![]() |
![]() |

'ఇండియన్ 2' మూవీని కంప్లీట్ చేయకుండా మరో సినిమాని డైరెక్ట్ చేయకుండా శంకర్‌ను ఆపవలసిందిగా కోరుతూ ఆ సినిమా నిర్మాత లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ కోర్టును ఆశ్రయించారు. గత వారం ఈ కేసును విచారించిన జడ్జి, సమస్యను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిందిగా ఆ ఇద్దరికీ సూచించారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం శంకర్‌కూ, నిర్మాతకూ మధ్య జరిగిన సంప్రదింపులు విఫలమయ్యాయి.
ఈ ఏడాది జూన్-అక్టోబర్ మధ్యలో 'ఇండియన్ 2' షూటింగ్‌ను పూర్తిచేస్తానని డైరెక్టర్ శంకర్ హామీ ఇవ్వగా, జూన్ నాటికల్లా షూటింగ్ పూర్తి చేయాలని నిర్మాత డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనికి శంకర్ విముఖత వ్యక్తం చేయడంతో చర్చలు విఫలమయ్యాయి. ఈ విషయాన్ని కోర్టుకు విన్నవించడంతో తదుపరి విచారణను న్యాయమూర్తి జూన్‌కు వాయిదా వేశారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ మధ్య విభేదాల కారణంగా 'ఇండియన్ 2' మూవీ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోతుందనే ఆందోళన నెలకొంది.
'ఇండియన్ 2'లో కమల్ హాసన్ హీరోగా నటిస్తుండగా, ఆయన జోడీగా కాజల్ అగర్వాల్ కనిపించనుంది. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్ కీలక పాత్రధారులు. దివంగత వివేక్ మరో కీలక పాత్రధారి. ఆయన ఆకస్మిక మరణంతో ఆయనకు సంబంధించిన సన్నివేశాలను మరో కమెడియన్‌తో రిషూట్ చేయాల్సి ఉంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సమకూరుస్తున్న ఈ సినిమా దాదాపు మూడేళ్లుగా నిర్మాణంలో ఉంది. ఏదేమైనా 'ఇండియన్ 2' ప్రాజెక్ట్ ఆగిపోకూడదని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం...
మరోవైపు శంకర్ రెండు కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. వాటిలో ఒకటి రామ్‌చరణ్‌తో తీసే సినిమా కాగా, మరొకటి రణవీర్ సింగ్‌తో చేయాల్సిన 'అన్నియన్' హిందీ రీమేక్.
![]() |
![]() |