![]() |
![]() |
పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ రేంజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. అలాగే అర్జున్‌రెడ్డి, యానిమల్ చిత్రాలతో టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ మంటలు రేపిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే సహజంగానే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి. ప్రభాస్, సందీప్ కాంబినేషన్‌లో ‘స్పిరిట్’ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు.
రాజా సాబ్, ఫౌజీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. సందీప్‌రెడ్డి కాంబినేషన్‌లో చేసే స్పిరిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే సందీప్ మాత్రం ప్రభాస్ ఎప్పుడు వస్తే అప్పుడు సినిమా స్టార్ట్ చేసేద్దాం అని స్క్రిప్ట్ రెడీ చేసుకొని వున్నాడు. ఇటీవల ఓ షోలో స్పిరిట్ గురించి మాట్లాడుతూ 70 శాతం పూర్తయిందని చెప్పారు. అది విని అంతా షాక్ అయ్యారు. ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు.. మరి 70 శాతం ఎలా పూర్తయిందని ఆశ్చర్యపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. స్పిరిట్‌కి సంబంధించిన బీజీఎం 70 శాతం పూర్తయిందట.
సందీప్ మొదటి సినిమా అర్జున్‌రెడ్డిలోని పాటల్ని రథన్ కంపోజ్ చేయగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హర్షవర్థన్ రామేశ్వర్ చేశారు. ఆ తర్వాత చేసిన యానిమల్ చిత్రానికి 12 మంది మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. హర్షవర్థన్ రామేశ్వర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు. అతనికి ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విభాగంలో జాతీయ అవార్డు లభించింది. ఈ సినిమాకి సంబంధించిన బీజీఎం షూటింగ్ కంటే ముందే పూర్తి చేశారట. అలా చేయడం వల్ల ఎలాంటి ఔట్ పుట్ వస్తుందనేది తెలుస్తుందట. స్పిరిట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అదే పద్ధతిని అవలంబిస్తున్నారు సందీప్. దీని వల్ల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా బాగా తగ్గుతుందట.
‘స్పిరిట్’ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారనే టాక్ ఇప్పటికే వచ్చింది. ఈ సినిమా స్ట్రాంగ్ మాఫియా నేథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. అలాగే సినిమాలో ఎంతో కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ కూడా ఉందట. సందీప్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎంత ఎక్స్‌ట్రీమ్ లెవల్‌లో ఉంటుందో మనం చూశాం. నార్మల్ క్యారెక్టర్‌నే ఎంతో పవర్‌ఫుల్‌గా చూపించే సందీప్.. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌ని ఇంకే రేంజ్‌లో చూపిస్తాడోనని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పై వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
![]() |
![]() |