![]() |
![]() |

కెరీర్ స్టార్టింగ్ నుంచి కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen), ఇప్పుడు 'లెగసీ' అనే మరో ఆసక్తికర సినిమాని ప్రకటించాడు. ఈ పొలిటికల్ డ్రామాకి 'పిండం' ఫేమ్ సాయి కిరణ్ దైదా దర్శకుడు. 'పిండం' సినిమాని నిర్మించిన కళాహి మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
న్యూ ఇయర్ కానుకగా 'లెగసీ'(Legacy) సినిమాని అధికారికంగా ప్రకటిస్తూ.. అనౌన్స్ మెంట్ టీజర్ ను విడుదల చేశారు. 'లెగసీ' ఒక రాజకీయ నేపథ్యంతో సాగే కథ. అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుడైన తన తండ్రి వారసత్వాన్ని అనివార్యంగా మోయవలసి వచ్చే సిద్ధార్థ్ అనే యువకుడు పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తున్నాడు.
"రాజకీయమంటే పులి మీద సవారీ లాంటిది అంటారు. మరి ఆ పులి మీద ఆ నాయకుడు ఒక్కడే కూర్చోవాలా? కుటుంబం మొత్తం కూర్చోవాలా? దిగితే చంపేస్తారు కదా.. మరి తన కుటుంబం? తన వారసులు? తన ఫ్యామిలీ లెగసీ ఏమైపోవాలి?" అంటూ విశ్వక్ సేన్ వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమైంది. తన దివంగత తండ్రి స్మారక చిహ్నాన్ని అతను సందర్శించడం, సమాధిపై మూత్ర విసర్జన చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం, గన్ తో ఫైరింగ్ చేయడం వంటి దృశ్యాలతో టీజర్ ఇంట్రెస్టింగ్ గా నడిచింది.
"ఒక తండ్రిని క్షమించలేని కొడుకు, పవర్ గేమ్స్ లో తన కుటుంబాన్ని కూడా వాడుకునే తండ్రి" అంటూ తండ్రీకొడుకుల మధ్య జరిగే ఘర్షణ నేపథ్యంలో ఓ పొలిటికల్ డ్రామాగా 'లెగసీ' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకోవడం విశేషం.
ఈ చిత్రంలో ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తుండగా, రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీ మోహన్, కే కే మీనన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గోవింద్ వసంత సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా జిజు సన్నీ, ఎడిటర్ గా శిరీష్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |