![]() |
![]() |
ఒకప్పటి పరిస్థితి ఎలా ఉన్నా.. ప్రస్తుతం ప్రచార సాధనాలు బాగా అందుబాటులో ఉండడంతో ఏ చిన్న పని చేసినా ఊహించని విధంగా పబ్లిసిటీ వచ్చేస్తోంది. ముఖ్యంగా సినిమా రంగంలో చీమ చిటుక్కుమంటే చాలు దాన్ని బాగా వైరల్ చేసేసి ఆనందపడిపోతున్నారు. కొన్ని విషయాలు సర్వసాధారణంగా జరిగేవే అయినా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించడం అనేది ఇప్పటి మీడియాకు బాగా అలవాటైపోయింది. అలాంటి ఓ ఘటనే చెన్నయ్‌లో జరిగింది. తమిళ్ హీరో ప్రశాంత్ గురించి అందరికీ తెలుసు. జీన్స్ వంటి సినిమాల ద్వారా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆమధ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘వినయవిధేయ రామ’ చిత్రంలో రామ్‌చరణ్‌కు అన్నయ్యగా నటించాడు.
ప్రస్తుతం తన తండ్రి త్యాగరాజన్ దర్శకత్వంలో ‘అంధగాన్’ అనే సినిమా చేశాడు. హిందీలో సూపర్‌హిట్ అయిన ‘అంధాధున్’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ఆ హిందీ చిత్రానికి రీమేక్స్‌గా మలయాళంలో ‘భ్రమమ్’, తెలుగులో ‘మాస్ట్రో’ రూపొందాయి. ఇప్పుడు ప్రశాంత్ తమిళ్‌లో చేసిన ‘అంధగాన్’ చిత్రం ఆగస్ట్ 9న విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌ను కూడా స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ఓ యూట్యూబ్ ఛానల్ ప్రశాంత్‌ని ఇంటర్వ్యూ చేసింది. అయితే రెగ్యులర్‌గా కాకుండా ప్రశాంత్ ఒక బైక్‌ని డ్రైవ్ చేస్తూ ఉండగా, వెనకే కూర్చున్న యాంకర్ అతన్ని ఇంటర్వ్యూ చేస్తోంది. అంతకుముందు బైక్ ఉండేది కాదని, ఆ టైమ్‌లో తనకు ఆర్‌ఎక్స్ 100 బైక్ కొనిచ్చారని చెప్పాడు. తనకు డ్రైవింగ్ రాకపోతే మావయ్య నేర్పించారని చెప్పుకొచ్చాడు... ఇలా చెన్నైయ్ వీధుల్లో బైక్‌పై వారి ఇంటర్వ్యూ సాగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ ఇంటర్వ్యూను కూడా అందరూ వెరైటీగా ఫీల్ అయ్యారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, అక్కడే ఓ సమస్య వచ్చింది.
సిటీలో బైక్‌ను రైడ్ చేసే వారంతా హెల్మెట్ ధరించాలన్న నిబంధన ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రశాంత్, వెనుక కూర్చున్న యాంకర్ ఇద్దరూ హెల్మెట్ లేకుండానే బైక్‌పై వెళుతుండగా పోలీసులు ఫోటో తీసి రూ.2000 ఫైన్ వేశారు. దానికి సంబంధించి డీటైల్స్ కూడా పంపించారు. ఇదీ అక్కడ జరిగిన విషయం. హెల్మెట్ ధరించకపోతే ఫైన్ వేస్తారు. అది ఎంతో సాధారణమైన విషయం. దీన్ని పట్టుకొని తమిళ్ మీడియా, సోషల్ మీడియా పెద్ద రాద్దాంతం చేస్తోంది. ‘హెల్మెట్ లేకుండా బైక్‌ని నడపడం కరెక్ట్ కాదు కదా.. పోలీసులు ఏం చేస్తున్నారు’ అంటూ కొందరు ఫైర్ అవుతుంటే.. మరికొందరు ‘చేసేదే ఇంటర్వ్యూ.. ఇద్దరూ హెల్మెట్స్ పెట్టుకుంటే బైక్‌పై ఆ ఇంటర్వ్యూ చెయ్యడమెందుకు’ అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏ హీరోకైనా తన సినిమా రిలీజ్ అవుతున్న టైమ్‌లో పబ్లిసిటీ కావాలి. తన ప్రమేయం లేకుండా ఇలాంటి పబ్లిసిటీ వస్తుంటే మంచిదే కదా అని హీరోలు ఫీల్ అవ్వడంలో తప్పులేదు.
![]() |
![]() |