Ande Sri: తెలంగాణ సాహితీ శిఖరం 'అందెశ్రీ' కంటతడి పెట్టిన సందర్భం..!
on Nov 10, 2025

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం..
మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు..
చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి..
ఇలా ఒకటా రెండా.. పాట బ్రతికున్నంతకాలం, ప్రజలు పాడుకునే ఎన్నో గొప్ప పాటలను అందించారు అందెశ్రీ.
తెలంగాణ ఉద్యమ పతాకాన్ని రెపరెపలాడించిన గొప్ప కవులలో అందెశ్రీ ఒకరు. ప్రజాకవిగా, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన అందెశ్రీ.. జనగాం దగ్గరలోని రేబర్తి అనే గ్రామంలో 1961, జులై 18న జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య.
అందెశ్రీ పాఠశాలకు వెళ్ళి పుస్తక పాఠాలు నేర్చుకోలేదు. ప్రకృతి ఒడిలో జీవిత పాఠాలు నేర్చుకున్నారు. ఆ పాఠాలనే పాటలుగా మలిచి.. కోట్లాది ప్రజల హృదయాలలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు.
గొడ్ల కాపరిగా, భవన కార్మికుడిగా పని చేసిన అందెశ్రీ.. సామాన్యుల కష్టాన్ని వినిపించే కలం అయ్యారు. తెలంగాణ గురించి, ప్రకృతి గురించి, ప్రజల గురించి.. ఎన్నో గొప్ప పాటలు రచించారు.
Also Read: ప్రజాకవి అందెశ్రీ కన్నుమూత!
అందెశ్రీ కలం నుండి జాలువారిన గీతాలలో 'జయ జయహే తెలంగాణ'కు ప్రత్యేక స్థానముంటుంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ.. 'జయ జయహే తెలంగాణ' అంటూ ఉద్యమ జ్యోతిని వెలిగించారు. ఈ పాట ఎందరినో కదిలించింది. పిడికిలి బిగించి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడేలా చేసింది.
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో 'జయ జయహే తెలంగాణ' గీతం తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందే.. దీనిని రాష్ట్ర గీతంగా భావించారు ఉద్యమకారులు.
అయితే, తెలంగాణ ఏర్పడిన తర్వాత 'జయ జయహే తెలంగాణ' పాట.. రాష్ట్ర అధికారిక గీతంగా మారడానికి దశాబ్దకాలం ఎదురుచూడాల్సి వచ్చింది.
'జయ జయహే తెలంగాణ' పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా 2024, ఫిబ్రవరి 4న సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. 2024, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పరేడ్ రౌండ్స్ లో జరిగిన వేడుకలో ఈ గీతాన్ని ఆవిష్కరించారు.
ఈ పాట ఆవిష్కరణ సందర్భంగా అందెశ్రీ భావోద్వేగానికి గురయ్యారు. పాట వినిపించినంత సేపు ఆయన కళ్ళలో నీళ్లు ఆగలేదు. అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పదేళ్ళ ఎదురుచూపుల తర్వాత తన పాటకు దక్కిన గౌరవానికి వచ్చిన ఆనందభాష్పాలు.
'జయ జయహే తెలంగాణ' గీతావిష్కరణ సమయంలో అందెశ్రీ కంటతడి పెట్టుకున్న సందర్భం.. కోట్లాది తెలంగాణ ప్రజానీకానికి రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. తెలంగాణ ఉన్నంతకాలం 'జయ జయహే తెలంగాణ' గీతం ఎలా ఉంటుందో.. అలాగే, అందెశ్రీ భావోద్వేగానికి గురైన ఆ సందర్భం కూడా తెలంగాణ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



