Home

»

Latest News

ఏపీలో టిక్కెట్ రేట్ల స‌మ‌స్య వ‌ల్లే 'దృశ్యం 2'ను ఓటీటీకి ఇచ్చేశాం!

Nov 27, 2021 3:33PM

 

మార్కెట్‌లో ఏ వ‌స్తువును ఏ రేటుకు అమ్మాల‌నేది ఉత్ప‌త్తిదారుడు నిర్ణ‌యిస్తాడ‌నీ, కానీ సినిమా టిక్కెట్‌ను ఏ ధ‌ర‌కు అమ్మాల‌నేది నిర్మాత చేతుల్లో లేకపోవ‌డం బాధాక‌ర‌మ‌నీ సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ డి. సురేశ్‌బాబు అన్నారు. చిన్న సినిమా టిక్కెట్ ధ‌ర‌కే భారీ బ‌డ్జెట్ సినిమాను కూడా చూపించాల్సి రావ‌డం వ‌ల్ల నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు న‌ష్ట‌పోతార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసిన త‌మ సినిమా 'దృశ్యం 2'కు ఎలాంటి స్పంద‌న ల‌భిస్తుందో చెప్ప‌డానికి ఆయ‌న మీడియాతో మాట్లాడారు. వెంక‌టేశ్, మీనా భార్యాభ‌ర్త‌లుగా న‌టించిన 'దృశ్యం 2' మూవీని అదే పేరుతో మ‌ల‌యాళంలో ఇదివ‌ర‌కే వ‌చ్చిన ఒరిజిన‌ల్ మూవీ డైరెక్ట‌ర్ జీతు జోసెఫ్ రూపొందించారు. 

"ఏపీలో టికెట్ల రేట్ల సమస్య కూడా ఈ సినిమాను ఓటీటీకి అమ్మడానికి ఒక కారణం. ఏ క్లాస్‌లో టికెట్ రేట్ వంద రూపాయలు అంటే పర్లేదు. కానీ బీ, సీ సెంటర్లలో మరీ రూ. 20, రూ. 30 అంటే చాలా నష్టం వ‌స్తుంది. అది సరైన నిర్ణయం కాదు." అని చెప్పారు సురేశ్‌బాబు. "ప్రభుత్వంతో ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ జరుగుతుంది అనిపిస్తుంది. మరీ అంత తక్కువ రేట్లు పెట్టడమనేది కూడా కరెక్ట్ కాదు. ఓ ప్రొడక్ట్‌‌ను ఎంత రేటుకు అమ్ముకోవాలనే హక్కు నిర్మాతకు కూడా ఉంటుంది. ఈ 15 నెలలలో మాకు కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ చేసింది ఏమీ లేదు. థియేటర్ కరెంట్ బిల్లులు కూడా మాఫీ చేయలేదు. థియేటర్ల ఓనర్ల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు." అని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

'దృశ్యం 2' మల‌యాళంలో మంచి హిట్ అవ‌డంతో వెంటనే రైట్స్ తీసుకున్నామ‌ని సురేశ్‌బాబు వెల్ల‌డించారు. "జీతూ జోసెఫ్‌ను స్క్రిప్ట్ పంపించమని అడిగాను. కొన్ని మార్పులు చేర్పులు సూచించాను. అలా మొత్తానికి స్క్రిప్ట్ పూర్తయింది. వెంటనే షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా అంత ఫాస్ట్‌గా ఏ చిత్రాన్నీ నేను పూర్తి చేయలేదు. హైద్రాబాద్, కేరళలో షూట్ చేశాం. కరోనా భయంతో నేను మాత్రం సెట్‌కు వెళ్లలేదు. కానీ మా వాళ్లతో మాత్రం పని చేయించాను." అని ఆయ‌న తెలిపారు.

 

ఏపీలో గ‌వర్న‌మెంట్ కంట్రోల్‌లో సినిమా.. టాలీవుడ్ పెద్ద‌లు ఇప్పుడేం చేస్తారు?

 

'దృశ్యం 2' అనేది కమర్షియల్  సినిమా కాదనీ, పాటలు, ఫైట్లు ఉండే సినిమాలను థియేటర్లో చూస్తే మంచి కిక్ వస్తుంద‌నీ సురేశ్‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. "దృశ్యం 2ను థియేటర్లో విడుదల చేసినా కూడా ఈ రేటింగ్ వచ్చేది. కానీ కలెక్షన్లు ఎంత వస్తాయనేది చెప్పలేం. ఓటీటీ అనేది ఫైనాన్షియల్‌గా సేఫ్ అవుతుంది. ఇప్పుడు ఓటీటీ, యూట్యూబ్ వంటి వాటి వల్ల కొత్త టాలెంట్ కూడా వస్తోంది. టాలెంట్ ఉన్న  ప్రతీ ఒక్కరూ సినిమాను తీయగలుగుతున్నారు." అని ఆయ‌న చెప్పారు.

థియేటర్లో చూస్తే వచ్చే ఎక్స్‌పీరియన్స్ వేరనీ, 'అఖండ', 'పుష్ప' వంటి చిత్రాలకు ఆడియెన్స్ కచ్చితంగా వస్తారనీ ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. "పండుగలకు జనాలు థియేటర్లకు వస్తున్నారని అందరికీ అర్థమైంది. అందుకే ఫెస్టివల్ సీజన్‌కు రావాలని ఫిక్స్ అయ్యారు. ఒకప్పుడు నాలుగు సినిమాలు వచ్చేవి. నాలుగు వందల స్క్రీన్స్‌ చొప్పున నాలుగు చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు 1500 స్క్రీన్స్‌ కావాలని అంటున్నారు. అక్కడే గొడవ వస్తోంది. చూడాలి ఈ సంక్రాంతికి ఎలా ఉంటుందో" అని ఆయ‌న‌న్నారు.

 

'దృశ్యం 2' మూవీ రివ్యూ

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com