![]() |
![]() |

టాలీవుడ్ లో 'దేవి', 'ఒక్కడు', 'వర్షం', 'మనసంతా నువ్వే', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో సంచలనం సృష్టించిన సీనియర్ నిర్మాత ఎం.ఎస్. రాజు (MS Raju).. దర్శకుడిగానూ 'వాన', 'తూనీగ తూనీగ', 'డర్టీ హరి', 'మళ్లీ పెళ్లి' వంటి సినిమాలు చేశారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'అగధ' (Agadha).
మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'అగధ' నుంచి తాజాగా క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో కీలకమైన 'మహాదేవి' పాత్రలో టాలెంటెడ్ నటి కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇటీవల విడుదలైన 'అగధ' ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఒక రహస్య యువతి దైవ విగ్రహం ముందు నిలబడి ఉండటం చూసి అందరూ ఆమె ఎవరని చర్చించుకున్నారు. ఇప్పుడు ఆ యువతి కామాక్షి భాస్కర్ల అని వెల్లడిస్తూ విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది.
పోస్టర్ లో త్రిశూలాలు, దీపాల మధ్య నల్లటి సాంప్రదాయ చీరలో కామాక్షి భాస్కర్ల గంభీరంగా కూర్చున్న తీరు ఆకట్టుకుంది. ఆమె కళ్లలో కనిపిస్తున్న తీక్షణత చూస్తుంటే, కథలో ఆమె పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది. ఆమె ప్రచండమైన హావభావం, సాంప్రదాయ రూపం, ఆ పరిసరాల్లోని ఆధ్యాత్మిక వాతావరణం, మహాదేవి కేవలం ఒక సాధారణ పాత్ర కాదని, కథ యొక్క ఆధ్యాత్మిక మూలంతో గాఢంగా ముడిపడి ఉన్న వ్యక్తి అని తెలియజేస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఫస్ట్ లుక్‌కు వస్తున్న స్పందనతో ఉప్పొంగిపోయిన ఎంఎస్ రాజు, ఒక కృతజ్ఞతా లేఖను విడుదల చేశారు. "ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా ద్వారా వెల్లువెత్తుతున్న ప్రేమ, తాను చెబుతున్న కథపై తన నమ్మకాన్ని మరింత బలపరిచింది. ఒక రచయితగా, దర్శకుడిగా, ఈ ప్రోత్సాహం తన అత్యుత్తమ ప్రతిభను కనబరచడానికి, 'అగధ'లోని ప్రతి అంశం అంచనాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి తనను ప్రేరేపిస్తుంది" అని ఆయన అన్నారు.
శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. 45 నిమిషాల కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన సెట్ వర్క్‌తో.. 85 రోజుల పాటు షూటింగ్ జరిపి ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న 'అగధ', త్వరలోనే ప్రేక్షకులకు ఒక విభిన్నమైన సినిమాటిక్ అనుభూతిని పంచడానికి సిద్ధమవుతోంది.
![]() |
![]() |