![]() |
![]() |

గడచిన 24 గంటల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేసిన అనంతరం ఎస్పీబీ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. దానికి తోడు ఆసుపత్రికి వెళ్లి ఆయనను చూసి వచ్చిన కమల్ హాసన్ సైతం "ఆయన బావున్నారని అనను. ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉంది. లైఫ్ సపోర్టుతో చికిత్స అందిస్తున్నారు. అభిమానులు, సినిమా పరిశ్రమ ప్రముఖులు ఆయన కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు" అని చెప్పడంతో అందరిలో ఆందోళన మరింత పెరిగింది.
ఆసుపత్రి నుండి కమల్ వెళ్లిన తరవాత ఎస్పీబీ కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకోవడం ఏం జరుగుతుందో తెలియక అభిమానుల్లో విషాదం ఎక్కువైంది. ఆయన కోలుకున్నారని ఆసుపత్రి వర్గాలు మరో ప్రకటన చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ఎస్పీబీ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని మళ్ళీ ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. కొందరు ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రి బయట గుమిగూడారు. 'బాలు ఆరోగ్యంగా తిరిగి రావాలి' అని ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. దాంతో ఆ ప్రాంతమంతా ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది.
![]() |
![]() |