![]() |
![]() |
రెబల్‌స్టార్ కృష్ణంరాజు.. పేరుకు తగ్గట్టుగానే ఆయన గుణంలో రారాజుగా వెలుగొందారు. తను చేసే ప్రతి సినిమాతోనూ ప్రేక్షకులకు రోజురోజుకీ దగ్గరవుతూ వచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ కృష్ణంరాజుకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తనకంటే పెద్దవారి పట్ల గౌరవం, తనకంటే చిన్నవారిపై ప్రేమ, వాత్సల్యం వెరసి.. ఒక మహోన్నత వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మనకు దూరమై ఏడాది దాటింది. అయినా ఆయన జ్ఞాపకాలు మాత్రం వీడలేదు. కృష్ణంరాజు నటవారసుడుగా ప్రభాస్ రెబల్‌స్టార్ ప్రతిభాపాటవాలను కొనసాగిస్తున్నాడు. జనవరి 20 రెబల్‌స్టార్ కృష్ణంరాజు జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను గుర్తు చేసుకుందాం.
కృష్ణంరాజు కెరీర్‌లో ఓ మైలురాయిలాంటి సినిమా ‘భక్తకన్నప్ప’. ఈ చిత్రాన్ని ప్రభాస్‌తో రీమేక్ చేయాలని కలలు కన్నారు. దానికోసం స్క్రిప్ట్ కూడా రెడీ చేయించారు. ఈ సినిమాను తన సొంత బ్యానర్‌లో నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాలని ఆశపడ్డారు. కానీ, ఆయన కోరిక తీరలేదు.
కృష్ణంరాజుకు ఎంతో ఇష్టమైన మరో సినిమా ‘మన ఊరి పాండవులు’. ఈ చిత్రాన్ని కూడా ప్రభాస్‌తోనే రీమేక్ చెయ్యాలనుకున్నారు.
1984లో కృష్ణంరాజు హీరోగా నటించిన ‘భారతంలో శంఖారావం’ వందరోజుల వేడుక ప్లాన్ చేశారు. అదే సమయంలో తుపాను సంభవించి ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. దాంతో ఆ వేడుకను రద్దు చేవారు. దాని కోసం అయ్యే ఖర్చు నుంచి రూ.70 వేలు నిర్మాత నుంచి తీసుకొని దానికి మరో రూ.60,000 జత చేసి 1 లక్ష 30 వేల రూపాయలను వరద బాధితులకు విరాళం అందించారు.
కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ చిత్రాల్లో పోషించిన రెబల్ క్యారెక్టర్స్‌తో రెబల్‌స్టార్‌గా అవతరించారు కృష్ణంరాజు.
గోపీకృష్ణా మూవీస్ అనే సంస్థను స్థాపించి తొలి చిత్రంగా ‘కృష్ణవేణి’ నిర్మించారు. ఆ తర్వాత అదే బేనర్‌పై భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న, బిల్లా వంటి గొప్ప చిత్రాలను నిర్మించారు.
తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కృష్ణంరాజు హిందీలోనూ ఓ సినిమా నిర్మించారు. అదే ‘ధర్మాధికారి’. దిలీప్ కుమార్, జితేంద్ర, శ్రీదేవి, రోహిణీ హట్టంగడి ప్రధాన పాత్రల్లో నటించారు. దీన్ని కె.రాఘవేంద్రరావు తెరకెక్కించారు.
కృష్ణ, కృష్ణంరాజు కలిసి అత్యధికంగా 17కి పైగా చిత్రాల్లో నటించారు
కృష్ణంరాజు అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రోజుల్లో నటుడిగా ఆయన్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన అగ్రతారల్లో అక్కినేని ఒకరు.
కృష్ణంరాజు, ప్రభాస్ ఇద్దరూ కలిసి ‘బిల్లా’ చిత్రంలో మొదటిసారి నటించారు. ఆ తర్వాత రెబల్, రాధేశ్యామ్ చిత్రాల్లో కనిపించారు
![]() |
![]() |