
500 ఏళ్ల నాటి భారతీయుల కల జనవరి 22న నెరవేరబోతోంది. అయోధ్యలో శ్రీరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరగబోతోంది. దీన్ని దేశం ఓ పండుగలా జరుపుకోబోతోంది. ఈ రామమందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందింది. రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని మంచు మోహన్‌బాబు ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డా.మోహన్‌బాబు మాట్లాడుతూ ’ఈ దేవాలయంలో 18 మూర్తులు, 15 మంది బ్రాహ్మణోత్తములున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి, సాయి బాబా, శ్రీరాముడు, లక్ష్మీ నరసింహ స్వామి, సంతోషిమాత ఇలా 18 మంది దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు. మన దేశం రామ జన్మ భూమిఅనీ, రాముడు పుట్టిన దేశం అని ప్రపంచానికి చాటి చెప్పారు ప్రధాని నరేంద్రమోది. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జనవరి 22న జరిగే రామ మందిర ప్రారంభోత్సవానికి నాకు కూడా అహ్వానం అందింది. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా నేను వెళ్ళలేకపోతున్నాను. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాలేకపోతున్నందుకు క్షమించమని ప్రధానికి ఉత్తరం రాశాను. రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని దైవ సన్నిధానంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నాం. అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాను’’ అన్నారు.