![]() |
![]() |

"ట్రైలర్లో సాయి పల్లవి బ్యాగ్ పట్టుకొని జమ్మిగుంట అనే బోర్డ్ కనిపిస్తున్న ఊరు నుండి నడుస్తూ వస్తుంది. జమ్మిగుంట మా పక్క వూరు. నేను కథ రాస్తున్నపుడు అదే ఇమేజ్ లో సాయి పల్లవి కలలోకి వస్తుండేది. అప్పటివరకూ సాయి పల్లవిని నేను కలిసింది లేదు. కానీ సాయి పల్లవి ఆ పాత్రలో కనిపిస్తుండేది. ఐతే హీరో ఎవరనేది మొదట అనుకోలేదు." అని చెప్పారు వేణు ఊడుగుల. రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటించిన 'విరాటపర్వం' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. డి. సురేష్ బాబు సమర్పణ లో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంపై ఇటీవల విడుదలైన ట్రైలర్ మరింత అంచనాలని పెంచింది. జూన్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపథ్యంలో మీడియాతో వేణు పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే...
"నేను పుట్టి పెరిగిన వాతావరణం, చూసిన జీవితం, చదివిన పుస్తకాలు.. నేను ఎలాంటి సినిమా తీయాలో అనే ఒక విజన్ ని ఇచ్చాయి. నాకు తెలిసిన జీవితాన్ని చెప్పాలని, చరిత్రలో దాగిన కథలు చెప్పాలనే ప్రయత్నంలో బాగంగా తీసిన సినిమానే 'విరాటపర్వం'. బరువైన కథ చెప్పాలని గానీ క్లిష్టమైన కథ చెప్పాలని గానీ అనుకోను. నా టెంపర్మెంటే నా సినిమా. ఈ కథ చెప్పాలని అనుకున్నాను చెప్పాను తప్పితే ఇది బరువైనదా క్లిష్టమైనదా? అనే ఆలోచన లేదు. యథార్థ సంఘటనలు ఆధారంగానే ఈ చిత్రాన్ని తీశాం. సరళ అనే ఒక అమ్మాయి జీవితం ఇది."
నక్సలిజం నేపథ్యంలో తొలి ప్రేమకథ
"ఒక రాజకీయ, సంక్లిష్టమైన వాతారవణంలో పెరిగా. తెలంగాణ ఒక రాజకీయ ప్రయోగశాల. ఇక్కడ జరిగిన పరిణామాలు దేశ రాజకీయాలని ప్రభావితం చేసిన వాతావరణం. ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరగడం వలన సహజంగానే కొంత ప్రోగ్రెసివ్ ఐడియాలజీ వుంటుంది. అంతేకానీ లెఫ్ట్, రైట్ అనేది అప్రస్తుతం. నేపథ్యాన్ని పక్కన పెడితే.. కథలో వున్న ప్రధాన భావోద్వేగం ఏమిటనేది ముఖ్యం. ఒక దొంగల కుటుంబం వుంది. ఆ కుటుంబంలో ఒక ప్రేమకథ చెబితే తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నేపథ్యానికి సంబంధం లేదు. 'విరాటపర్వం'లో ఒక అందమైన ప్రేమకథ చెబుతున్నాం. 1990లోని రాజకీయ సందర్భాన్ని ఒక వ్యక్తిగతమైన సంఘర్షణగా చూపిస్తున్నాం. ఇది అందరికీ గొప్ప అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతున్నాను. మానవ సంబంధాల నేపథ్యంలో చెప్పే కథలని ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరిస్తారు. 'విరాటపర్వం' ఒక అమ్మాయి ప్రేమకథ. నక్సలిజం నేపథ్యంలో వస్తున్న తొలి ప్రేమకథ ఇది. చాలా కొత్తగా ఉండబోతుంది."
సినిమాపై చాలా పాజిటివ్ బజ్
"గ్రేట్ స్టార్ కాస్ట్, మంచి నిర్మాతలు వలన 'విరాటపర్వం' సినిమా మొదలైనప్పటి నుండి సినిమాపై చాలా పాజిటివ్ బజ్ వుంది. ఇక కరోనా సమయంలో అందరిదీ ఒకటే పరిస్థితి. ఈ సమయంలో రెండు కథలు రాసుకున్నా. ఐతే సినిమా త్వరగా వస్తే బావుంటుదని అనిపించేది. అన్నీ అధిగమించి చాలా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఓటీటీ నుంచి కొన్ని ఆఫర్లు వచ్చాయి. ఐతే మా నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ గారు సినిమాని బలంగా నమ్మారు. ఇది భారీగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాల్సిన సినిమా."
గొప్ప మనసుతో రానా ఈ సినిమా చేశారు
"విప్లవం అనేది ప్రేమైక చర్య. ఈ మాటని విస్తృతంగా అర్థం చేసుకోవాలి. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య వుండేదే కాదు.. ఒక సమూహానికి వ్యక్తి మధ్య వుండే ప్రేమ కూడా. ఎంత ప్రేమ వుంటే ఒక సమూహంలోకి వెళ్లాలని అనుకుంటారు? జనం కోసం పని చేయాలంటే ఎంతో ప్రేమ వుంటే తప్ప త్యాగం చేయలేం. రానా గారు ఈ కథ ఒప్పుకోవడం నా గొప్పదనం కాదు రానాగారి గొప్పదనం. నేను సురేష్ బాబు గారికి ఈ కథ చెప్పాను. సురేష్ బాబు గారు 'రానాకి లైన్ నచ్చింది చెప్తావా' అన్నారు. రానా గారికి చెప్పాను. కథ విన్న తర్వాత రానా గారు 'చేస్తా' అన్నారు. ఈ కథ రానా గారు ఎందుకు చేస్తానన్నారో కాసేపు అర్థం కాలేదు. 'ఒక కొత్త దర్శకుడు వైవిధ్యమైన కథతో వచ్చాడు. ఇలాంటి సినిమా మనం చేయకపోతే ఎవరు చేస్తార'నే గొప్ప మనసుతో రానా గారు ఈ సినిమా చేశారు."
కథలోనే గొప్ప వైబ్రేషన్
"సాయిపల్లవి గారికి పది నిమిషాలు కథ చెప్పాను. పది నిమిషాల తర్వాత ఓకే చేశారు. సాయి పల్లవే కాదు సురేష్ బాబు గారు మిగతా అందరూ సింగల్ సిట్టింగ్ లోనే కథని ఓకే చేశారు. ఈ కథలోనే అంత గొప్ప వైబ్రేషన్ వుంది."
ఆ ఘటనే ప్రేరణ
"1992లో ఒక ఘటన జరిగింది. ఆ ఘటన వెనుక రాజకీయ కారణాలు వుండటం వలన ఈ కథని జనాలకి చెప్పాలని ప్రేరణ పొందా. ఐతే సినిమా అన్నప్పుడు కొంత ఫిక్షన్ వుంటుంది. కథని సినిమాగా మార్చుకున్నపుడు కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమానే తప్ప ఇది బయోపిక్ కాదు. ఈ సినిమా ముగింపు ఏమిటనేది ఇప్పుడే చెప్పను. అయితే ఆ ముగింపు ప్రేక్షకుడిపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మహా భారతంలో విరాటపర్వం అనేది అండర్ గ్రౌండ్ స్టొరీ. అందులో వున్న కుట్రలు, రాజకీయాలు, ఫిలాసఫీ ఈ చిత్రానికి సరిపోతుందని ఆ టైటిల్ పెట్టాం."
చంద్రుడు లేకుండా వెన్నెల ఉండదు
"ఇది సాయి పల్లవి సినిమా కాబట్టే ఆమె సినిమా అని ప్రొజెక్ట్ చేశాం. ఇది వెన్నెల అనే అమ్మాయి కథ. రానా గారు ఈ చిత్రానికి నిర్మాత కూడా. ఆయన చాలా గొప్ప మనసుతో చాలా నిజాయితీ తో మనం తీసింది ప్రేక్షకుల వద్దకు అంతే నిజాయితీ గా తీసుకువెళితే ఆదరిస్తారని చెప్పారు. అలాగని మొత్తం వెన్నెల పాత్రే వుండదు. చంద్రుడు లేకుండా వెన్నెల వుండదు కదా.. రానా గారి పాత్ర కూడా చాలా ముఖ్యం."

![]() |
![]() |