Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial- 9
?>

తిరుమల వైభవం సీరియల్ - 9

Tirumala vaibhavam Serial- 9

దేసు వెంకట సుబ్బారావు

ఆళ్వారుల్లో నాల్గవవారు తిరుమలశై ఆళ్వారులు. వీరు కూడా తొలి ఆళ్వారుల కాలానికే చెందినవారు. తిరుమలశై ఆళ్వారులు తమిళనాడులోని తిరుమలిశై అనే పట్టణానికి చెందినవారు. ఈ పట్టణం కాంచీపురానికి, మహాబలిపురానికి, మైలాపురానికి సమాన దూరంలో ఉంది. పై మూడు ప్రాంతాలూ కూడా తొలి ఆళ్వారులు జన్మించిన పట్టణాలు. ఈ తిరుమలశై పట్టణాన్ని మహి సారపురం అని పిలిచేవారు. మహి అంటే భూమి.. సారం అంటే సస్యశ్యామలం - అని అర్ధం. ఈ పట్టణం జగన్నాథస్వామివారి ఆలయానికి ప్రసిద్ధి. ప్రకృతి సంపదలతో పరవశించే ఈ పట్టణం పాడిపంటలతోనూ, ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనూ వర్ధిల్లేది. సాధుసజ్జనులతో, ఋషిగణంతో, అందమైన ఉద్యానవనాలతో ఎంతో పేరుగాంచింది.

 

ఈ ప్రాంతంలో భార్గవి అనే ముని ఒక పర్ణశాల నిర్మించుకుని తపస్సు చేసుకునేవాడు. ఆ తపస్సును భగ్నం చేసేందుకు దేవేంద్రుడు కనకాంగి అనే అప్సరసను పంపాడు. ఆమె హావభావాలకు వివశుడైన భార్గవుడు ఆమె మోహావేశంలో పడి కనకాంగికి లొంగిపోయాడు. తద్వారా కనకాంగికి పుత్రుడు కలిగాడు. తన తపస్సు అర్ధాంతరంగా ఆమెవల్ల చెదిరిందని తెలుసుకున్న భార్గవుడు తన తప్పుకు చింతించి మరోసారి జ్ఞానసముపార్జనకై అరణ్యాలకు వెళ్ళాడు. అప్పుడు కనకాంగి తాను వచ్చిన పని అయినందుకు ఆ బాలుని ఒకనాటి రాత్రి వెదురుబుట్టలో ఉంచి, దాన్ని పొదల చాటున పెట్టి తన లోకం చేరుకుంది.

 

దేవ వరప్రసాదితమైన ఆ బాలుడు మరునాటి ఉదయం బిగ్గరగా ఏడవసాగాడు. అది గమనించిన తిరువలన్ అనే ఒక మేదరి ఆ బాలుని ఇంటికి తీసికెళ్ళాడు. అతని భార్య పద్మావతి ఆ పసివాని అక్కున చేర్చుకుంది. కానీ ఏం లాభం.. ఆ పసివాడు పాలు తాగడు, ఏమీ తినడు. కానీ ఎంతో ఆరోగ్యంగా, దివ్య తేజస్సుతో పెరగసాగాడు. ఈ అద్భుతమైన బాలుని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చే ప్రజలతో ఆ స్థలం తీర్థస్థలమే అయింది.

 

ఆ బాలుడు ఆహార పానీయాలు ఏమీ తీసుకోనప్పటికీ తిరునలన్ దంపతులు ఆ బాలునికి స్నానాదికాలు చేయించి నుదుట తిలకం దిద్ది, తలపై, మెడలో పూలమాలలతో, సుగంధ ద్రవ్యాలతో అలంకరించి పెంచసాగారు. దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలగాచేసేలా ఆ బాలుడు పెరగసాగాడు. ఆనోటా ఈనోటా విన్న ఒక శూద్రవృద్ధుడు ఆ మహిమాన్వితుడైన బాలుని చూసేందుకు వచ్చి, అతని దివ్య తేజస్సుకు పరవశించి తాను తెచ్చిన పాలను ఆరగించమని వేడుకున్నాడు. అప్పటివరకు తనను చేరదీసిన వారి వద్ద నుండి కూడా ఏమీ పుచ్చుకొని ఆ బాలుడు కూర్చుని ప్రజలందరూ చూస్తుండగా ఆ శూద్ర వృద్ధుడు సమర్పించిన పాలు ఎంతో సంతోషంతో తాగాడు. అప్పటినుండి ప్రతిరోజూ ఆ వృద్ధుడు అర్పించే పాలను మాత్రమే తాగుతూ నిరంతరం తన్మయత్వంతో శ్రీ మహావిష్ణువును అచంచల భక్తితో గానం చేస్తూ ఆ దేవదేవుని కీర్తనమే తన దినచర్యగా గడపసాగాడు. తిరువలన్ నివాసమే ఈ బాలునికి ఆవాసం. ఈ బాలుని గుణగణాలను తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలతో ఆ ప్రాంతం నిత్యం సందర్శకులతో నిండిపోయేది. తిరుమలిశై పట్టణంలో ఉన్నందున వీరిని తిరుమలిశై ఆళ్వారులు అని కీర్తించారు.

 

ఇలా కొంతకాలం అయిన తర్వాత నిత్యం పాలను సమర్పించే ఆ వృద్ధుని అచంచలమైన భక్తికి కరుణించిన ఆ యోగిపుంగవుడు ఒకనాడు పాలను కొద్దిగా తాగి, మరికొన్ని ఆ వృద్ధ దంపతులను తాగామన్నాడు. ఆ మిగిలిన పాలను తాగిన దంపతులకు ఆ యోగి మహిమవల్ల సంతానం కలిగింది. వారికి కలిగిన ఆ పుత్రునికి కణికన్నన్ అనే నామకరణం చేశారు. తిరుమలిశై ఆళ్వారుకు 25 సంవత్సరాల వయసు నాటికి కణికన్నన్ వయసు 12 సంవత్సరాలు. చిన్నప్పటి నుండి ఆ కణికన్నన్ ఈ ఆళ్వారునే సేవిస్తూ, గానంచేస్తూ తనతోపాటే ఉండేవాడు. ఈవిధంగా కణికన్నన్ ఇంకా తిరుమలిశై ఆళ్వారులు గురుశిష్యులుగా పేరుగాంచారు. వీరిద్దరూ ఆ పట్టణంలో ఉన్న జగన్నాథ ఆలయానికి చేరుకొని ఆలయంలోని తోటకు పోషణచేస్తూ, భగవన్నామ సంకీర్తనచేస్తూ కాలం గడపసాగారు. భగవంతునిపై గల భక్తిసారాన్ని ప్రజలకు పంచుతున్నందున వీరిని భక్తిసారులన్నారు.

మరొకనాడు ఈ ఆళ్వారులు నగర సంచారం చేస్తూ ఉన్నప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న ఒక భిక్షుక యువతి వీరికి తారసపడింది. ఆమెను చూసిన ఈ ఆళ్వారులు ఆమె అనారోగ్యానికి, అందవికారానికి జాలిపడి భగవంతుని ప్రార్థిస్తూ ఆమెను ఆశీర్వదించారు. వెనువెంటనే ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలై మహా అందమైన యువతిగా మారిపోయింది. అదే సమయానికి ఆ నగరానికి రాజు పల్లకిలో వెళ్తూ ఆ యువతిని చూసి ఆమె అందానికి ఆశ్చర్యపోయి వెంటనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆళ్వారుల ఆశీర్వచనానికి ఎంత శక్తి ఉందో కదా. కాలం గడిచేకొద్దీ ఆ మహారాజు వృద్దుడైపోయాడు. కానీ అతను పెళ్ళి చేసుకున్న యువతి మాత్రం నిత్య యౌవనవతిగానే ఉంది. అదే విషయాన్ని రాజు ఆమెని అడిగాడు. దాంతో ఆమె ఆళ్వారులు తనను ఆశీర్వదించిన సంగతి చెప్పింది. ఆశ్చర్యంతో విన్న ఆ రాజు తిరుమలిశై ఆళ్వారులను చూడాలి అనుకున్నాడు.

 

ఆళ్వారుల శిష్యుడైన కణికన్నన్ ను రాజు దర్బారుకు పిలిపించి తాను ఆళ్వారులను చూడసంకల్పించానని, వారిని తనవద్దకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అంతట కణికన్నన్ అది సాధ్యం కాదని, ఆళ్వారులు భగవత్స్వరూపులని, వారు నిరంతరం హరినామ సంస్మరణ తప్ప ఇంకేమీ వారికి తెలీదని చెప్పాడు. నిరంతరం వారు చేసే విష్ణు గానామృతం ప్రజల్లో భక్తి చైతన్యాన్ని కలుగజేస్తుందని వారు ఇహపరాలను త్యజించి సర్వం భగవంతుని ధ్యానంలోనే గడుపుతున్నారని తెలియజేశాడు. వారిని పిలవడం అసాధ్యమని తన ప్రయత్నం విరమించుకోమని హితవు చెప్పాడు. అతని మాటలను పెడచెవిని పెట్టిన ఆ రాజు కణికన్నన్ ను ఉద్దేశించి ''నీవు కూడా చక్కని కీర్తనలు రచించి పాడుతావని తెలుసు. కనుక ఇక్కడ నువ్వు కొన్ని పాటలు ఆలపించు'' అంటూ ఆంక్ష విధించాడు.

 

దాంతో కణికన్నన్ తాను తన గురుదేవుని సన్నిధిలో తప్ప ఎక్కడా గానం చేయనని, చేయలేనని విన్నవించుకున్నాడు. అందుకు రాజు ఆగ్రహించి తనమీద తన అధికారం మీద గౌరవం లేనివారు తన రాజ్యంలో ఉండరాదని తక్షణమే తన రాజ్యం విడిచి వెళ్ళమని ఆదేశించాడు. అందుకు అతను ఏమాత్రం విచారించక మౌనంగా జగన్నాథ ఆలయానికి వెళ్ళి సవివరంగా తన గురువు అయిన తిరుమలిశై ఆళ్వారుకు విన్నవించుకున్నాడు. వెంటనే రాజాజ్ఞను పాలించి ఇద్దరూ నగరాన్ని విడిచి వెళ్లారు. అది తెలిసిన నగరవాసులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. సాక్షాత్తూ భగవత్స్వరూపులను నగరం విడిచి వెళ్ళమన్నందుకు నిరసనగా నగరంలోని పశుపక్ష్యాదులు మొదలు జంతుజాలం, సమస్త జనావళి వారిని అనుసరించి నగరం విడిచి వెళ్ళిపోయారు. నగరం మొత్తం నిర్మానుష్యం అయింది.

 

ఈ సంగతి తెలుసుకున్న రాణి, రాజువద్దకు వచ్చి ఆయన చేసిన తప్పు తెలియజేసి ఆళ్వారుల మహిమల్ని గుర్తుచేసి వారిని మరల నగరానికి ఆహ్వానించమని వేడుకుంది. రాణి మాటలను విన్న రాజు తన తప్పిదం తెలుసుకుని పరుగుపరుగున ఆళ్వారులను చేరుకొని కన్నీళ్ళతో మునివర్యుని పాదాలు కడిగి తాను చేసిన అపరాధం మన్నించి నగరానికి మరలిరావాలని ప్రార్ధించాడు. రాజు మాటలను మన్నించి ఆళ్వారులు తిరిగి జగన్నాథఆలయం చేరుకున్నారు. వారితోపాటు సమస్త జీవరాశి, నగర ప్రజలు తిరిగి నగరానికి చేరుకున్నారు. అప్పుడు రాజు, రాణి, ఆళ్వారులకు భక్తులై ప్రతిరోజూ వారిని సేవిస్తూ స్వామివారి మంగళాశాసనం వారికి, వారి ప్రజలకు కావాలని వేడుకుని, వారికి అవసరమైన సమస్త సౌకర్యాలు ఏర్పాటు చేశాడు.

 

తిరుమలిశై ఆళ్వారులు నాన్ ముగన్ అనే దివ్య ప్రబంధ తిరువందాది రచించారు. భక్తి సామ్రాజ్యంలో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకున్న తిరుమలిశై ఆళ్వారులు ప్రాతస్స్మరణీయులు. అందుకే వీరిని మహావిష్ణువు సుదర్శనచక్ర అంశగా భావిస్తారు. వీరి రచనలో ముఖ్యంగా ఫలశ్రుతికి ఉద్వాసన చెప్పారు. ఎందుకంటే వైష్ణవ భక్తిని అర్ధం చేసుకోకుండా కేవలం పఠనం ద్వారా ముక్తిని పొందటం నిరర్ధకం అని చెప్పారు. అందుకే వైష్ణవ భక్తి సారాన్ని అర్ధవంతంగా విడమర్చి దానివల్ల కలిగే ఆనందాన్ని విడమర్చి విశదీకరించారు. విశ్వంలోని అత్యంత బలీయమైన శక్తి వైష్ణవ శక్తి అని చాటిచెప్పారు.

 

ఓ శ్రీమన్నారాయణా! సర్వ జగత్తుకూ నీవే మూలం. సర్వ శక్తికి నీవే ఆధారం. అంతటా నీవే. అన్నిటా నీవే. నేను తెలుసుకున్నంతవరకూ సర్వమూ నీవే. విశ్వంఅంతా నీలోనే ఉంది. నీవే విశ్వం. నీవే ఆత్మ. నీవే సర్వప్రాణులకూ ఆత్మవీ, పరమాత్మవీ. నీవే సర్వశక్తి సంపన్నుడవు. నీవే కర్త, నీవే కర్మ, నీవే క్రియ, నీవే సంతోషం. నీవే సర్వం. ప్రతి మనిషీ కార్యోన్ముఖుడు కావాలి. పనిలోనే పరమాత్మ ఉన్నాడని, మంచి ఆలోచన, మంచి మాత, మంచి పని అన్నీ కూడా కర్మఫలాలే. కనుక మంచి కర్మలను చేయాలి. అంటే మంచి పనులు చేయాలి - అని ప్రబోధించిన భక్త శిఖామణి తిరుమలిశై ఆళ్వారులు. భగవద్గీత లోని సారం అంతా ఇదేనని తెలియజేశాడు. మఖా నక్షత్రాన, మకర లగ్నంలో జన్మించిన సుదర్శన చక్రాంశజులైన తిరుమలిశై ఆళ్వారులకు నమస్సుమాంజలి.


ఇంకా ఉంది...

 

Tirumala vaibhavam Serial-9, Bhargava muni and 12 Alwars, Nammalvars and kani Kannan, the story of kani kannan alwar, Tirumalishai Alwar, Nammalvar and kani kannan