![]() |
![]() |
ఒకప్పుడు సినిమాలు సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు ఆడేవి. అప్పటి సినిమాలు అలా రన్ అవ్వడానికి ముఖ్య కారణం రిపీట్ ఆడియన్స్. ఒక్కో సినిమాను ఒకటి కంటే ఎక్కువ సార్లు చూడడం వల్లే అంత లాంగ్ రన్ ఉండేది. కొన్ని పాపులర్ అయిన సినిమాను సెకండ్ రిలీజ్ అంటూ కొన్ని నెలల తర్వాత మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేసేవారు. రాను రాను వినోద సాధనాలు పెరగడంతో థియేటర్లకు రిపీట్ ఆడియన్స్ కరువైపోయారు. కొన్ని బ్లాక్ బస్టర్స్‌కి తప్ప రిపీట్ ఆడియన్స్‌తో సినిమా రన్ అయ్యే అవకాశాలు తగ్గిపోయాయి.
ఈమధ్య కొన్ని సూపర్‌హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఆ ట్రెండ్‌ను కొనసాగించాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. పాత సినిమా రైట్స్‌ను తీసుకొని దాన్ని 4కె ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేసి మంచి క్వాలిటీతో థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. మొదట్లో రీ రిలీజ్ అయిన సినిమాలను ప్రేక్షకులు కూడా ఎగబడి చూసారు. ఇప్పుడు అది వారికి కూడా రొటీన్‌లా అనిపిస్తోంది. కొన్ని సినిమాలు డిజిటల్ మీడియాలో అందుబాటులో ఉండడమే దానికి కారణం. మొదట్లో రీరిలీజ్‌కి లభించిన ఆదరణ చూసి ఏ సినిమా అయినా రిలీజ్ చేసెయ్యొచ్చు అని భావించడం వల్లే ఇప్పుడు ఆదరణ తగ్గింది. కొన్ని సినిమాలు థియేటర్‌లో చూస్తేనే థ్రిల్ ఉంటుంది, చిన్న స్క్రీన్ మీద ఆ ఎఫెక్ట్ రాదు అనుకునే సినిమాలైతేనే థియేటర్స్‌లో చూస్తారు. ఇది గ్రహించని కొందరు తమకు అందుబాటులో ఉన్న సినిమాను రిలీజ్ చేసేస్తున్నారు.
రీరిలీజ్‌లకు ఆదరణ తగ్గిందని చెప్పేందుకు చిన్న ఉదాహరణ.. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ సినిమా ‘అదుర్స్’. ఈ సినిమా ట్రైలర్‌ను చాలా థియేటర్స్‌లో ప్రదర్శించారు. కానీ, సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్‌లో జనం లేరు. దీన్ని బట్టి రీ రిలీజ్ అనే కాన్సెప్ట్‌కి కాలం చెల్లినట్టే అనిపిస్తోంది. థియేటర్స్‌లో ప్రేక్షకులు లేకపోతే ప్రస్తుతం ఆయా హీరోలు చేస్తున్న సినిమాలపై కూడా ఆ ప్రభావం ఉండకపోదు. ‘అదుర్స్’కి కలెక్షన్స్ రాకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. ఇకపై తమ సినిమాలు రీరిలీజ్ చెయ్యకుండా నిరోధిస్తే బాగుంటుందని కొందరు హీరోలు డిసైడ్ అయ్యారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమాకే కలెక్షన్స్ లేకపోతే మన సినిమాలను ఎవరు చూస్తారు అని కొందరు హీరోలు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. ‘అదుర్స్’ రీ రిలీజ్ రిజల్ట్ వల్ల ఇకపై పాత సినిమాల సందడి థియేటర్స్‌లో తగ్గే అవకాశం కనిపిస్తోంది.
![]() |
![]() |