![]() |
![]() |
సినిమాల్లోనే కాదు, నిజజీవితంలో కూడా తాము హీరోలమేనని కొందరు ప్రూవ్ చేసుకుంటుంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ తమలోని సేవానిరతిని అందరికీ తెలియజేస్తుంటారు. అలాంటి ఓ సంఘటన కేరళలో జరిగింది. ఇడుక్కి జిల్లాకు చెందిన వెల్లియామామట్‌లో తల్లితో కలిసి ఉంటున్న జార్జ్(18), మాథ్యూ(15)లకు 15 ఆవులు ఉన్నాయి. వీరి తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతను తీసుకొని పాడి పరిశ్రమలో ఎదగడానికి కష్టపడుతున్నారు. వారి చదువును కొనసాగిస్తూనే పాడి పరిశ్రమను చూసుకుంటున్నారు. అయితే వారి జీవితంలో విషాదం చోటు చేసుకుంది. కలుషితమైన ఆహారం తినడం వల్ల వారు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆవులు మృతి చెందాయి. జీవనాధారమైన ఆవులు చనిపోవడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. దీంతో వారిని ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది.
రోడ్డున పడ్డ ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు నేనున్నానంటూ ముందుకు వచ్చారు ప్రముఖ మలయాళ నటుడు జయరామ్. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన జయరామ్ స్వయంగా వారి ఇంటికి వెళ్లి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి రూ. లక్ష, పృథ్వీరాజ్ సుకుమారన్ రూ.2 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని జయరామ్ వెల్లడిరచారు. వీరితోపాటు కొందరు మలయాళ నటీనటులు ఆ కుటుంబానికి సాయం చేసేందుకు కదిలారు. విషయం తెలుసుకున్న కేరళ ప్రభుత్వం ఆర్థిక సాయంతోపాటు 5 ఆవులను కూడా అందిస్తామని అక్కడి మంత్రులు హామీ ఇచ్చారు.
![]() |
![]() |