![]() |
![]() |
తమ వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇంకా కొనసాగుతోంది. సమస్యను పరిష్కరించేందుకు పలు మార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో పూర్తి స్థాయిలో నమ్మెను కొనసాగిస్తున్నారు కార్మికులు. ఫిలిం ఫెడరేషన్‌లో భాగమైన తెలుగు సినిమా డ్రైవర్స్ యూనియన్ నిర్మాతల పట్ల తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్లను నిర్మాతలు దొంగలుగా, మాఫియాగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం వారి ఆగ్రహానికి కారణమైంది.
దీనిపై డ్రైవర్స్ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ‘ఒక సింగిల్ కాల్‌షీట్‌కు డ్రైవర్‌కు 1195 రూపాయలు ఇస్తున్నారు. మూడేళ్ళకోసారి 30 శాతం వేతనం పెంచడం వల్ల అందులో 50 శాతం నష్టపోతున్నాం. ఇంతటి మహానగరంలో జీవనం సాగించడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. దాన్ని దృష్టిలోపెట్టునకొని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగారు కనీసం 50 శాతం వేతనం పెంచాలని సూచించారు. కొందరు నిర్మాతలు మమ్మల్ని దొంగలుగా, మాఫియాగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ నిర్మాతలు చేసిన వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం. వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకపోతే వారి ఆఫీసుల ముందు ధర్నా చేస్తాం. మేమెంతో కష్టపడి పనిచేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మమ్మల్ని అవమానించడం కరెక్ట్ కాదు. దాసరి నారాయణరావుగారు ఏర్పాటు చేసిన ఈ యూనియన్‌ను విచ్ఛిన్నం చెయ్యాలని కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు’ అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.
![]() |
![]() |