![]() |
![]() |
ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సూపర్‌హిట్ సినిమాలతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసిన పూరి జగన్నాథ్ కెరీర్ పరంగా కాస్త వెనకపడిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన లాస్ట్ సినిమా ‘లైగర్’ డిజాస్టర్‌గా నిలవడంతో ఆర్థికంగా, కెరీర్‌పరంగా ఎంతో నష్టాన్ని చవిచూశారు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత అతనికి మరో హిట్ రాలేదు. అందుకే హిట్ ట్రాక్‌లోకి వచ్చేందుకు మళ్ళీ అదే కాంబినేషన్‌లో ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్‌తో రామ్‌కి మాస్ ఇమేజ్‌ని తెచ్చిన పూరి దాన్ని కంటిన్యూ చేస్తూ డబుల్ హిట్ సాధించేందుకు కృషి చేస్తున్నారు. ‘లైగర్’ చిత్రానికి కూడా పూరీయే నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా అతన్ని నష్టాల్లోకి నెట్టింది. డబుల్ ఇస్మార్ట్‌తో ఆ నష్టాల నుంచి బయట పడాలని ఖర్చుకు వెనుకాడకుండా ఒక రేంజ్‌లో సినిమాను రెడీ చేస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ ధశలో ఉన్న డబుల్ ఇస్మార్ట్‌ని భారీ లెవల్‌లో ప్రజెంట్ చేసేందుకు క్లైమాక్స్ సన్నివేశాలను భారీ బడ్జెట్‌తో చిత్రీకరించబోతున్నారు. క్లౖెెమాక్స్ సీన్ కోసమే దాదాపు రూ.7 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సన్నివేశాలను రెండు వారాలపాటు చిత్రీకరించనున్నారు. ఇప్పటికే లైగర్ వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న పూరి మరోసారి రిస్క్ చేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే తనకి సూపర్‌హిట్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ స్క్రిప్ట్‌పైనే ఎక్కువ నమ్మకం ఉండడంతో దాన్నే సీక్వెల్‌గా ప్లాన్ చేశారు. దాని కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేస్తుండడంతో బాలీవుడ్ హీరో సంజయ్‌దత్‌ను విలన్‌గా తీసుకున్నారు. కావ్య తాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి డబుల్ ఇస్మార్ట్ చిత్రంపై పూరి పెట్టుకున్న ఆశల్ని ఈ సినిమా నిజం చేస్తుందో లేదో చూడాలి.
![]() |
![]() |