![]() |
![]() |

తమ అభిమాన హీరో నటిస్తున్న కొత్త సినిమా అప్డేట్స్ తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తారు. కానీ 'గేమ్ ఛేంజర్' సినిమా విషయంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి నిరాశ ఎదురవుతూనే ఉంది. ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలైంది ఈ సినిమా. షూట్ ఎంత పూర్తయిందో తెలీదు. ఒకటి రెండు పోస్టర్లు తప్ప, ఈ సినిమాకి సంబంధించి పెద్దగా ఎలాంటి అప్డేట్స్ లేవు. అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే స్థాయి నుంచి, కనీసం వచ్చే ఏడాదైనా సినిమా విడుదలైతే చాలు అనుకునే స్థాయికి అభిమానులు వచ్చేశారు. అయితే ఇప్పుడసలు ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కావడం కూడా కష్టమే అనిపిస్తోంది.
'ఆర్ఆర్ఆర్' విడుదల కాకముందే శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్'ని ప్రారంభించడంతో.. చరణ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. కానీ శంకర్ 'ఇండియన్-2'తో బిజీ కావడంతో.. 'గేమ్ ఛేంజర్' షూటింగ్ కి అడుగడుగునా బ్రేక్ లు పడుతున్నాయి. 'ఇండియన్-2'ని 2024 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అది పూర్తయితే కానీ, శంకర్ తన పూర్తి ఫోకస్ ని 'గేమ్ ఛేంజర్'పై పెట్టే అవకాశంలేదు. శంకర్ సినిమా అంటేనే భారీతనం. మేకింగ్ కి, పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా సమయం పడుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న 'గేమ్ ఛేంజర్' చిత్రం 70-80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని మేకర్స్ చెబుతున్నారు. కానీ ఇంకా ఈ సినిమా షూటింగ్ ఏకంగా 70 రోజులు చేయాల్సి ఉందని సన్నిహిత వర్గాల మాట.
'గేమ్ ఛేంజర్'లో పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. వారంతా ఇప్పుడు ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు. వారి డేట్స్ కుదిరి, మిగిలిన 70 రోజుల షూట్ ని పూర్తి చేయాలంటే.. కనీసం నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశముంది. భారీ సినిమా, అందునా శంకర్ సినిమా కాబట్టి.. పోస్ట్ ప్రొడక్షన్ కి కూడా ఎక్కువ సమయమే పట్టొచ్చు. పైగా 'ఇండియన్-2' తర్వాత వెంటనే 'ఇండియన్-3' కూడా ఉందని అంటున్నారు. ఒకవేళ ఉంటే మాత్రం, దాని ప్రభావం కూడా 'గేమ్ ఛేంజర్'పై పడొచ్చు. ఈ లెక్కన 2024 వేసవిలో 'ఇండియన్-2' విడుదలైనా, 2024 ద్వితీయార్థంలో 'గేమ్ ఛేంజర్' పూర్తయ్యి విడుదల కావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి 2024లో 'గేమ్ ఛేంజర్' విడుదలవుతుందనే ఆశలు చరణ్ అభిమానులు పెట్టుకోకపోవడమే మంచిది అంటున్నారు.
![]() |
![]() |