![]() |
![]() |

ఆడియన్స్ కి రీచ్ అవ్వకపోవడం వల్లనో లేదా వేరే ఏవైనా కారణాల వల్లనే ఒక్కోసారి కొన్ని చిన్న సినిమాలు థియేటర్లలో ఆదరణ పొందవు. కానీ ఓటీటీలో విడుదలైన తర్వాత ప్రేక్షకులను అలరిస్తూ ప్రశంసలు అందుకుంటాయి. 2025 లో థియేటర్లలో విడుదలై పెద్దగా ప్రభావం చూపలేకపోయిన మూడు చిన్న సినిమాలు.. ప్రస్తుతం ఓటీటీలో మాత్రం విశేష ఆదరణ పొందుతున్నాయి. ఆ మూడు సినిమాలు ఏవో కాదు.. కన్యాకుమారి, బ్యూటీ, పాంచ్ మినార్.
కన్యాకుమారి (అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా):
రాడికల్ పిక్చర్స్ నిర్మించిన ఈ రూరల్ రొమాంటిక్ డ్రామాకు సృజన్ అట్టాడ దర్శకుడు. సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలి, జాబ్ ఉన్న వాడిని పెళ్లి చేసుకోవాలని కలలు కనే అమ్మాయి- ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటే చాలనుకునే అబ్బాయి మధ్య ప్రేమ కథగా ఇది తెరకెక్కింది. ఈ కథలో ప్రేమ, నవ్వులు, బాధలు, కోపాలు, త్యాగాలు అన్నీ ఉంటాయి. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహాలో స్ట్రీమ్ అవుతోంది.
బ్యూటీ (జీ5):
పేరెంట్స్ కి, టీనేజ్ అమ్మాయిలకు సందేశాన్ని ఇచ్చే రొమాంటిక్ డ్రామా ఇది. తల్లిదండ్రుల ప్రేమను సరిగా అర్థం చేసుకోలేని కొందరు టీనేజ్ అమ్మాయిలు.. ప్రియుడి కోసం ఇంటినుంచి వెళ్ళిపోయి ఎలాంటి ఇబ్బందులు పడతారనే విషయాన్ని ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ప్రస్తుత సమాజం ఎలా ఉంది? అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అనేది ఈ చిత్రంలో చూపించారు. అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర, నరేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జె.ఎస్.ఎస్.వర్ధన్ దర్శకుడు. వానరా సెల్యులాయిడ్స్ నిర్మించిన ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
పాంచ్ మినార్ (అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా):
రాజ్ తరుణ్ హీరోగా నటించిన క్రైమ్ కామెడీ ఫిల్మ్ ఇది. వరుస పరాజయాల్లో ఉన్న రాజ్ తరుణ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకుల దృష్టి పెద్దగా దీనిపై పడలేదు. ఇప్పుడు ఓటీటీలో మాత్రం మంచి ఆదరణే పొందుతోంది. ఇదొక డీసెంట్ క్రైమ్ కామెడీ ఫిల్మ్ అని చెప్పవచ్చు. స్టోరీ లైన్ బాగానే ఉంది. కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకుంటే.. మనతో పాటు మనవాళ్ళు కూడా చిక్కుల్లో పడాల్సి వస్తుందనే విషయాన్ని.. సరదాగా చెప్పే ప్రయత్నం చేశారు. రామ్ కడుముల దర్శకత్వంలో కనెక్ట్ మూవీస్ నిర్మించిన ఈ సినిమా, అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహాలో కూడా అందుబాటులో ఉంది.
![]() |
![]() |