![]() |
![]() |

కొవిడ్-19తో పోరాటం చేస్తోన్న డాక్టర్ రాజశేఖర్ ఆరోగ్య స్థితిపై ఆయనకు చికిత్స అందిస్తోన్న హైదరాబాద్‌లో సిటి న్యూరో సెంటర్ హాస్పిటల్ గురువారం ఒక బులెటిన్‌ను విడుదల చేసింది. తీవ్రమైన కొవిడ్-19తో అడ్మిట్ అయిన ఆయనకు ఐసీయూలో నాన్-ఇన్వేజివ్ వెంటిలేటర్ సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నట్లు ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య స్థితి స్థిరంగా ఉందనీ, చికిత్సకు ఆయన స్పందిస్తున్నారనీ, తమ వైద్య బృందం ఆయనను సన్నిహితంగా మానిటర్ చేస్తోందనీ ఆ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రత్నకిశోర్ పేరిట వెలువడిన ఆ బులెటిన్ తెలియజేసింది.
పేషెంట్‌కు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తలెత్తినప్పుడు నాన్-ఇన్వేజివ్ వెంటిలేషన్ సపోర్ట్‌ను అందిస్తారు. ఇందులో ముఖానికి లేదా తల చుట్టూ అమర్చిన మాస్క్ ద్వారా శ్వాసను అందిస్తారు. ప్రస్తుతం కొవిడ్-19 చికిత్సలో ఈ సపోర్ట్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు రాజశేఖర్ తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని స్పష్టమైంది.
గురువారం ఉదయం తన తండ్రి కొవిడ్-19తో తీవ్రంగా పోరాడుతున్నారనీ, ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించమంటూ రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక సోషల్ మీడియాలో తెలపడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలక్కిపడింది. రాజశేఖర్ అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. ఆ వెంటనే శివాత్మిక మరో ట్వీట్ చేస్తూ, తన తండ్రి ఆరోగ్యం ఆందోళనకరంగా లేదనీ, స్థిరంగా ఉందనీ, క్రమేణా ఆయన స్థితి మెరుగవుతోందనీ తెలిపింది.

![]() |
![]() |