తిరుమల వైభవం సీరియల్ - 26
Tirumala vaibhavam Serial- 26
దేసు వెంకట సుబ్బారావు
యాదవరాజులు

పరమ వైష్ణవుడైన జటవర్మ సుందరపాండ్యుడు అనేక వైష్ణవ కైంకర్యాలు చేశాడు. ఇతని కాలంలో తన పాళెగార్లలో ఒకడుగా వీరనరసింహ యాదవరాయలు ఉండేవాడు. తిరుమల శ్రీవారి ఆనందనిలయానికి తొట్టతొలుతగా ఆలయాన్ని జీర్ణోద్ధరణ కావించి స్వర్ణమయం చేశాడు. అదే సమయంలో సుందర పాండ్యుడు ఆనంద నిలయ విమాన గోపురానికి స్వర్ణకలశ స్థాపన చేశాడు. వీరి కాలంలోనే పదిరైవేడు అనే గ్రామాన్ని సర్వమాన్యంగా స్వామివారికి దానం చేశారు. ఆ కాలంలో పన్నులు బంగారు రూపంలోనూ ఇంకా ధాన్యం రూపంలో వసూలు చేసేవారు. బంగారం రూపంలో వసూలు చేసే పన్నును పొన్నాయం అని, ధాన్యం రూపంలో వసూలు చేసే పన్నును నెల్లాయం అని పిలిచేవారు. అలాగే ఆ కాలంలో అనేక గ్రామాలు కల ప్రాంతాన్ని కుర్రు అని, అనేక కుర్రులు గల ప్రాంతాన్ని నాడు అని పిలిచేవారు. అలా ఏర్పడిందే తొండమనాడు.
.png)
వీరి కాలంలో పాలన ఏవిధంగా ఉండేదో తెలియజేసే శాసనం 165-టి.టి. లో తెలియజేయబడింది. దేవాలయ అధికారి కొంత భూమిని దానంగా ఇవ్వమని రాజుగారికి విన్నవించుకున్నాడు. ఆ విన్నపాన్ని ''నాడవర్'' (ప్రాంతీయాదికారి) విచారించి తన సమ్మతిని తెలియజేస్తూ రాజాజ్ఞకై పంపించాడు. మహారాజు ఆ అర్జీదారుని విన్నపాన్ని మన్నించి నోటిమాటగా తన అంగీకారాన్ని తెలియజేశాడు. నోటిమాటగా తెలియజేసిన రాజాజ్ఞను యాదవరాయలచే అధికారులకు తెలియచేయబడింది. చోళుల పరిపాలనలో రాజాజ్ఞ ఎంత సక్రమంగా అమలుజరిగేదో తెలుస్తుంది.
తిరుమల శ్రీవారి బంగారు మేడ
ఇక తర్వాత వచ్చినవారు యాదవరాయలు. తిరుకాళత్తిదేవ యాదవరాయలు, వీరి కుమారుడైన సింగనపిళ్ళై మరొక వీరరాక్షస యాదవరాయలు పలిపాలించారు. వీరు తిరుక్కుడవూర్ నాడులోని సుక్షేత్రం నుండి లభించే ఫలసాయాన్ని తిరుమల శ్రీనివాసునికి ఒక తిరుమంతిర తిరుబ్బోనకం సమర్పించదానికి తగిన ఏర్పాట్లు చేశాడు. ఇతని తర్వాత వచ్చినవారు వీరనరసింగదేవ యాదవ రాయలు. వీరు జఠవర్మ సుందర పాండ్యుని కాలానికి చెందినవాడు. ఇతడు తన ఎత్తు బంగారాన్ని తూచి తిరుమల శ్రీవారి ఆనందనిలయ విమానానికి బంగారు తాపడం చేయించాడు. తిరుమల ఆనందనిలయ విమానానికి తొట్టతొలిగా బంగారు తాపడం చేయించిన వ్యక్తిగా వీరనరసింగదేవ యాదవరాయలు చరిత్రలో నిలిచిపోగా, మొదటి జఠవర్మ సుందరపాండ్యుడు అదే సమయంలో ఆనందఇళయ విమానానికి బంగారు కలశస్థాపన చేసి చరిత్రలో నిలిచిపోయాడు.
వీరనరసింగదేవ మహారాయలు పాలనలోని 40వ సంవత్సరంలో తిరుప్పుళ్ళాణి దాసుచే తిరుమల శ్రీవారి ఆలయంలోణి గర్భగుడి జీర్ణోద్ధరణ జరిగింది. ఆ సమయంలో గర్భగుడిలో గోడలమీద ఏయే ప్రదేశాల్లో శాసనాలు ఉన్నాయో గుర్తించి వాటిని మరోసారి తిరగరాయించి ఆయా ప్రదేశాల్లో ఉంచారు. ఆనాడు ముందుచూపుతో తీసకున్ననిర్ణయమే భావితరాలకు అపూర్వ సమపదగా ఈనాడు తిరుమల ఆలయ కుడ్యాలపైన శాసనాలను చూడగల్గుతున్నాం.
వీరి కాలానికే చెందిన తిరువెంకటనాథుడనే యాదవరాజు తన ప్రధాన సేనానాయకుడు సింగయదణ్ణాయకుని మనవిని మన్నించి ఇల్లత్తూరునాడులోని పొంగాలూరు గ్రామంలోని సగభాగం సర్వమాన్యంగా స్వామివారికి కైంకర్యం చేశాడు. ఇంకా తన పూర్వీకుడైన యాదవనారాయణ జ్ఞాపకార్ధం నారాయణన్ సంధి సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామి అనుగ్రహార్ధం ఒక తిరునామత్తుక్కనిగా తిరుపతి గ్రామాన్ని దానం చేశాడు. తర్వాత హోబళ యాదవ అనే రాజు స్వామివారి స్వర్ణ వరద హస్తాన్ని సమర్పించినట్లు తెలుస్తుంది.
తెలుగు పల్లవులు
తెలుగు పల్లవులలో ప్రముఖుడు విజయగండ గోపాలుడు. ఇతడు జఠవర్మ సుందరపాండ్యుడు, కొప్పెరుంజింగ, మధురాంతక పాత్తపిచోళ అల్లున్ తిక్క మనుమసిద్ధి ఇంకా కాకతీయ గణపతి వారలకు సమకాలీనుడు. విజయగండ గోపాలుని రాణి అయిన రాకుమారి దేవరశియార్ వేంకటేశ్వరాలయానికి కొన్ని గోవులు దానంచే, మూడు అఖండ దీపాలు వెలిగించే ఏర్పాటు చేసింది. విజయగండ గోపాలుని రాజప్రాసాద పరిచారకులలో కాశ్యప గోత్రీకుడైన అమ్మైయప్పన్ అని మరో పేరు గల అణ్ణన్ పెరుమాళ్ ప్రియన్ మరో అఖండ దీపాన్ని ఆలయానికి సమర్పించాడు. అందుకు అవసరమైన ఘ్రుతానికి 32 గోవులను, ఒక ఎద్దును ఆలయానికి దానం చేసినట్లు శాసనాలవల్ల తెలుస్తుంది. అలాగే సామాన్యులు కూడా స్వామివారికి అనేక కానుకలు ఇచ్చారు. వాటిలో నారాయణపుర నివాసి కట్టారి కుమారుడు అమరకోన్ అనే వ్యక్తి తిరుమల ఆలయానికి నిత్య దీపారాధనకు 3 మాడలు, కర్పూర హారతికి 12 మాడలు మూలధనంగా ఇచ్చాడు. కాకతీయ గణపతి మంత్రుల్లో ఒకరు అలప్పూర్ కు చెందిన దేవశెట్టి కుమారుడైన బ్రహ్మశెట్టి విజయగండగోపాలుని పరిపాలనాకాలం లోని ఏడవ సంవత్సరంలో కాంచీవరంలో అరుళాల పెరుమాళ్ దేవాలయానికి గోవులను, వృషభాలను దానం చేసినట్లు తెలుస్తుంది. ఈ బ్రహ్మశెట్టి గణపతి దేవుని కొలువులో కోశాధికారి పదవిలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ తెలుగు పల్లవుల కాలంలో తిరుపతి గ్రామంనుండి 40 రకాల పన్నులను వసూలు చేసి ఆ ప్రాంతాల అభివృద్ధికి వినియోగించేవారు. దీనిద్వారా ఆలయ నిర్వహణ, అభివృద్ధి జరిగేవి. వాటిలో ముఖ్యమైనవి పొన్వరి బంగారానికి చెందింది. కడమైఆయం అనేది ధాన్యాలమీద విధించిన పన్ను. అమంజివగై అనేక స్వచ్ఛంద సేవలకు సంబంధించిన పన్నులు. ఇవికాక నాట్టర్ సభచే పన్నులు, మహారాజ న్యాయస్థానంచే విధించబడిన పన్నులు, ఇంకా జంతువులపై విధించే పన్ను, వివిధ మార్గాల్లో పోయే బండ్లపై పన్ను, నగర ప్రవేశ పన్ను, వ్యాపారులు, వర్తకులపై విధించే పన్ను, బట్టలు నేసెవారిపై పన్ను, వృత్తిపన్ను, పూదోటలు నిర్వహించేవారిపై పన్ను, చెరువుల్లో చేపలు పట్టుకొనుటకు పన్ను, దొంగతనంగా పశువులను మేపినందుకు సుంకం వసూలు చేసేవారు.
ఇంతేకాకుండా రాజమాత, రాజకుమారుని సంరక్షణకు తిరుమగనార్ కాణకై, తిరుతయార్ కాణికై అనే రెండు పన్నులు వసూలు చేసేవారు. ఈ రెండూ కాక శత్రురాజులకు చెల్లించే కప్పం కూడా ప్రజల నుండి వసూలు చేసేవారు. తనను జయించిణ హొయసల మహారాజుకు తాను చెల్లించవలసిన కప్పాన్ని కూడా యాదవరాయలు తన ప్రజలనుండి వళ్ళాల దేవర్ పరి అనే పన్నును వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఆనాటి పన్నులు ఎలా ఉండేవో తెలుసుకుందాం. పండివరి, పలవరి, కాణిక్కై, వెండుగోళ్వరి, మలైయ మంజి, కుదిరైవరి, కానక్కమోవి, నాట్టువారి, నిలికాణిక్కై, నాట్టార్ వైట్టి కాణిక్కై, వాలినాడై కాణిక్కై, అక్కన్ కాణిక్కై, కార్తికై కాణిక్కై, పట్టివరి, విరుట్టువగై, పలటలిక్కు మడైయిల్ కోళ్ళుమ్ (వరి), నాట్టార్ మాడై యిల్ వగుక్కుం వరి, వళ్ళాల దేవర్ వరి, వాసాల్ పణం, తైపణం, నిశ్చయింపు, ముకంపార్వై, పదియారిమోవై, ముకంపార్వైచ్చమ్మదం, సంబదచ్చమ్మదం, శెట్టికల, వణికర్, సెనైయంగాడియార్, శెక్కుకుదిమక్కళ్, కైకోలార్ పెర్ (ఆయం), శుంగవరి, కొళ్ళుమ్ వగై, శుంగ ఎన్నై, పిళ్ళై కల్ కాణిక్కై మొదలైనవి.
తొండమండలానికి స్థానిక పాలకుడైన తిరువేంకటనాథ యాదవరాయలు (1322-1337) స్వామికి ఆహార నైవేద్యాన్ని సమర్పించేందుకు నారాయణన్ సంధి రూపాన ఏర్పాడు చేశాడు. ఆ సందర్భంలో తిరుపతి గ్రామాన్ని సర్వమాన్యంగా చేసి తిరుమల శ్రీనివాసునికి సమర్పించాడు. తిరుపతిలోని పెరియయేరి (పెద్ద చెరువు) కట్ట స్త్రత్తర తూము వద్ద ఉన్న కొన్ని భూములు ఎంపేరు మానార్ (రామానుజుల) నిత్య దైనందిన పూజా కార్యక్రమాల నిర్వాహణార్ధం ఆధార ద్రవ్యంగా ఇవ్వబడింది. కొంతకాలంగా వీటిపై తగినంత శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ముళ్ళతుప్పలు, పిచ్చి మొక్కలు పెరిగాయి. శ్రీరంగనాథుని పరిపాలనా కాలంనందలి మూడవ సంవత్సరాణ ఈ పుట్టె భూములలోని ముళ్ళపొదలు, గడ్డి తుప్పలను తొలగించి సాగుచేయడానికి అనువుగా సౌకర్యాలు చేయడం జరిగాయి. కానీ ఒక సమస్య ఏర్పడింది. గ్రామంతోబాటు పెరియయేరి కూడా శ్రీవేంకటేశ్వర స్వామికి చెందిన ఆస్తిలో భాగమవడంచేత శ్రీవారికి తగిన నష్టపరిహారం చెల్లించకుండా ఎంపేరుమానార్ కు చెందిన భూములను సాగు చేసేందుకు పెరియ యేరి నుండి నీటిని వినియోగించదానికి హక్కులేదు. అందుచేత ఈ ప్రయోజనార్ధం శ్రీ వేంకటేశ్వర స్వామికి 200 పణాలను తిరుముణ్ కాణికైగా బహూకరించబడింది. ఆ తర్వాతనే పెరియ ఏరి నుండి తిరుపతిలోని ఇతర భూములకు నీటి సరఫరా ఏర్పాటైంది.
క్రీస్తుశకం 1562 నాటికే శ్రీవారి వైభవం దేశం నలుదిశలా వ్యాపించింది. అందుకేనేమో నిత్యోత్సవాలతో తిరుమల గిరులు పరవశించి పోయేవి. ఆనాటి శాసనాల ద్వారా ఈ కింది సేవలు తిరుమల శ్రీవారికి నిత్యం జరిగేవని తెలుస్తుంది.
విశేష ఉత్సవాలు
1. పది బ్రహ్మోత్సవాలు (ఒక్కొక్క బ్రహ్మోత్సవం 13 రోజుల చొప్పున) - 130 రోజులు
2. డోలోత్సవం 5 రోజులు
3. పవిత్రోత్సవం 5 రోజులు
4. సహస్రనామార్చన ఉత్సవం 5 రోజులు
5. ఉగ్ర శ్రీనివాసునకు సహస్ర కలశాభిషేకం 1 రోజు
6. దవనారోహణ వసంతోత్సవం 5 రోజులు
7. లక్ష్మీదేవి ఉత్సవం 5 రోజులు
8. వైవాహికోత్సవం 5 రోజులు
9. వసంతోత్సవం 20 రోజులు
10. తెప్పోత్సవం 9 రోజులు
11. పల్లవోత్సవం 5 రోజులు
12. ఫలోత్సవం 3 రోజులు
13. అధ్యయనోత్సవం (రామానుజులవారికి) 6 రోజులు
మొత్తం ఉత్సవాలు 204 రోజులు
తింగళ్ దినాలు
1. మాస సంక్రమణం (సూర్యుడు ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు) 12 రోజులు
2. ప్రతి అమావాస్య 13 రోజులు
3. ప్రతి పౌర్ణమి 13 రోజులు
4. దశమి (శుక్లపక్షం, కృష్ణపక్షం) 25 రోజులు
5. ఏకాదశి (శుక్లపక్షం, కృష్ణపక్షం) 25 రోజులు
6. ద్వాదశి (శుక్లపక్షం, కృష్ణపక్షం) 25 రోజులు
7. రోహిణి నక్షత్రం 13 రోజులు
8. మృగశిర నక్షత్రం 13 రోజులు
9. పునర్వసు నక్షత్రం 13 రోజులు
10. ఉత్తర నక్షత్రం 13 రోజులు
11. మూల నక్షత్రం 13 రోజులు
12. పూర్వాషాఢ నక్షత్రం 13 రోజులు
13. ఉత్తరాషాఢ నక్షత్రం 13 రోజులు
14. శ్రవణ నక్షత్రం 13 రోజులు
మొత్తం 217 రోజులు
విశేష దినాలు
1.ఉట్ల ఉత్సవం 1 రోజు
2. శ్రీకృష్ణుని తైలస్నానం 1 రోజు
3. శ్రీజయంతి (కృష్ణాష్టమి) 1 రోజు
4. బొట్టు ఉత్సవం 1 రోజు
5. దీపావళి 1 రోజు
6. కార్తీకదీపం 1 రోజు
7. మకర సంక్రమణం 1 రోజు
8. పారువేట 1 రోజు
9. (పుష్యం) తైపూసం 1 రోజు
10. మాఘమాసం మఖా నక్షత్ర దినం 1 రోజు
11. శ్రీరామ నవమి 1 రోజు
12. వైశాఖ విశాఖ నక్షత్ర దినం 1 రోజు
మొత్తం 12 రోజులు
ఇలా చూస్తే తిరుమల నిత్యోత్సవాలతో విరాజిల్లేదని తెలుస్తుంది. కారణం
మొత్తం ఉత్సవాలు 204
తింగళ్ దివసములు 217
విశేష దినాలు 12
మొత్తం పండుగలు 433
ఏడాదికి 365 రోజులైతే ఉత్సవాలు మాత్రం 433 జరిగేవి. అంటే ఒక్కొక్కరోజు రెండేసి ఉత్సవాలు జరిగేవాణి తెలుస్తుంది. క్రీస్తుశకం 1819 నాటికి తిరుమల ఆలనా పాలనా ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలోకి వచ్చింది. ఐతే ఆ కాలానికి చెందిన రికార్డులు పరిశీలించినప్పుడు మరింత ఆసక్తికరమైన విషయాలు గోచరించాయి. అవి తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే మరిన్ని ఉత్సవాలు. వాటి గురించి వచ్చే సంచికలో తెలుసుకుందాం.
ఇంకా ఉంది...
Tirumala vaibhavam Serial-26, tirumala glorious history and yadavas, tirumala festivals 433 days, tirumala timgal days, celebrations in tirumala venkateswara temple, special days and festivals in tirumala




