తిరుమల వైభవం సీరియల్ - 27
Tirumala vaibhavam Serial- 27
దేసు వెంకట సుబ్బారావు
.png)
శ్రీ కొప్పెర కేసరి పాన్ మార్ లేదా కోపరా కేసరివర్మ లేదా మొదటి రాజేంద్ర చోళ దేవుడు అధికారానికి వచ్చిన తర్వాత తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ వ్యవహారం ఒకటి చాలా ఆసక్తికరమైన విచారణ గమనించదగ్గది. కొర్రమంగళముడైయాన్ అని పిలిచే అధికారి, ప్రాంతీయ గవర్నరు తిరుచ్చొక్కనూరులో విడిది చేసి ఉండగా దేవాలయాలలో జరిగే ధూపదీప నైవేద్యాలను గురించి విచారిస్తుండగా, తిరుమల శ్రీవారి దేవాలయ అర్చకులు ఆ అధికారికి ఈవిధంగా మనవి చేశారు. తిరుమండ్యం గ్రామాధికారి ఓ ఒప్పందం మేరకు శిలాశాసన పూర్వకంగా 23''పాన్'' బంగారు నాణాలను తీసుకుని శ్రీవారి దేవాలయంలో రోజూ 24 నేతి దీపాలను ఒక కర్పూర అఖండాన్ని వెలిగించేటట్లు ఒప్పందం చేసుకున్నారు. కానీ ఆ ఒప్పందం ప్రకారం తిరుమండ్యం గ్రామాధికారి 24 దీపాలను స్వామివారి సన్నిధిలో వెలిగించడం లేదని రెండు దీపాలు మాత్రమే వెలిగిస్తున్నాడని తెలియజేశారు. దీనిపై కొర్రమంగళ అధిపతి, ప్రాంతీయ గవర్నరు తిరుమండ్యం గ్రామాధిపతిని మందలించారు. అంతేగాక అతని నుండి 23 ''పాన్''ల బంగారాన్ని వసూలుచేసి శ్రీవారి భాండాగారంలో జమ చేయించారు. శ్రీవారి ఉగ్రాణం, నెయ్యి, ఇతర సామగ్రి పంపించి ప్రతిరోజూ స్వామి సన్నిధిలో 24 దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని దేవాలయ అధికారులకు అప్పజెప్పారు. దేవాలయ పరిపాలనపై చోళులు చూపిన శ్రద్ధ ఎంతటిదో పై ఉదంతం తేటతెల్లం చేస్తుంది. సుమారు వేయి సంవత్సరాలకు ముందు తిరుపతి పట్టణం లేదు. కానీ తిరుచ్చొక్కనూరని పిలిచేవారు. తిరుమండ్యం గ్రామాలు, ఆనాడు ప్రసిద్ధి చెందిన రాజకేయ నగరాలు. మతపరంగానూ, న్యాయ స్థానాలుగానూ వెలిశాయి. ఈ రెండు ''దేవదాన'' గ్రామాలుగా శ్రీవారికి చెందాయి.
పల్లవుల కాలంలో తొండమండలం, తొండమనాడని, తొండైనాడని పిలిచేవారు. అయితే రాజేంద్రచోళుని కాలంలో ఈ తొండమండలాన్ని జయిన్ కొండ చోళమండలంగా మార్చారు. కులోత్తుంగ చోళుని కాలంలో జయిన్ కొండ, చోళమండలం, రాజేంద్ర చోళమండలంగా పిలిచేవారు. ఇది క్రీస్తుశకం 1070 – 1120 కాలంనాటిది. కొంతకాలం తర్వాత అంటే మూడో రాజరాజ చోళుని కాలంలో రాజేంద్ర చోళ మండలం తిరిగి జయిన్ కొండ చోళమండలంగా మారింది. మొదటి కులోత్తుంగ చోళుని కాలంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి పాలముదు (పాలు) తైర్ అముదు (పెరుగు) నైవేద్యాలుగా సమర్పించేవారు. క్రీస్తుశకం 1235 లో మూడో రాజరాజ చోళుని పరిపాలనా కాలంలో న్యాయపరమైన విచారణ శ్రీ వీర నరసింగ యాదవరాయలు జరిపించారు. తిరుశుకనూరు (తిరుచానూరు)కు సమీపంలోని యోగిమల్లవరంలో వెలసిన శ్రీ తిప్పలాధీశ్వర అనే పరాశరేశ్వర దేవాలయం ఉంది. ఆ ఆలయంలోని శివలింగానికి ప్రతినిత్యం అభిషేకం, అన్నప్రసాద నైవేద్యాలు చేయడానికి జయిన్ కొండ బ్రహ్మమారయన్ అనే దానకర్త 26 1\4 కొలంజుల అప్పటమైన బంగారాన్ని తిరుచానూరు స్థానత్తారులకు దానంగా ఇచ్చాడు. శిలాశాసనం కూడా వేయించారు. అయితే తిరునూరు స్థానత్తారులు తిప్పలాధీశ్వరునికి పూజలు, నైవేద్యాలు చేయించలేదు. ఈ విషయం ప్రాంతీయ రాజైన వీర నరసింగయాదవరాయలకు తెలిసింది. చోళరాజు కూడా వీరనరసింగ యాదవరాయలును న్యాయాధిపతిగా నియమించి విచారణ జరిపించమని ఆజ్ఞ జారీచేశారు. విచారణ ప్రారంభమైంది. వీర నరసింగ యాదవ రాయలు తిరుచానూరు సభైయార్లను పిలిచి వారిని వివరణ కోరారు. అయితే వారు తమకీ విషయం తెలియదని బుకాయించారు. తిప్పలాధీశ్వర దేవాలయ పూజారులు శిలా శాసనాన్ని రాజుగారికి చూపెట్టారు. దాన్ని యాదవరాజు చదివారు. నిజం బయటపడింది. ఆ శిలా సాసనాన్నే సాక్ష్యాధారమైన పత్రంగా స్వీకరించారు. ఇంకా ఆ దేవాలయంలోని ఇతర ఊడిగం దారులను కూడా విచారించారు. వారు కూడా అర్చకులు చెప్పినట్లే శిలాశాసనంలోని విషయం వాస్తవం అన్నారు. అందరి సాక్ష్యాలను విని యాదవరాజు శిలాశాసనాన్ని ముఖ్య ఆధారంగా తీసుకుని తిప్పలాధీశ్వర దేవాలయ అర్చకులకు అనుకూలంగా తీర్పు చెప్పారు. యాదవరాజు తిరుచానూరు స్థానత్తారులను మందలించారు. వారినుండి 26 1\4 కాసుల బంగారాన్ని వసూలు చేసి తిప్పలాధీశ్వర దేవాలయ భాండాగారంలో స్వాధీనపరిచారు. నిత్యం శివలింగానికి అభిషేకం, అన్న నైవేద్యాలు జరగాలని ఆజ్ఞ జారీ చేశారు. తిరుమంగై ఆళ్వారుల విగ్రహాన్ని తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి దేవాలయంలో మూడో రాజరాజ చోళుని కాలంలో ఉన్న తిరుక్కుడ వూరునాడుకు చెందిన ''పెరియనాట్టర్'' ప్రతిష్టించారు. కానీ ఆ ఆళ్వారు విగ్రహానికి నిత్య పూజలు, నైవేద్యం ఏర్పాటు చేయలేదనే విషయాన్ని శఠగోపదాసర్ పిళ్ళై తిరుచానూరు సభైయార్కు ఫిర్యాదు చేశారు. వారు వీరనరసింగ యాదవ రాయలుకు ఫిర్యాదు చేశారు. ఆయన చోళరాజుకు తెలియజేశారు.
చోళరాజు యాదవరాజునే ఈ విషయమై చర్య తీసుకోవాల్సిందిగా ఆజ్ఞాపించారు. యాదవరాజులు తిరుక్కుడవూరునాడు పెరియనాట్టరునే తిరుమంగై ఆళ్వారుకు నిత్య పూజలు, నైవేద్యాలు జరపాల్సిందిగా ఆదేశించారు. పెరియనాట్టర్ తిరుక్కుడ వూరునాడులో కొంత భూమిని ఆ దేవాలయానికి మాన్యంగా ఇచ్చారు. ఆ భూమిలో పండే ధాన్యంలో ఒక పట్టికి ఐదు తుంబుల ధాన్యాన్ని దేవాలయ పూజలకు, నైవేద్యాలకు ఉపయోగించే ఏర్పాట్లు చేశారు. మూడో రాజరాజ చోళుని కాలంలో క్రీస్తుశకం 1235లో తిరుమంగై ఆళ్వారులను,కులశేఖర ఆళ్వారులను, పెరియాళ్వారులను, నమ్మాళ్వారులను తిరుపతిలో ప్రతిష్టించారు. పల్లవులు శైవమతాన్ని తోసిరాజనకపోయినా వైష్ణవ మతాన్ని ద్వేషించలేదు. పదవ శతాబ్దంలో చోళులు తొండ మండలాన్ని జయించిణ తర్వాత శైవమతానికి ప్రాధాన్యత ఇచ్చారు. కపిలతీర్థంలో శివలింగ ప్రతిష్ట, దేవాలయ కట్టడం, తిరుచానూరు సమీపాన ఉన్న యోగి (జోగి) మల్లవరంలో తిప్పలాధీశ్వరస్వామి అనే పేరుతో పరాశరేశ్వర శివదేవాలయ ప్రతిష్ఠ చోళుల కాలంలోనే జరిగింది. అందువల్లనే తిరుచానూరులో ప్రతిష్ఠించిన తిరువిలాన్ కోయిల్ (వైష్ణవ దేవాలయం) లో ప్రతిష్ఠించిన రజిత విగ్రహాన్ని మనవాళ్ళు పెరుమాళ్ అని పిలిచే భోగ శ్రీనివాసమూర్తి తిరుమల దేవాలయానికి తరలించారు. అక్కడ భోగ శ్రీనివాసమూర్తిని వేదోక్తంగా వైఖానస ఆగమానుసారం మరల ప్రతిష్టించారు. ఇది క్రీస్తుశకం 966లో జరిగింది. తిరుచానూరులో నడుపుతున్న మతమార్పిడి కార్యక్రమాన్ని కూడా తిరుమలకు తరలించారు. దీంతో తిరుమలలో శ్రీవారి దేవాలయంలో పూజా విధానాల్లో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. తిరుచానూరులో వైష్ణవ మతస్తులు తిరుచానూరును విడిచినా శైవ మతస్తుల ప్రాముఖ్యం పెరగలేదు. మతసామరస్యం పెంపొందింది. శైవ, వైష్ణవ తారతమ్యం లేకుండా ఇరువర్గాలూ కలసిమెలసి ఉండటం విశేషం. ఈ కాలంలోనే తిరుపతి పట్టణం ఉద్భవించింది. క్రీస్తుశకం 1130వ సంవత్సరంలో ఇది జరిగింది.
పాండ్యులు
చోళుల తర్వాత పాండ్యులు తొండమండలాన్ని పాలించారు. వీరిలో మొదటి మారవర్మన్ సుందర పాండ్యుడు ముఖ్యుడు. ఇతడు తన రాజ్యాన్ని కారేరీ తీరం వరకూ విస్తరించాడు. చోళులను ఓడించాడు. మారవర్మన్ సుందరపాండ్యుని తర్వాత మొదటి జాతవర్మ సుందర పాండ్యుడు రాజ్యాన్ని పాలించాడు. క్రీస్తుశకం 1250 నుండి 1275వరకు రాజ్యం ఏలాడు. ఇతని సామ్రాజ్యం అటు కావేరీతీరం నుంచి ఉత్తరాన గోదావరీతీరం వరకూ విస్తరించింది. జాతవర్మ సుందర పాండ్యుడు చోళ సామ్రాజ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. కేరళ రాజులను ఓడించాడు. పల్లవ కుల కంఠీరవుడు సర్వజ్ఞ ఖడ్గ మల్లను ఓడించి తనకు సామంతునిగా చేసుకున్నాడు. నెల్లూరును పాలించిన తెలుగు పల్లవుడు వీరగండ గోపాలుని చంపాడు. కాకతీయ రాజైన గణపతిని ఓడించాడు. కప్పం కట్టేట్లు సంధి చేసుకున్నాడు. ఉత్కళ దేశ రాజైన గజేంద్రుని ఓడించాడు. కప్పం కట్టించుకున్నాడు. ఇలా బలాఢ్యులైన వీరులందరినీ ఓడించి దిగ్విజయ యాత్రతో కాంచీపురంలో వీరాభిషేకం చేసుకున్నాడు.
గతంలో చోళులకు సామంత రాజుగా ఉంది తొండమండలాధిపతి అయిన వీరనరసింగ యాదవరాయలు ఇప్పుడు జాతవర్మ సుందరపాండ్యునికి సామంతరాజు అయ్యాడు. తిరుమల దేవాలయంలో జాతవర్మ సుందరపాండ్యుని శాసనాలు సంస్కృతంలో లభ్యమవడం విశేషం. జాతవర్మ సుందర పాండ్యుడు, వీరనరసింగ దేవయాదవ రాయలు వీరిద్దరూ కలిసి చేసిన శాసనాలు రెండింటిలో కనపడుతున్నాయి. ఇందులో ఒక శాసనంలో పాదిరివేడు గ్రామం (వడమాలపేటకు సమీపాన) గుడిమల్లం ఇలాకు లెక్కలో చేరింది. శ్రీవారికి సర్వమాన్యంగా సమర్పించినట్లు చెక్కి ఉంది. సర్వ మాన్యం అంటే ప్రభుత్వ పన్నులన్నీ పూర్తిగా మినహాయింపు చేయడం. అయితే ఈ పన్నులనుండి వచ్చే రాబడి శ్రీ స్వామివారి శ్రీ భాండాగారానికే చెందుతుంది. రెండో శాసనం కొడవూరునాడులోని కొంత భూమిని శ్రీ స్వామివారికి సర్వమాన్యంగా దానం చేసిన వివరాలు చెక్కి ఉన్నాయి. ఈ రెండు దానాలను శ్రీ వీర నరసింగ దేవ యాదవరాయలు అమలుపరిచాడు. ఆ కాలంలో ప్రభుత్వం వసూలు చేసిన పన్నుల వివరాలు ఈ శాసనాల ద్వారా తెలుస్తున్నాయి.
1. పట్టిప్పాన్ 2. పోన్ వారి 3. కుదిరైవారి 4. కానిక్కై 5. నాట్టువారై 6. నల్లేరుడు 7. నార్ పాసు 8. మావడై 9. మారవడై 10. కదామై.. తదితరాలు. ఇంకా కొన్ని ప్రశ్నలు బంగారు నాణేలతో కొన్ని ధాన్యంతో చెల్లిస్తుండేవారు. బంగారు నాణేలతో చెల్లించే పన్నును ''పొన్నాయం'' అని, ధాన్యరూపంలో చెల్లించేదాన్ని ''నెల్లాయం'' అని పిలిచేవారు. జాతవర్మ సుందర పాండ్యుడు తిరుగులేని వీరుడిగా పాండ్య దేశాన్ని తొండమండలాన్ని ఆపై ఉత్కళ దేశం వరకూ విస్తరించడంవల్ల అతనికి అనేక బిరుదులు కూడా లభ్యమయ్యాయి. అవి - సోనుకుల తిలక, మధురాపురి మాధావ, కేరళవంశ నిర్మూలన, లంకాపురి లుఠన ద్వితీయ రామా, చోళకులశైవ కులిశ, కర్ణాటక రాజ విద్రావణ, కాఠకాకరి కూటపాకల్, వివిధారిపుదుర్గమర్దన, వీర గండ గోపాల విపినదావా దావోన కాంచీపుర వీరాధీశ్వర, గణపతి హరిణ శార్దూల, ప్రణతరాజ ప్రతిష్టాత్మక, మహారాజాధిరాజ పరమేశ్వర త్రిభువన చక్రవర్తి, శ్రీ సుందర పాండ్యదేవప్పెరుమాళ్ - ఇత్యాది బిరుదులతో ప్రఖ్యాతిగాంచాడు. బంగారుపూత పూసిన కలశాన్ని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ గర్భగుడిపైనున్న ఆనంద నిలయవిమాన శిఖరంపై ఉంచాడు.
తెలుగు పల్లవులు
తెలుగుపల్లవులలో అత్యంత ముఖ్యుడు భరద్వాజ గోత్రుడు అయిన విజయగండగోపాలుడు. ముక్కంటి కడువెట్టి సంతతికి చెందినవాడు. ఈ విజయ గండగోపాలుడు క్రీస్తుశకం 1250 నుండి క్రీస్తుశకం 1285 వరకు 35 సంవత్సరాలు పాలించాడు. ముక్కంటి కడువెట్టి 700 అగ్రహారాలు శ్రీశైల పర్వతానికి తూర్పు దిక్కున నిర్మించాడు. భరద్వాజ గోత్రుడైన విజయ గండ గోపాలుడు, జాతవర్మ సుందర పాండ్యునకు, కొప్పెరుంజింగకు, మధురాంతక పొట్టాపి చోళునకు, అలున్ తిక్కకు, మానుమసిద్ధకు, కాకతీయ గణపతికి సమకాలికుడు. జాతవర్మ సుందరపాండ్యుడు ఈ విజయ గండగోపాలుని యుద్ధంలో ఓడించి సంహరించాడు. ఇతని రాజ్యాన్ని తన సోదరుడైన పల్లవ వంశీయుడైన విజయ గండగోపాలునికి ఇచ్చాడు. భరద్వాజ గోత్రుడైన విజయగండగోపాలుని రాణి దేవరసియార్ తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో మూడు దీపాలు వెలిగించదానికి బంగారం, గోదానం చేసినది. (32 ఆవులు +1ఆంబోతు)
కాడవ వరాజులు
కాడవ వరాజులలో పెద్దవాడు ఆళగియ సియాన్ అవని అళప్పిరన్ దాన్. ఇతని కుమారుడు కొప్పెరుంజింగయని అనే మహారాజసింహ. ఇతనికి సర్వజ్ఞ ఖడ్గమల్లయని అనే పేరు కూడా ఉంది. మూడవరాజరాజ చోళునికి, రాజేంద్ర చోళునికి అంతర్గత కలహాలు జరుగుతుండేవి. మొదటి జాతవర్మ సుందర పాండ్యుడు ఉత్తర దిక్కు దండయాత్రలో నిమగ్నుడై ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన కౌదావరాయలు -కొప్పెరుంజింగా స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు. సింహాసనాన్ని అధిష్టించాడు. అళగియ సియాన్ చోళులుపై మూడు పర్యాయాలు తిరుగుబాటు చేసి యుద్ధం ప్రకటించాడు. అవి తెల్లేరు యుద్ధం, సేవూరు యుద్ధం, ఉరాట్టి యుద్ధం, మూడవ రాజరాజ చోళుని ఓడించి సెండమంగళంలో కారాగారంలో ఉంచాడు. హొయసల రాజైన వీరనరసింహ మూడోరాజరాజ చోళుని విడిపించి తిరిగి రాజుగా చేశాడు.
ఉరాట్టి యుద్ధం
యోగి మల్లవరంలో లభ్యమైన శాసనంద్వారా వీర నరసింగ దేవయాదవ రాయలు మూడవ రాజరాజ చోళుని తరపున కాడవ రాజైన అళగియ సియాన్ పేరుంజింగతో ఉరాట్టి యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో యాదవరాజు బావమరిది అయిన నారాయణ పిళ్ళైను కాడవరాయలు చంపాడు. నారాయణపిళ్ళై తండ్రి పోక్కరాన్ పాండియ దారేయాన్ తన కుమారుని జ్ఞాపకార్ధం యోగిమల్లవరంలోని తిప్పలాదీస్వర దేవాలయంలోనూ, తిరుచానూరులోని తిరువిలాన్ కోయిల్ లోనూ కొన్ని సేవలు చేయించాడు. క్రీస్తుశకం 1230లో కొప్పెరుంజింగా విజ్రుంభించాడు. మూడో రాజరాజ చోళుని యుద్ధంలో ఓడించి బంధించాడు. రెండో పర్యాయం సెండమంగళం జైలులో ఉంచాడు. హొయసల రాజు వీర నరసింహ రాజరాజ చోళుని జైలు నుంచి విడిపించాడు. పల్లవరాజు విజయగండ గోపాలుడు - జాతవరమా సుందర పాండ్యునికి, కొప్పెరుంజింగకు, మధురాంతకపొట్టాపి చోళలున్ తిక్కకు, మనుమసిద్ధికి, కాకతీయ గణపతికి సమకాలికుడు. ఈ సమకాలిక రాజులలో జాతవర్మ సుందర పాండ్యుడు గగండడగోపాలుని చంపాడు. ఈ గండగోపాలుని వీర గండ గోపాలునిగా కూడా వ్యవహరించేవారు. అయితే విజయ గండగోపాలుడు అంటే తెలుగు పల్లవుడు వీర గండ గోపాలుడు కాదు. ఇద్దరూ విభిన్న వ్యక్తులు. విభిన్న వంశీయులు. ఒకరు పల్లవులు, మరొకరు చోళ వంశీయులు. జాతవర్మ సుందర పాండ్యుడు వీర గండ గోపాలుని సంహరించి అతని రాజ్యాన్ని సోదరునికి ఇచ్చాడు. అతని సోదరుడు తెలుగు పల్లవుడైన విజయ గండ గోపాలుడే. విజయగండ గోపాలుడు జాతవర్మ సుందర పాండ్యుడు - ఇద్దరూ వారివారి రాజ్యాల సింహాసనాలను ఒకే సంవత్సరాణ, అంటే క్రీస్తుశకం 1250లో అధిష్టించారు. వీరిద్దరూ సోదరులైనా ఒకరు పల్లవుల వంశీయులుగా ప్రసిద్ధి చెందారు. మరొకరు పాండ్య వంశీయులుగా ప్రఖ్యాతి గాంచారు.
సర్వజ్ఞ ఖడ్గమల్లుడు అనేక బిరుదులను కూడా సంపాదించాడు. అవి - కటక కులతిలక, కాడవకుల భూషణం, కంచి నాయక, కవిసార్వభౌమ , కర్ణాట లక్ష్మీ లుంటక, అసహాయ శూరా, రాహుట్టు రాయ, విజిత్య-విజయం-వీర, (విజయగండ గోపాలుని, వీరగండ గోపాలుని జయించినవాడు), గణపతి దాత్త వీర పాదముద్ర, (కాకతీయ గణపతి ఈతనికి సామంతుడిగా ఉండేవాడు) ఈయన జాతవర్మ సుందర చోళునికి సోదరుడు. ఇతడు భోగజాతుడు. అవని భోగజాతుడనే బిరుదాన్ని పొందాడు. ''త్రిభువన రాజ'' అని కూడా బిరుదు పొందాడు. రూపనారాయణ, భక్తార్ణవ కర్ణధార – ఇలా అనేక బిరుదులూ ఉన్నాయి. ఇంకా ఇతనికి కొప్పెరుంజింగా నై మహారాజ సింహ అని కూడా పిలుస్తారు. ఇతనే కాడవ వంశీయుడైనను, పల్లవరాజుగా కీర్తి పొందాడు. హొయసల రాజైన వీర సోమేశ్వరుని ఓడించి ''చక్రవర్తి'' అని బిరుదు పొందాడు. ఇతను క్రీస్తుశకం 1272-73 వరకు పాలించాడు.
యాదవ రాజులు
పాండ్యుల తర్వాత తొండ మండలాన్ని యాదవరాజులు పాలించారు.వెంకటగిరి, శ్రీకాళహస్తి, చంద్రగిరి రాజ్యాలు వీరి పాలనలో ఉన్నాయి. యాదవ రాజులలో మొట్టమొదటివాడు వితుట్టిదేవుడు క్రీస్తుశకం 1184-1227 వరకు పాలించి చోళుల సామంతుడిగా ఉన్నాడు. వితుట్టి దేవుని కుమారుడు రాజమల్లుడు. ఇతను క్రీస్తుశకం 1208 నుంచి క్రీస్తుశకం 1237 వరకు పాలించాడు. ఉరాట్టి యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్న నారాయణస్వామి పిళ్ళై విగ్రహాన్ని నాగలాపురంలో ప్రతిష్టించారు. ఈ నారాయణస్వామి విగ్రహమే ఆ తర్వాత నాగలాపురంలో వేదనారాయణస్వామిగా వెలిసింది.
మూడవ కులోత్తుంగ చోళునికి 13 సంవత్సరాల వయసు, మూడవ రాజరాజ చోళునికి 30 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు తిరుక్కాళత్తి దేవయాదవ రాయలు క్రీస్తుశకం 1191 నుండి క్రీస్తుశకం 1246 వరకు తొండమండలాన్ని పాలించాడు. తిరుక్కాళత్తి దేవ యాదవ రాయలు శ్రీ వేంకటేశ్వరునికి కడవూరు గ్రామాన్ని సర్వమాన్యంగా ఇచ్చాడు. ఇది క్రీస్తుశకం 1210లో జరిగింది. అప్పుడు అతని వయసు 19 సంవత్సరాలు. శాసనాల్లో ఇతని ''ప్రశస్తి''ని చాలా గొప్పగా కొనియాడారు. ఆ ప్రశస్తి ఇలా ఉన్నది. ''సకల భువన మండలాదీశ్వర, సమస్త విద్యోద్యాన మత్త కలకంఠ, శ్రీకాళహస్తీశ్వర చరణారవింద, మధుకర, శ్రీమద్వేంకట గిరి పురపాలక, వేంకట పాలక (వేటగాళ్ళ ప్రభువు), వేంగీ మహానాయక, పిథారిదేవ లబ్ధవర ప్రసాద, గోదావరీ వల్లభ, కానిపాకపుర (కాణిపాకం) వరాధీశ్వర, విద్వద్జనోత్తమ, వరిభూత రాజాశ్రయా, చంద్ర-కుల తిలక, చాళుక్య నారాయణ, సకల గుణ సంగ్రామ, మహారాజాధిరాజ యాదవరాజ, శ్రీమద్భుజబల ఇత్యాది బిరుదులతో ప్రశస్తి పొందారు.
ఇంకా ఉంది...
Tirumala vaibhavam Serial-27, tirumala glorious history and pallavas, tirumala vaibhavam rajarajachola, narayana pillai statue nagalapuram, yadavas in tirumala vaibhavam




