![]() |
![]() |
హీరో అంటే చాలా మ్యాడ్‌గా ఉండాలి, అబ్‌నార్మల్‌గా బిహేవ్ చెయ్యాలి, అతనికి చెడు వ్యసనాలన్నీ ఉండాలి, రఫ్‌గా గడ్డంతో ఓ పిచ్చోడిలా కనిపించాలి.. ప్రస్తుతం ట్రెండ్ ఇలా నడుస్తోంది. ఒకప్పటిలా నీట్‌గా షేవ్ చేసుకొని, చెరగని క్రాఫ్‌తో, నలగని డ్రెస్‌తో కనిపిస్తే ఆడియన్స్‌కి రుచించడం లేదు. రాముడు మంచి బాలుడు అన్నట్టు ఉండకూడదు. ఏ విషయంలోనైనా అతని ప్రవర్తన ఎక్స్‌ట్రీమ్‌గా ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే సమాజంలో ప్రస్తుతం ఉన్న వ్యక్తిలా కాకుండా మనుషులతో సంబంధం లేని వాడిగా కనిపించాలి. ఇలాంటి క్యారెక్టర్‌ని ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారో లేక డైరెక్టర్లే అలాంటి విలక్షణమైన క్యారెక్టర్‌ని సృష్టించి ప్రేక్షకులపై రుద్దాలని చూస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడిరది.
ఇటీవల వస్తున్న సినిమాలను చూస్తుంటే హీరోలకు ఇలాంటి దుస్థితి వచ్చిందేమిటా అని బాధ పడాల్సి వస్తోంది. ఆ తరహాలో ఒక సినిమా వచ్చిందంటే అదే ట్రెండ్‌గా మారిపోతోంది. మిగతా దర్శకులు కూడా అలాంటి సినిమాలపైనే దృష్టి పెడుతున్నారు. హీరో అంటే రగ్డ్‌గా, రఫ్ అంట్ టఫ్‌గానే ఉండాలి అనే నిబంధన పెట్టుకున్నట్టుగా అలాంటి క్యారెక్టర్సే క్రియేట్ చేస్తున్నారు. ఎందుకోసం? ఏం సాధించాలని? జనానికి అలాంటి క్యారెక్టర్స్ ద్వారా ఎలాంటి మెసేజ్ ఇద్దామని?.. మన దర్శకులు కూడా ఈ విషయం గురించి ఒకసారి ఆలోచిస్తే మంచిది. అలాంటి క్యారెక్టర్లతో సినిమా చేయడం వల్ల అవి చూసిన యూత్ బిహేవియర్‌లో కూడా ఎంతో మార్పు వచ్చే అవకాశం ఉంది. నేరప్రవృత్తి పెరిగి వారి కెరీర్‌ను నాశనం చేసుకునే ఛాన్స్ ఉంది. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్న నిర్మాతల్లో కూడా మార్పు రావాలి. ఇలాంటి క్యారెక్టర్లతో తయారు చేసిన కథలతో సినిమాలు చేయకుండా ఉంటే సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారు.
పాత తరం సినిమాలను తీసుకుంటే ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం అంతర్లీనంగా ఉండేది. హీరో క్యారెక్టర్ కూడా ఆదర్శప్రాయంగా ఉండేలా దర్శకనిర్మాతలు జాగ్రత్తలు తీసుకునేవారు. హీరో, హీరోయిన్ క్యారెక్టర్ల విషయంలోగానీ, సన్నివేశాల్లోగానీ చిన్న పొరపాటు కూడా దొర్లకుండా చూసుకునేవారు. మారుతున్న ట్రెండ్‌ని బట్టి హీరో క్యారెక్టరైజేషన్‌లో కూడా మార్పులు రావడం సహజమే. అయితే అది సమాజానికి, యువతకు కీడు చేసేదిగా ఉండకూడదు. ఇప్పుడు వస్తున్న సినిమాల విషయంలో ఎంతోమందికి అసంతృప్తి ఉంది. ఫ్యామిలీ అంతా కలిసి ఆనందంగా సినిమా చూసే రోజులు పోయాయని అంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలని తీసుకొని సినిమాకి వెళ్ళే పరిస్థితి అస్సలు లేదు. అడపా దడపా అలాంటి సినిమాలు వస్తున్నప్పటికీ టోటల్‌గా సినిమా రూపురేఖలే మారిపోయాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
![]() |
![]() |