![]() |
![]() |
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా వెలుగొందిన వారు, వెలుగొందుతున్న వారు ఇప్పుడు సడన్‌గా సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదు. కొందరు హీరోయిన్లు వారు చేస్తున్న సినిమాల వరకు కంప్లీట్ చెయ్యాలనుకుంటున్నారు. వీళ్లంతా ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక రీజన్ ఏమిటి అని ఆరా తీస్తే.. నలుగురు హీరోయిన్లకు సంబంధించిన అసలు విషయం బయటపడిరది. ఈ నలుగురు హీరోయిన్లు వారి వారి ప్రియుళ్లతో డేటింగులు, లివింగ్ రిలేషన్స్ షిప్స్‌ని వదిలి పెళ్లి బాట పట్టాలనుకుంటున్నారట. అందుకే ఇప్పట్లో కొత్త కమిట్‌మెంట్స్ ఏమీ పెట్టుకోకూడదని కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇస్తున్నారని తెలుస్తోంది.
ఒకప్పుడు ఏ హీరోయిన్‌కి పెళ్లి జరిగినా.. పెళ్లితోనే కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పడేది. కానీ, ఇప్పుడలా కాదు, పెళ్ళయిన తర్వాత కూడా అంతకుముందు లాగే హీరోయిన్స్‌గా చలామణి అవుతున్నారు. అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. గత సంవత్సరం కొంతమంది హీరోయిన్ల పెళ్లిళ్లు జరిగాయి. ఇప్పుడు అదే బాటలోకి వెళుతున్నారు తమన్నా, రకుల్ ప్రీత్, శ్రుతి హాసన్, సంయుక్త మీనన్.
రకుల్ ప్రీత్ సింగ్ గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఎలాంటి దాపరికం లేకుండా బాహాటంగానే చెట్టా పట్టాలేసుకొని షికార్లు చేస్తున్నారు. ఇక ప్రేమ యాత్రలకు ఫుల్‌స్టాప్ పెట్టి పెళ్లికి సిద్ధమవుతున్నారట ఈ జంట. వీరి వివాహానికి గోవా వేదిక కాబోతోంది. అక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్‌ని ప్లాన్ చేసుకున్నారు. దీంతో రకుల్ కొత్త సినిమాలేవీ అంగీకరించడం లేదు.
తమన్నా కూడా తమ లవ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టి పెళ్లి పీటలెక్కాలని డిసైడ్ అయింది. గత మూడేళ్ళుగా బాలీవుడ్ నటుడు విజయ్‌వర్మతో తమన్నా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు తమ ప్రేమ వ్యవహారాన్ని గుట్టుగా నడిపించిన ఈ జంట.. ఇప్పుడు దాన్ని సీక్రెట్‌గా ఉంచదలుచుకోలేదు. అందుకే పలు ఈవెంట్స్‌కి జంటగానే హాజరవుతున్నారు. అంతేకాదు, ఈ సంవత్సరం గుడ్ న్యూస్ చెబుతామంటున్నారు. ఇరు కుటుంబాల్లో పెళ్లి విషయంలో ఒత్తిడి పెరగడంతో ఇక లాభం లేదనుకొని పెళ్లికి రెడీ అయిపోతున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో తమన్నా, విజయ్‌వర్మల పెళ్లి జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తమన్నా కూడా రకుల్ బాటలోనే కొత్త సినిమాలేవీ కమిట్ అవడం లేదు. ఇది వారు పెళ్లికి రెడీ అవుతున్నారనడానికి సంకేతంగా భావిస్తున్నారు.
ఇటీవల విడుదలైన డెవిల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంయుక్త మీనన్ కూడా పెళ్లికి సిద్ధమవుతోందనే వార్తలు వస్తున్నాయి. డెవిల్ సినిమా తర్వాత మరో సినిమా కమిట్ అవ్వలేదు. ఇదంతా పెళ్లికోసమేనని చెప్పుకుంటున్నారు. ఈ ఏడాదిలోనే సంయుక్త పెళ్లి జరిగే అవకాశం ఉందట. అయితే ఆమెది ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది తెలియాల్సి ఉంది.
ఈమధ్యకాలంలో శ్రుతి హాసన్ పెళ్ళి వార్త కూడా చక్కర్లు కొడుతోంది. చాలా కాలంగా శంతను హజారికాతో ప్రేమలో మునిగి తేలుతున్న శ్రుతి అతనితోనే సహజీవనం చేస్తోంది. వీరిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజంలేదని, పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటానని
స్పష్టం చేసింది శ్రుతి. ఈ జంట కూడా పెళ్లి బంధంతో ఏకం కాబోతున్నారని తెలుస్తోంది.
ఈ సంవత్సరంలోనే పెళ్లి చేసుకోబోతున్న మరో జంట సిద్థార్థ్, అదితి రావ్ హైదరి. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే ఆ విషయం గురించి ఇద్దరిలో ఎవ్వరూ క్లారిటీ ఇవ్వకపోగా తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెబుతున్నారు. కానీ, ఇద్దరూ కలిసే వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ నలుగురు హీరోయిన్లు తమ పెళ్లితో సినిమాలకు ఫుల్‌స్టాప్ పెడతారా.. లేక కెరీర్‌ను కూడా కొనసాగిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.
![]() |
![]() |