Home  »  News  »  Dooradarshini Review: దూరదర్శని మూవీ రివ్యూ

Updated : May 15, 2026

90వ దశకంలో పల్లెటూరి వాతావరణం, ఆ నాటి ప్రేమ కథలు ఎప్పుడూ ప్రేక్షకులకు ఒక తెలియని అనుభూతిని ఇస్తాయి. అదే కోవలో 'దూరదర్శని' (Dooradarshini) అనే టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా, అప్పట్లో టీవీ చుట్టూ తిరిగే ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేసింది. సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో చూద్దాం. (Dooradarshini Movie Review)

కథ:
హరి (సువిక్షిత్ బొజ్జ) వెనుకబడిన కులానికి చెందిన పేదింటి యువకుడు. అదే ఊరిలో అగ్ర కులానికి చెందిన వాణిని (గీతిక రతన్) ప్రేమిస్తాడు. వీరిద్దరి ప్రేమకథకు 'దూరదర్శని'లో ప్రసారమయ్యే 'చిత్రలహరి' ఒక వారధిగా మారుతుంది. అయితే ఆ ఊర్లో టీవీ ఉన్న ఏకైక వ్యక్తి పేక రాజు (భాస్కర్ గొడుగునూర్) ఒక స్త్రీ లోలుడు. అతని కన్ను వాణిపై పడటంతో కథ మలుపు తిరుగుతుంది. హరి కుటుంబానికి, వాణి అన్నయ్యకు మధ్య కుల చిచ్చు పెట్టి వీరిని విడదీయాలని చూస్తాడు. మరి ఈ కుట్రలను దాటి హరి, వాణి ఎలా ఒకటయ్యారు? అనేదే మిగిలిన కథ.

విశ్లేషణ:
కథగా చూస్తే 'దూరదర్శని'లో కొత్తదనం లేదు. ఈ తరహా కథలు తెలుగు తెరపై ఇప్పటికే ఎన్నో వచ్చాయి. ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా వ్యత్యాసమున్న ప్రేమ కథలు ఎన్నో చూసి ఉన్నాం. ఇక నాస్టాల్జియా పేరుతో 90ల నాటి రోజులను గుర్తు చేయడం కూడా ఇటీవల బాగా చూస్తున్నాం. ఈ మధ్య వచ్చిన ‘తిమ్మరాజుపల్లి TV’ ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి. అందుకే 'దూరదర్శని'లో మనకు కొత్తదనం పెద్దగా కనిపించదు.

ప్రేమ కథకు 'దూరదర్శని' వారధిగా మారడం అనే ఆలోచన అందంగా ఉంది. అయితే అంతే అందంగా హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలను రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది. కథాకథనాలు రొటీన్ గా ఉంటాయి. సన్నివేశాల్లోనూ కొత్తదనం కనిపించదు. అయితే కొన్ని సీన్స్ మాత్రం వింటేజ్ వైబ్ ను గుర్తు చేస్తూ.. అప్పటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి. కామెడీ సీన్స్ అక్కడక్కడా బాగానే పండాయి. ఎమోషనల్ సీన్స్ ని మాత్రం ఇంకా బలంగా రాసుకోవాల్సింది.

ఈ కథను సహజంగా, నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆ విషయంలో దర్శకుడిని అభినందించాలి. అలాగే, తల్లిదండ్రుల ప్రేమ విలువను, చదువు ప్రాముఖ్యతను కూడా ఈ సినిమా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. స్వచ్ఛమైన పల్లెటూరు కథలు, ముఖ్యంగా వింటేజ్ కథలు చూడాలనుకునే వారికి 'దూరదర్శని' నచ్చే అవకాశముంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
హీరోగా సువిక్షిత్ పాత్రకు తగ్గట్టుగా నటించినప్పటికీ, కొన్ని సన్నివేశాల్లో నటన ఇంకా మెరుగుపడాల్సి ఉంది. డ్రెస్సింగ్, మేకప్ విషయంలో కూడా ఇంకా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. హీరోయిన్ గీతిక తన పరిధి మేరకు చక్కగా నటించింది. పల్లెటూరి అమ్మాయిగా అమాయకత్వాన్ని బాగా పండించింది. విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో భాస్కర్ నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేరకు న్యాయం చేశారు.

దర్శకుడు కార్తికేయ కొమ్మి 90ల నాటి నేటివిటీని తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అయితే కథాకథనాలు రొటీన్ గా అనిపిస్తాయి. కుల వివక్ష, ధనిక-పేద వ్యత్యాసం వంటి అంశాలు మనం ఎన్నో సినిమాల్లో చూసినవే. ఆనంద్ గుర్రన అందించిన సంగీతం పర్వాలేదు. పల్లెటూరి మూడ్ ని సెట్ చేయడంలో నేపథ్య సంగీతం సహకరించింది. సునీల్ పొన్నం విజువల్స్ పల్లెటూరి అందాలను బాగా చూపించాయి. కొన్ని షాట్స్ నాస్టాల్జిక్ ఫీల్ ని కలిగిస్తాయి. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
90ల నాటి పల్లెటూరి నేటివిటీ
కామెడీ సీన్స్
నాస్టాల్జిక్ ఎలిమెంట్స్

మైనస్ పాయింట్స్:
కథలో కొత్తదనం లేకపోవడం

ఫైనల్ గా..
'దూరదర్శని' సినిమా 90వ దశకంలో పెరిగిన వారికి ఒక మంచి జ్ఞాపకంలా అనిపిస్తుంది. అయితే కథలో కొత్తదనం ఆశించే వారికి ఇది కాస్త నిరాశ కలిగించవచ్చు. ఎటువంటి అంచనాలు లేకుండా, కేవలం నాస్టాల్జియా కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు.

Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.