Home  »  News  »  సీన్ రివర్స్ అయింది.. ఇక ఇళయరాజాకు తిప్పలు తప్పవు!

Updated : Feb 17, 2026

భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఇళయరాజా ఒకరు. భాషతో సంబంధం లేకుండా దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన సంగీతానికి గతంలో ఉన్న జోరు ఇప్ప్పుడు లేనప్పటికీ ఆయన చేసిన పాటలు ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయని చెప్పొచ్చు. ఇప్పటికీ ఆ పాటల్ని వింటూ ఆస్వాదిస్తారు సంగీత ప్రియులు. దాదాపు 50 సంవత్సరాల కెరీర్ కలిగిన ఇళయరాజా ఇప్పటివరకు 1550 సినిమాలకు సంగీతాన్ని అందించారు. ఎంతో మంది యువ సంగీత దర్శకులకు ఇళయరాజా ఆదర్శం. సంగీత జ్ఞానిగా పేరు తెచ్చుకున్న ఆయనంటే అందరికీ గౌరవమే. అయితే ఆయన మాత్రం కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించడం వల్ల తనపై వున్న గౌరవాన్ని తగ్గించుకున్నారనిపిస్తుంది.

 

మ్యూజిక్‌కి సంబంధించిన కాపీరైట్ వ్యవహారంలో ఆయన ఒకింత ఎక్కువగానే జాగ్రత్త వహిస్తూ తన పాటల్ని ఎవరు వాడుకున్నా వారిపై చర్యలు తీసుకుంటూ ఉంటారు. అలా ఇప్పటివరకు ఎంతో మందికి నోటీసులు పంపించడం, వారి నుంచి రాయల్టీ వసూలు చేయడం కూడా జరిగింది. సంగీత దర్శకుడిగా ఇళయరాజాకు మంచి భవిష్యత్తు ఇవ్వడంలో ఎంతో సహకరించిన ఆయన మిత్రుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంని కూడా దాన్నుంచి మినహాయించలేదు. పలు వేదికలపై తన పాటలు పాడుతున్నాడని, ఆ పాటల రాయల్టీ తనకు ముట్టచెప్పాలని బాలుకి నోటీసులు పంపారు ఇళయరాజా.

 

ఇటీవలికాలంలో కొన్ని సినిమాల్లో ఇళయరాజా పాటలు వాడారు. అలా చేసినందుకు వారిపై కూడా కోర్టుకు వెళ్లారు. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌లో తన పాట వినిపించినా చర్యలు తీసుకునేందుకు వెనుకాడడం లేదు. అలాంటి ఇళయరాజాకు ఇప్ప్పుడు సీన్ రివర్స్ అయింది. ఎంతో కాలంగా కాపీరైట్ చట్టానికి సంబంధించి చాలా మందిలో కన్‌ఫ్యూజన్ ఉంది. ఒక సినిమాకి పాటలు చేసిన తర్వాత ఏ సంగీత దర్శకుడికైనా రెమ్యునరేషన్ తీసుకోవడంతో అతని పాత్ర అక్కడితో ముగుస్తుంది. కానీ, సినిమాకి రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ ఆ పాటల్ని స్వరపరిచిన సంగీత దర్శకుడికే హక్కులు ఉంటాయని కాపీరైట్ చట్టం చెబుతుంది. దీన్ని దష్టిలో పెట్టుకొని ఎంతో మంది నిర్మాతలను, ఈవెంట్ నిర్వాహకులను ఇళయరాజా ఇబ్బంది పెట్టారు. 

 

తను తీసుకున్న చర్యలు తనకే అవరోధాలుగా మారుతున్నాయని ఇళయరాజా చాలా ఆలస్యంగా గ్రహించారు. పలు భాషల్లోని కొన్ని వేల పాటల్ని సరిగమ, సోనీ మ్యూజిక్ వంటి సంస్థలు కొనుగోలు చేశాయి. దాంతో ఆ పాటలకు సంబంధించిన పూర్తి హక్కులు ఆ సంస్థలకే చెందుతాయి. ఆమధ్య ఇళయరాజా తన పాటల్ని కొన్ని సంస్థలకు అమ్మేశారు. ఇది తెలుసుకున్న ఆ కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు కూడా సరిగమ, సోనీ సంస్థలకు అనుకూలంగానే తీర్పు చెప్పింది. తను ట్యూన్ చేసిన పాటలైనా సరే ఇకపై ఇళయరాజా ఆయా కంపెనీల అనుమతి లేకుండా వాటిని ఎక్కడా వాడకూడదు. తను చేసే కచేరీల్లో సైతం ఆయన ఆ పాటల్ని పాడకూడదు. ఇవీ ఆ కంపెనీలు పెట్టిన కండిషన్స్. గతంలో తను అందరికీ పెట్టిన కండిషన్స్ ఇప్ప్పుడు తన పాలిట శాపాలుగా మారాయని ఇళయరాజా ఆందోళన చెందుతున్నారు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.