![]() |
![]() |

మెదడుకు రక్తం సక్రమంగా సరఫరా కావడానికి సర్జరీ చేయించుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్, ఆదివారం రాత్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సర్జరీ అనంతరం ఇంటికి తిరిగొచ్చిన ఒక ఫొటోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఆయన, దానికి "రిటర్న్‌డ్ హోమ్" అనే కాప్షన్ జోడించారు. అక్టోబర్ 28న అస్వస్థతగా అనిపించడంతో చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో 70 ఏళ్ల రజనీ అడ్మిట్ అయ్యారు. వివిధ పరీక్షల అనంతరం ఆయనకు శుక్రవారం కారోటిడ్ ఆర్టరీ రివాస్క్యులరైజేషన్ (CAR) ఆపరేషన్ నిర్వహించారు.
ఆరోజు వెలువరించిన బులెటిన్‌లో, "అస్వస్థతకు గురైన రజనీకాంత్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. నిశితంగా పరీక్షలు జరిపిన అనంతరం ఆయనకు కారోటిడ్ ఆర్టరీ రివాస్క్యులరైజేషన్ ఆపరేషన్ అవసరమని తేలింది. ఈరోజు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది." అని డాక్టర్లు తెలిపారు. ఆదివారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ హాస్పిటల్‌కు వెళ్లి రజనీని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు.
రజనీకాంత్ లేటెస్ట్ ఫిల్మ్ 'అణ్ణాత్త' దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదలవుతోంది. తెలుగులో ఈ సినిమా 'పెద్దన్న' టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవలే రజనీ ఢిల్లీ వెళ్లి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.
![]() |
![]() |