార్ క్కానికలు తిరుత్తాయర్ క్కానికలు, ఓడిపోయిన రాజుల విజయం పొందిన రాజులకు చెల్లించే పన్నులు.

 సింగయ ధాన్నాయక

తిరువేంకట నాథ యాదవ రాయల దగ్గర సేనాధిపతిగా చాలాకాలం ఉన్నాడు. అతని మరణానంతరం హొయసల రాజైన మూడవ వీరవల్లాల దగ్గర మంత్రిగా ఉన్నాడు. హొయసల రాజు మరణానంతరం శ్రీరంగనాథ యాదవ రాయల వద్ద మహామంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత స్వతంత్ర రాజుగా క్రీస్తుశకం 1342-43 నుంచి క్రీస్తుశకం 1348 వరకు పాలించాడు. తిరువేంకట నాథ యాదవ రాయలు హొయసల రాజైన మూడవ వీర వల్లాల కంటే వయసులో పెద్దవాడు. 15 సంవత్సరాలు హొయసల రాజులకు సామంతునిగా ఉండి మరణించాడు. క్రీస్తుశకం 1336-37 వరకు తొండమండలాన్ని పాలించాడు.

రంగనాథ యాదవ రాయలు

తిరువేంకటనాథ యాదవ రాయల కుమారుడు శ్రీరంగనాథ యాదవ రాయలు. తండ్రి అనంతరం తొండ మండలాధీశ్వరునిగా క్రీస్తుశకం 1336-37 లో రాజ్యపాలన స్వీకరించి సుమారు 20 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు. తురుష్కుల ప్రాబల్యం పెరుగుతున్న ఆ కాలంలో అనిశ్చిత పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడాడు. అంతరించిపోతున్న హిందూ మతాన్ని సంరక్షించడానికి హొయసల రాజ్యాన్ని, అప్పుడే అవతరిస్తున్న విజయనగర సామ్రాజ్య సంరక్షణతో బాటుగా తన పలుకుబడి పెంపొందించుకోడానికి శ్రీరంగనాథ రాయలు యుద్ధం చేయక తప్పలేదు. హొయసల రాజ్యాన్ని మూడో వీరవల్లాల పరిపాలిస్తూ ఉండేవాడు. వయసులో చాలా పెద్దవాడు. రంగనాథ యాదవ రాయలు తొండ మండలం చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ ఓడించి వారిని తన సామంతులుగా చేసుకున్నాడు. విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారకులైన సంపతవు వంశీయులు మొదటి హరిహరరాయలు, మొదటి బుక్కరాయలు రంగనాథ రాయలకు సమకాలికులుగా ఉన్నారు. హైందవ మత పునస్థాపనకు నాంది పలికిన విజయనగర స్థాపనాధిపతులతో ఐక్యంగా ఉండటం మేలని శ్రీరంగనాథ యాదవ రాయలు తలచాడు. వెంటనే తొండమండలాన్ని విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేశాడు. విజయనగర రాజులకు సామంతుడయ్యాడు. శాంతిని నెలకొల్పాడు. శత్రువులను పారదోలి విజయఢంకా మోగించిన రంగనాథ రాయలు తన విజయ దీపిక జ్ఞాపకార్ధం తిరుమలలో ఉత్తరమాడ వీధిలో ఒక రాజసౌధాన్ని కట్టించాడు. తాను తిరుమలకు వెళ్ళినప్పుడు ఆ సౌధంలో బసచేసేవాడు. ఈ సౌధం ప్రస్తుతం కనపడటంలేదు. కానీ, కట్టడపు అవశేషాలను నేటికీ చూడొచ్చు.

ఈ రాజు తిరుమలను పుష్పవనాలతో, మఠాలతో నింపాడు. స్వామివారికి పార్వేటి ఉత్సవాన్ని జరిపించినట్లు శాసనాలు తెల్పుతున్నాయి. తిరుపతిలో శ్రీగోవిందరాజస్వామి దేవాలయంలో ప్రతిష్ఠించిణ శ్రీరామానుజాచార్యులకు నిత్య నైవేద్యానికి తిరుపతికి పశ్చిమాన కొంత భూమి కేటాయించారు. ఈ భూమికి నీటి వసతి లేకపోవడంతో ఎగువన ఉన్న చెరువు నుంచి నీటి వసతిని కల్పించారు. ఆ చెరువు శ్రీవేంకటేశ్వరస్వామి వారిది. ఈ చెరువు నుంచి నీటి వసతిని పొందినవారు సంవత్సరానికి 200 రూపాయలు స్వామివారి భాండాగారానికి జమచేస్తుండేవారు. ఈ చెరువునే పెరి-ఏరు చెరువు అనేవారు. కాలక్రమంలో అది పేరూరు చెరువుగా స్థిరపడింది. పేరూరు, పేరూరు చెరువు శ్రీస్వామివారి సర్వమాన్యాలు. అందుకే జియ్యరుస్వామి నీటి పన్నుగా 200 రూపాయలు స్వామివారి ఖజానాకు ''తిరుమూన్ క్కానికై''గా జమచేసే ఆ చెరువు నీటిని తీసుకునేవారు. ఈ ఏర్పాటు శ్రీరంగనాథ యాదవ రాయల అనుమతితో జరిగింది. క్రీస్తుశకం 1310 లో మాలిక్ కావూర్ దక్షిణ భారత దేశంపై దండెత్తి, తిరుచునాపల్లిని ముట్టడించినప్పుడు శ్రీరంగం నుంచి శ్రీరంగనాథస్వామి ఉత్సవ విగ్రహాన్ని అత్యంత రహస్యంగా తిరుమలకొండకు చేర్చారు. శ్రీరంగనాథస్వామికి ఓ ప్రత్యేక ఆలయాన్ని తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలోనే కట్టించారు. అది శ్రీరంగనాయక మండపంగా తిరుమల ఆలయంలో మహాద్వారం దాటగానే కనిపిస్తుంది.

ఈ మంటపంలోనే శ్రీరంగనాథుని ప్రతిష్టించారు. ఈ మండపాన్ని కట్టించింది కూడా శ్రీరంగనాథ యాదవ రాయలే. శ్రీరంగనాథ యాదవ రాయలు శ్రీస్వామివారికి అత్యంత భక్తుడు. అతను శ్రీస్వామివారికి నైవేద్యమైన తర్వాతనే భోజనం చేసేవాడు. ఈ విషయం తెలియదానికి ఒక ఎత్తైన ఘంటామండపాన్ని తిరుపతి నుంచి తిరుమలకు పోయే కాలిబాటలో మామండూరు మిట్టకు అవతల, శ్రీలక్ష్మీనరసింహ దేవాలయానికి కొంతదూరంలో కట్టించాడు. శ్రీవారి దేవాలయంలో నైవేద్య సమయాన్ని తెలియచేసే ఘంటా నినాదం విన్న తర్వాత ఈ పర్వతంపై ఉన్న ఘంటామండపం లోని గంటని మోగిస్తారు. ఈ నినాదం చంద్రగిరి కోటలో ఉన్న రాజుకు వినపడేది. ఆ తర్వాత రాజు భోజనానికి ఉపక్రమించేవాడు. ఇది శ్రీరంగనాథ యాదవ రాయల కాలంలో ఆ రాజు ఉన్నంతవరకు ప్రతి నిత్యం జరిగేది. కాలిబాటలో ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి గుడికి సమీపంలో ఈ మంటపం ఇప్పటికీ ఉంది. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంవారి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ ఘంటా నాదం స్వామివారికి చేసే నైవేద్య సమయానికి ప్రత్యక్ష ప్రసారం చేసి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలవారు స్వామివారి ఘంటా నినాదాన్ని వినే సౌకర్యం చూపిస్తుంది.

హోబల యాదవ రాయలు

యాదవ రాజులలో హోబల రాయలు కడపటివాడు. ఈ రాజు తంజావూరును పాలించాడు. హోబల యాదవ రాయలు శ్రీ స్వామివారికి (మూలవర్లకు) వైకుంఠ హస్తమని పిలిచే వరదా హస్తానికి బంగారు తొడుగు చేయించాడు. మొట్టమొదటి బంగారు తొడుగు వేయించిణ రాజు కూడా ఈయనే. ఈ విషయాన్ని సంస్కృతంలోనూ, తమిళంలోనూ శాసనం వేయించాడు. తమిళ శాసనంలో ఇతని పేరు ఓబులనాథుడని పేర్కొన్నారు. తిరుమలకొండను ''వడవేంకటం'' అని పేర్కొన్నారు. అంటే ఉత్తరపు సరిహద్దుణ ఉన్న వేంకటాచలమని అర్ధం. ఈ వేంకటాచలంలో ఆరోగ్యపరమైన అత్యంత అద్భుతమైన సువాసనలు వెదజల్లే మూలికలు లభ్యమౌతున్నాయని కూడా ఆ శాసనంలో పేర్కొన్నారు.

తెలుగు చోళులు

నెల్లూరును పాలించిన తెలుగు చోళులు కరికాళ చోళుని వంశ పరంపరలో చేరారు. తెలుగు చోళులలో ఎర్రసిద్దన ప్రధముడు. అతని కుమారుడు మనుమసిద్ధప్ప. అతని అల్లుడు తిరుక్కాళత్తిదేవుడు. ఇతను తన తండ్రి జ్ఞాపకార్ధం నందలూరు (కడప జిల్లా) లోని దేవాలయానికి అఖండ దీపాలను దానం చేశాడు. ఇది క్రీస్తుశకం 1209లో జరిగింది. ఈతడు మూడో రాజరాజ చోళుడు ఉన్నంతవరకు సామంతునిగా ఉన్నాడు. ఆ తర్వాత కొద్దికాలానికి స్వతంత్రుడిగా ప్రకటించుకుని తొండమండలంలో కొంత భాగాన్ని పరిపాలించాడు. శ్రీవారి సన్నిధిలో రంగనాథునికి రక్షణ అలున్ తిరుక్కాళత్తి దేవుడు భూములను, గ్రామాలను, గుళ్ళు, గోపురాలను దానం ఇచ్చాడు. క్రీస్తుశకం 1230లో చిన్న కాంజీవరంలో వెలసిన ''అరుళ్ళాప్పె రుమాళ్'' గుడిలో ''గండ గోపాలుని సంధి'' అనే పేరుతో నైవేద్యాన్ని స్వామికి జరిపెట్టు ఏర్పాటు చేశాడు. ఇతని పరిపాలనా కాలం ఏడేళ్ళే. అలున్ తిరుక్కాళత్తి దేవునికి అనేక పేర్లున్నాయి. తిక్క నృపతి అని, చోళ తిక్క అని, చోళ స్థాపనాచార్య అని, గండ గోపాలదేవుడని, మధురాంతక పొత్తాపి చోళ అని, త్రిభువన చక్రవర్తి అని పిలిచేవారు. ఇతను కర్ణాటక సోమేశుని, శంఖురాజును, యుద్ధంలో ఓడించి చోళుళ ప్రతిష్టను పెంచాడు. సేరువానూరులోని భూములను తిరుమల శ్రీవారికి దానంగా ఇచ్చాడు. ఇతని కుమారుడు రెండో మనుమసిద్ధి. మనుమసిద్ధి మనవడు మూడో మనుమసిద్ధి. ఈతడు దాయాదుల పోరులో ఓడిపోయి తరిమివేయబడ్డాడు.

ఆ సమయంలో మహాభారతం 15 పర్వాలు రచించిన తిక్కన సోమయాజి కాకతీయ గణపతిదేవుని సాయంతో మనుమసిద్ధిని తిరిగి రాజ్యానికి అధిపతిని చేశాడు. తెలుగు పల్లవులు ఇతని దగ్గర పనిచేసే అధికారి, కాశ్యపగోత్రుడు, అమ్మైయప్పన్ లేక అన్నన్ పెరుమాళ్ ప్రియాన్ అనే వ్యక్తి ఆలయ దీపారాధనకై 32 గోవులను, ఒక ఆబోతును దానం చేశాడు. ఇదే కాలంలో నారాయణపుర నివాసి, వర్తకుడు అమరకన్ దీపస్తంభానికి మూడు మాడలు, కర్పూర హారతికి 12 మాడలు ఇచ్చాడు. మహామండలేశ్వర త్రిపురాంతక దేవుడు తెలుగు పల్లవుడు. ఈ రాజు తక్కెళం, తిరువలాంగాడులో ఉన్న దేవాలయాలకు అనేక దానాలు చేశాడు. ఈ దానాలు విజయ గండ గోపాలుని 3వ, 18 వ, 24వ పరిపాలనాకాలంలో చేశారు. ఈ త్రిపురాంతక దేవుడు అలున్ - చోళతిక్క తెలుగు చోళుని వద్ద క్రీస్తుశకం 1156 నుంచి క్రీస్తుశకం 1234 వరకుమంత్రిగా ఉన్నాడు. ముగింపు పల్లవులు, చోళులు, పాండ్యులు, యాదవులు, కాడవులు తదితరుల పాలనా కాలంలో స్వామివారి సన్నిధిలో నేతిదీపాలు వెలిగించడాన్ని ఆచారంగా పాటించారు. ఒక దీపం స్వామివారి సన్నిధిలో వెలిగించాలంటే 40 కొలంజుల బంగారం స్వామివారి ఆలయానికి చెల్లించాల్సిందే.

కొంతకాలం తర్వాత బంగారం చెల్లించలేనివారు 32 ఆవులు, ఒక ఆంబోతు గుడికి కానుకగా సమర్పిస్తే స్వామి సన్నిధిలో దీపం వెలిగించేలా ఏర్పాటు చేశారు. ఇది ఒక పద్ధతిగా నియమాన్ని అనుసరించి కొనసాగేది. ఈవిధంగా విజయనగర సామ్రాజ్య స్థాపన వరకు జరిగింది. విజయనగర స్థాపనానంతరం శ్రీవారికి ఉత్సవాలు చేయడం, రకరకాల రుచికరమైన నైవేద్యాలు అర్పించడం అధిక మోతాదులో జరిగింది. క్రీస్తుశకం 1260 నుంచి క్రీస్తుశకం 1360 వరకు సుమారు 100 సంవత్సరాలు భారతదేశ చరిత్రలోనే నూతన అధ్యాయం ప్రారంభమైందని భావించవచ్చు. తురుష్కుల ప్రాబల్యం దక్షిణ భారతదేశంలో ప్రభవించింది. క్రీస్తుశకం 1260 నుంచి క్రీస్తుశకం 1360 మధ్యలో అనేకమంది సామంత రాజులు అదను కోసం ఎదురుచూస్తూ స్వతంత్ర రాజులుగా ప్రకటించుకున్నారు. వీరు స్వతంత్రంగా పరిపాలన సాగిస్తూ, తమ వంతు సేవలను తిరుపతిలోని శ్రీగోవింద రాజస్వామికి, తిరుమలలోని శ్రీస్వామివారికి ఎనలేని సేవలు చేశారు. భూములు, గ్రామాలు, స్వామివారికి కానుకగా చెల్లించుకున్నారు. కొలమానాలు ఆ కాలంలో ధాన్యాన్ని కొలుచు కొలమానం ''తుంబు'' అని పిలిచేవారు. ఇంకా ''వట్టి'' లేక ''పుట్టి'' అనే కొలమానం కూడా వాడుకలో ఉండేది. తుంబు'కు రెండింతలు పుట్టికి సమానమౌతుంది. ఆ కాలంలో శ్రీ గోవిందరాజస్వామి గుడి (తిరుపతి)లో వాడుతున్న కొలమానం పేరు ''చాళుక్య నారాయణకల్''. అలాగే శ్రీవారి ఆలయంలో వాడుతున్న కొలమానం పేరు ''ఉచ్చియల్ నిన్ట్ర నారాయణన్ మరక్కల్''. ఈ కొలమానాన్నే ''మలైకునియ నిన్ట్రాన్ కల్'' అని కూడా పిలిచేవారు. నాణాలు ''వరహాపణం'', ''మడై''. ఇవి అప్పట్లో పిలిచే నాణాల పేర్లు. ''మాడై'' అనేది బంగారు నాణెం. దీన్ని వాడుకలోకి తెచ్చింది తెలుగు పల్లవుడైన విజయ గండగోపాలుడు. ఆ కారణంగా ఆ నాణానికి ''గండగోపాలమాడై'' అని కూడా పేరు. ఈ రాజు ఒక కొత్త నాణాన్ని సైతం విడుదల చేశాడు. ఆ నాణాన్ని గండగోపాలన్ పుడుమడై అని పిలిచారు. ఈ బంగారు నాణెం అచ్చమైన బంగారంతో కూడినదై జయిన్ కొండ, చోళ మండలమంతా చలామణిలో ఉండేది. ఈ నాణెం ఏడున్నర వంతులకు సమానం వరహా పణం.

విజయనగర సామ్రాజ్య స్థాపనకు ముందు, తర్వాత భారతదేశ పరిస్థితిని గమనిద్దాం. ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తానులుగా ఖిల్జీ వంశీయులు పాలనకు వచ్చారు. అప్పుడే దక్షిణ భారతంలో దేవగిరి రాజధానిగా యాదవరాజులు, ఓరుగల్లు రాజధానిగా కాకతీయులు, ద్వారాసముద్రం రాజధానిగా హొయసలరాజులు, మధుర రాజధానిగా పాండ్యరాజులు ఏలుబడిలోకి వచ్చారు. అల్లా-ఉద్దీన్ (ఖిల్జీ గవర్నరు) దేవగిరిని దోచుకున్నాడు. ఆపై ఢిల్లీ సుల్తానయ్యాడు. ఉలుగుఖాన్ పేరును మార్చుకుని అల్లా-ఉద్దీన్ అయ్యాడు. మహమ్మద్ బీన్ తుగ్లక్ అని ఇతనికి ఇంకో పేరు కూడా ఉంది. ఈ అల్లా-ఉద్దీన్ క్రీస్తుశకం 1303 లో దక్షిణ భారతదేశ దండయాత్రను తలపెట్టాడు. కానీ కొనసాగలేదు. మళ్ళీ 1310లో మాలీకాఫర్ ను పురికొల్పాడు. మాలీకాఫర్ ఓరుగల్లును పట్టుకున్నాడు. కాకతీయ ప్రతాపరుద్రుని అపార సంపదలు దోచుకుపోయాడు. అలాగే మైసూరు హొయసల రాజులను ఓడించి వారి సంపదలను దోచుకున్నాడు. ఆపై తమిళ రాజ్యమైన మధురపై పడి పాండ్యరాజులను బాధించాడు. మధుర తురుష్కుల పాలనలోకి వచ్చింది. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి దేవాలయాన్ని దోపిడీ చేసేందుకు సిద్ధపడ్డారు. కానీ కొనసాగలేదు. అయితే ముందుగానే మాలీకాఫర్ దండయాత్రను పసిగట్టిన శ్రీవైష్ణవులు శ్రీరంగనాథస్వామి ఉత్సవర్లను రహస్యంగా తిరుమలకొండకు చేరవేశారు. అక్కడి దేవాలయాన్ని మూసివేశారు.

మాలీకాఫర్ దక్షిణదేశ దండయాత్రలో తిరుమల తిరుపతి వైపు రాలేదు. వారే వచ్చి ఉంటే తిరుమల దేవాలయం ఏమై ఉండేదో?! ఆ స్వామియే రక్షించుకున్నాడు కాబోలు. విశిష్టమైన శిల్ప సౌందర్యంతో అలరారే ఒకానొక మంటపాన్ని శ్రీరంగనాథస్వామికి తిరుమల దేవాలయంలో ఆనాటి చంద్రగిరి రాజైన శ్రీరంగనాథ యాదవరాయలు కట్టించారు. సుమారు 60 సంవత్సరాలు శ్రీరంగనాథస్వామి ఆ దేవాలయంలో శరణార్థిగా ఉన్నాడు. వారికి త్రికాల పూజలు, ధూపదీప నైవేద్యాలు సక్రమంగా జరుగుతుండేవి. శ్రీరంగనాథస్వామి తిరుమల రాకతో తమిళ ప్రాబల్యం తిరుమల దేవాలయంలో బాగా చోటు చేసుకుంది. మైసూరు రాజ్యంలోని ''సెంజి'' గవర్నర్ గోపన్న తిరుమల శ్రీవారి దర్శనార్థమై వచ్చి శ్రీరంగనాథుల రాకను తెలుసుకుని, దక్షిణ భారతంలో తురుష్కుల ప్రాబల్యం తగ్గినా తర్వాత శ్రీరంగనాథస్వామిని తిరుమల దేవాలయం నుంచి తరలించి ముందు సెంజికోటలో సింగవరం లో సుమారు మూడేళ్ళ పాటు ఉంచి తర్వాత శ్రీరంగదేవాలయానికి చేర్చాడు. అది క్రీస్తుశకం 1372లో జరిగింది.

మాలీకాఫర్ దక్షిణ భారతదేశ దండయాత్ర జరిగింది క్రీస్తుశకం 1310లో. శ్రీరంగనాథుని తిరుమల దేవాలయంలో ప్రతిష్ఠించింది క్రీస్తుశకం 1310కి ముందు. తిరుమల దేవాలయం నుంచి శ్రీరంగనాథుని తరలించింది క్రీస్తుశకం 1369లో. సెంజికోటలోని సింగవరంలో ఉంచింది క్రీస్తుశకం 1372వరకు. శ్రీరంగనాథుని శ్రీరంగంలో తిరిగి ప్రతిష్ఠించింది క్రీస్తుశకం 1372లో.

విజయనగర సామ్రాజ్యం

విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు వంశాలు పాలించాయి. 1.సంగమవంశం. 2.సాళువ వంశం. 3.తుళువ వంశం. 4.ఆరవీడు వంశం. సంగమ వంశం సంగముని కుమారులు హరిహర, బుక్కరాయలు. వీరు కాకతీయ ప్రతాపరుద్రుని కొలువులో కోశాధికారులుగా ఉన్నారు. ప్రతాపరుద్రుడు తుగ్లక్ కు బందీ కావడంతో వీరు పారిపోయారు. అయినా తుగ్లక్ వీరిని చేరదీసి ఉద్యోగాలిచ్చాడు. వీరు కంపిలలో (ఆనెగొంది) శాంతిభద్రతలను నెలకొల్పాడు. తుంగభద్రా నదీ తీరాన ఉన్న మాధవవిద్యారణ్య స్వ్వామి హరిహరరాయలకు, బుక్కరాయలకు ఊపిరి పోసి విజయనగర సామ్రాజ్య స్థాపనకు నాంది పలికారు. క్రీస్తుశకం 1336 మే 4వ తేదీన హరిహరరాయలు పట్టాభిషేకంతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. హిందూ రాజ్యమని ప్రకటించారు.

ఈ విజయనగర సామ్రాజ్య స్థాపన రాజ్యకాంక్షతో జరిగింది కాదు. ఆనాడు నశించిపోతున్న హిందూ ధర్మాన్ని మహమ్మదీయుల నుంచి కాపాడటానికి ఈ రాజ్యం ఏర్పడింది. ఓరుగంటి కాకతీయ రాజ్యం పడిపోవడంతో హిందువులకు నిలవనీడలేని పరిస్థితి దాపురించింది. అలాంటి పరిస్థితుల్లో హిందువులకు, హిందూ ధర్మపునరుద్ధరణకు విజయనగర సామ్రాజ్య స్థాపన అవకాశం కలిగించింది. ఇందుకు కారణభూతమైనది విద్యారణ్యస్వామి. ఆయన కృషి ఎనలేనిది. అమోఘమైనది. ఫలితంగా హరిహరరాయలను, బుక్కరాయలను హిందూ ధర్మపరిరక్షణకు కంకణం కట్టుకున్నారు.

విజయనగర రాజుల కాలంలో దేవాలయాలను పునరుద్ధరించారు. కొత్తగా గుళ్ళు కట్టారు. చిత్రవిచిత్రమైన మంటపాలు శిల్ప నైపుణ్యంతో కట్టారు. ప్రాకారాలు, గోపురాలు నిర్మించారు. దీపాలకు బదులుగా స్వామిసన్నిధిలో నైవేద్యాలు పెరిగాయి. అన్నప్రసాదాలు పర్వతంలా స్వామిసన్నిధిలో పోగుచేసి నైవేద్యాలు చేసేవారు. దీన్ని తిరుప్పావై అని పిలిచేవారు. ఈ నైవేద్యం శ్రీస్వామి సన్నిధిలో నిత్యం జరిపిస్తుండేవారు. ఇది ఇప్పుడు ఒక్క గురువారమే జరిపిస్తున్నారు. అన్నప్రసా ఇప్పుడు త్రికాల పూజల్లోనే నైవేద్యం చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఎప్పుడు పడితే అప్పుడు దినమంతా నైవేద్యం చేస్తుండేవారు. దీన్ని సంధిపూజ అని పిలిచేవారు. ఈ సంధి పూజలు రాజుల పేరుతో జరుగుతుండేవి. ఉదాహరణకు గండగోపాలుని సంధి, నారాయణసంధి, బుక్కరాయసంధి, నరసింహరాయ సంధి, రాయల సంధి ఇత్యాదులు. సంధి అంటే ఒక సేవకు, మరో సేవకు మధ్య జరిగే నైవేద్యం. అంటే సుప్రభాతానికి, తోమాలసేవకు అర్చనకు మధ్య జరిగే నైవేద్యసేవ. అర్చనకు, ఉదయ కాలపూజకు మధ్య జరిగే నైవేద్యం. ఇలాంటి సంధ్య పూజలు ఇప్పుడు లేవు. ఇప్పుడు కేవలం త్రికాల పూజలు అంటే మొదటి ఘంటా నైవేద్యం, రెండో ఘంటా నైవేద్యం, రాత్రి ఘంటా నైవేద్యం మాత్రమే జరుగుతున్నాయి. శ్రీవారి దేవాలయంలో తొలుత ఏర్పాటు చేసిన సంధిపూజ ''బుక్కరాయ సంధి''. ఈ సంధిపూజలో నేతి పొంగలి అంటే బియ్యం, పెసరపప్పు, నెయ్యిలతో తయారుచేసే ప్రసాదం. ఈ ప్రసాదాన్నే ''తిరుప్పోనాకం'' అని కూడా పిలిచేవారు. క్రీస్తుశకం

1446లో పెద్ద జియ్యరు మఠానికి చెందిన కోవిల్ కెల్వి ఎంబేరుమన్నార్ జియ్యరుస్వామి రెండు తిరుప్పోనకల్ ప్రసాదాలను శ్రీవేంకటేశ్వరస్వామికి నైవేద్యం చేసేట్లుగా పెద్ద జియ్యంగారు ఏర్పాటు చేశారు. అలాగే క్రీస్తుశకం 1459లో రెండు తిరుప్పోనక ప్రసాదాలను శ్రీవేంకటేశ్వరస్వామికి నైవేద్యం చేసేట్టుగా పెద్ద జియ్యంగారు ఏర్పాటు చేశారు. బుక్కరాయలు తిరుమల శ్రీస్వామివారికి రెండు పర్యాయాలు సంధి పూజ జరగడానికి ఒకానొక గ్రామాన్ని సర్వమాన్యంగా శ్రీస్వామివారికి సమర్పించారు. ఈ సంధి పూజలు తర్వాతి రోజుల్లో బుక్కరాయల సంధిగా ప్రసిద్ధి పొందాయి.

 

ఇంకా ఉంది...

 

Tirumala vaibhavam Serial-29, tirumala glorious history and vijayanagara kingdom, tirumala sandhi pujas in olden days, tirumala first bell second bell naivedyam, prasadam in tirumala venkateswara temple