![]() |
![]() |

శర్వానంద్ సినిమా 'శ్రీకారం' బాక్సాఫీస్ దగ్గర రోజురోజుకూ డల్ అయిపోతూ వస్తోంది. వీకెండ్‌లో ఆదివారం కోటి రూపాయల షేర్ కూడా సాధించలేకపోవడం ఆ సినిమా పరిస్థితికి అద్దం పడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై బయ్యర్లు వెచ్చించిన డబ్బు రూ. 16.1 కోట్లు. కానీ ఐదు రోజుల్లో అది రాబట్టిన షేర్ రూ. 8.05 కోట్లు (అంచనా) అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అంటే రికవరీ అయ్యింది 50 శాతమే.
ట్రేడ్ వర్గాల ప్రకారం 'శ్రీకారం' తొలిరోజు రూ. 4.07 కోట్లు, రెండో రోజు రూ. 1.48 కోట్లు, మూడో రోజు 1.16 కోట్లు, నాలుగో రోజు 96 లక్షలు, ఐదో రోజు 38 లక్షలు వసూలు చేసినట్లు అంచనా. విడుదలకు ముందు వచ్చిన బజ్‌తో మంచి ఓపెనింగ్స్ సాధించిన ఆ సినిమా.. రెండో రోజు నుంచీ వీక్ అయిపోతూ వస్తోంది. మొదటి రోజు రూ. 4 కోట్లు వసూలు చేసిన ఆ సినిమా తర్వాత నాలుగు రోజులకు కలిపి రూ. 4 కోట్లు వసూలు చేయడం గమనించాల్సిన విషయం.
వ్యవసాయాన్ని కెరీర్‌లో ఎలా మలచుకోవాలో చెప్పే కథతో, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ నుంచి రైతుగా మారిన యువకుడిగా శర్వానంద్ నటించిన 'శ్రీకారం'పై ప్రేక్షకుల ఆసక్తి వేగంగా తగ్గిపోతుండటం బయ్యర్లను, నిర్మాతలను ఆందోళన కలిగిస్తోంది. ఈ మూవీతో పాటు రిలీజైన హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'జాతిరత్నాలు' బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతుండటం కూడా ఈ సినిమాకు ప్రతికూలంగా మారింది. దీంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప నష్టాల నుంచి 'శ్రీకారం' బయటపడటం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.
![]() |
![]() |