![]() |
![]() |

పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమైన 'ఉప్పెన' చిత్రం పేరుకు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల ఉప్పెన తెచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ రూ. 19 కోట్లకు అమ్ముడుపోయిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ. 25 కోట్లకు పైగా షేర్ సాధించి రికార్డులపై కన్నేసింది. టాలీవుడ్‌లో ఒక డెబ్యూ హీరోకు సంబంధించి ఇవే హయ్యెస్ట్ కలెక్షన్లుగా విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
ఇదివరకు 2000లో వచ్చిన తరుణ్ డెబ్యూ ఫిల్మ్ 'నువ్వే కావాలి' మునుపటి రికార్డులను తిరగరాయగా, 2007లో వచ్చిన రామ్‌చరణ్ డెబ్యూ ఫిల్మ్ 'చిరుత' ఆ రికార్డును అధిగమించింది. 14 సంవత్సరాల దాకా నిలబడిన దాని రికార్డును ఇప్పుడు 'ఉప్పెన' బ్రేక్ చేసింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబానా సానా సమకూర్చిన కథాకథనాలు, దర్శకత్వ ప్రతిభకు తోడు విలన్‌గా విజయ్ సేతుపతి విశ్వరూపం, హీరోయిన్‌గా కృతి అందచందాలు, అభినయం, డీఎస్పీ మ్యూజిక్ ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌గా మలిచాయి.
ఈ సినిమా విడుదలకి ముందే కృతి హాట్ హీరోయిన్‌గా పలు అవకాశాలను సంపాదించుకోగా, రిలీజ్ తర్వాత ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. వైష్ణవ్ తేజ్ కూడా డెబ్యూ హీరోగా మంచి మార్కులే సంపాదించుకున్నాడు. త్వరలో అతను క్రిష్ డైరెక్షన్‌లో చేసిన 'కొండపొలం' మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇందులో అతని జోడీగా సీనియర్ తార రకుల్ ప్రీత్ నటించడం గమనార్హం.
![]() |
![]() |