Home  »  News  »  జ‌గ‌న్‌ను కీర్తించి రాజ‌మౌళి ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టాడా?

Updated : Jun 11, 2020

 

ఇప్పుడు వాట్సాప్‌లో ఒక ఆర్టిక‌ల్ వైర‌ల్‌గా స‌ర్క్యులేట్ అవుతోంది. రాజ‌మౌళి ఎవ‌రో త‌న‌కు తెలీద‌ని అన్న వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ద‌గ్గ‌ర‌కు మొన్న హీరోల‌తో క‌లిసి వెళ్లి ఆయ‌న‌ను కీర్తించివ‌చ్చిన‌ రాజ‌మౌళికి ఆత్మ‌గౌర‌వం ఉందా?.. అనేది దాని సారాంశం. జ‌గ‌న్ అలా ఎప్పుడ‌న్నాడో తెలీదు కానీ, అని ఉంటే అది రాజ‌మౌళికి అవ‌మాన‌క‌ర‌మే. నిజానికి రాజ‌మౌళి గురించి తెలీని తెలుగువాళ్లు ఉంటారా?  ఏమాత్రం సినిమా ప‌రిజ్ఞానం లేనివాళ్ల‌కో, రీమోట్ ఏరియాల్లో ఉండే వాళ్ల‌కో తెలీదంటే ఓకే. కానీ తెలుగువాళ్ల‌తో పాటు దేశ‌మంతా మాట్లాడుకున్న 'బాహుబ‌లి' డైరెక్ట‌ర్‌గా రాజ‌మౌళి తెలీనివాళ్లు ప్ర‌జా జీవితంలో ఉంటారా?  అయితే ఏదో మాట‌వ‌ర‌స‌కు జ‌గ‌న్ ఆ మాట అని ఉండొచ్చు. నిజానికి రాజ‌మౌళి ఆయ‌న‌కు బాగానే తెలుసు. ఎట్లా అంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ముఖ్య‌మంత్రి కాక‌ముందు, ఎన్నిక‌ల‌కు ఐదు నెల‌ల ముందు రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌రిపిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఆయ‌న ప‌దే ప‌దే రాజ‌మౌళి నామ‌స్మ‌ర‌ణ చేశారు. వాటికి సంబంధించిన వీడియో సాక్ష్యాలు మ‌న ముందున్నాయి కూడా..

వాటిలో ఒక ప్ర‌సంగాన్ని చూద్దాం..

"ఈ మ‌ధ్య కాలంలోనే ఒక డైరెక్ట‌ర్ 'బాహుబ‌లి' అనే సినిమా తీశాడు. మీరంద‌రూ చూసే ఉంటారు. మొన్న‌నే పేప‌ర్‌లో చ‌దివా. ఆయ‌న‌ను చంద్ర‌బాబునాయుడు గారు పిలిపించుకున్నారంట‌. అమ‌రావ‌తి మీద సినిమా తీయండ‌ని అడిగాడంట‌. అమ‌రావ‌తి మీద సినిమా తీయ‌డ‌మంటే నాకు ఆశ్చ‌ర్య‌మ‌నిపించింది. నాలుగు సంవ‌త్స‌రాలైపోయింది. ఇంత‌వ‌ర‌కు ప‌ర్మినెంట్ అనే పేరుతో అక్క‌డ ఒక్క‌ ఇటుకా ప‌డ‌లా. అలాంటి అమ‌రావ‌తి మీద చంద్ర‌బాబునాయుడు గారు 'బాహుబ‌లి' డైరెక్ట‌ర్‌ను పిలిచి సినిమా తీయ‌మ‌న్నాడంట‌. రేప్పొద్దున ఆయ‌న సెట్లు వేసేస్తాడు. ఆ సెట్ల‌లో చంద్ర‌బాబునాయుడు గారి ఎంట్రీ. ఆయ‌న మంత్రి నారాయ‌ణ మ‌రో పాత్ర‌. అదుగో అమ‌రావ‌తి.. అదుగో వ‌చ్చేసింది.. అని బిల్డ‌ప్‌. మోసానికైనా హ‌ద్దూప‌ద్దూ ఉండాలి. రేప్పొద్దున అటువంటి కార్య‌క్ర‌మాల‌ను డైరెక్ట‌ర్ల‌తో కూడా చంద్ర‌బాబునాయుడు గారు చేయిస్తారు."
- ఇవి 2017 డిసెంబ‌ర్‌లో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో చంద్ర‌బాబునాయుడితో పాటు రాజ‌మౌళిపైనా వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వేసిన వ్యంగ్యాస్త్రాలు

ఇలాంటిదే ఇంకో ప్ర‌సంగం చూద్దాం..

"చంద్ర‌బాబు కంప్యూట‌ర్ ఆన్ చేస్తాడు.. డిజిట‌ల్ ప్రెజెంటేష‌న్ అంటాడు. అంతా షోనే. ఆ షోకు రాజ‌మౌళి అని సినిమా డైరెక్ట‌ర్‌ని పిలుస్తాడు. అస‌లు సినిమా డైరెక్ట‌ర్ ఏంది? అసెంబ్లీ బిల్డింగులు చేయ‌డ‌మేంది?  సెక్ర‌టేరియ‌ట్ బిల్డింగులు క‌ట్ట‌డ‌మేంది?  హైకోర్టు బిల్డింగులు క‌ట్ట‌డ‌మేంది? ఆర్కిటెక్ట్ చేయాల్సిన ప‌ని ఆర్కిటెక్ట్ చేయాలి, సినిమావాళ్లు చేయాల్సిన ప‌ని సినిమావాళ్లు చేయాలి. అయినా కానీ షో చేయ‌డం కోసం చంద్ర‌బాబు నాయుడుగారు పెద్ద‌గా చూపిస్తారు సినిమా మ‌నంద‌రికీ."
- ఇది 2018 జ‌న‌వ‌రిలో ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లోనే ఇటు చంద్ర‌బాబు పైనా, అటు రాజ‌మౌళి పైనా జ‌గ‌న్‌ వేసిన ఇంకో సెటైర్‌.

అంటే జ‌గ‌న్‌కు రాజ‌మౌళి బాగానే తెలుసు. టాలీవుడ్‌లో రాజ‌మౌళి నంబ‌ర్‌వ‌న్ డైరెక్టర్‌.. ఆ మాట‌కొస్తే ఇండియాలోనే అత్యంత పాపుల‌ర్ డైరెక్ట‌ర్‌. రెండు భాగాల 'బాహుబ‌లి' సినిమాతో జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న‌వాడు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోని ఇద్ద‌రు టాప్ స్టార్స్‌.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో 'ఆర్ఆర్ఆర్‌:  రౌద్రం ర‌ణం రుధిరం' అనే వంద‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో సినిమా తీస్తున్నాడు. అందులోనూ కొమ‌రం భీమ్‌గా తార‌క్‌నూ, అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్‌నూ చూపిస్తున్నాడు రాజ‌మౌళి.

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా షూటింగ్‌లూ, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులూ మూడు నెల‌లుగా ఆగిపోయాయి. ఇప్ప‌ట్లో మ‌హ‌మ్మారి త‌గ్గ‌ద‌ని తేలిపోవ‌డంతో, ఆర్థికంగా దేశాన్ని మ‌రింత ఇక్క‌ట్ల‌లో ప‌డేయ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో అన్ని ర‌కాల ప‌నుల‌కూ ప్ర‌భుత్వాలు కొన్ని నిబంధ‌న‌ల మ‌ధ్య గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ వ‌స్తున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమాల షూటింగ్‌లు చేసుకోవ‌చ్చంటూ అక్క‌డి ప్ర‌భుత్వం జీవో జారీ చేసేసింది.

దాంతో టాలీవుడ్ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. షూటింగ్‌లు చేసుకొనే మ‌హ‌ద్భాగ్యాన్ని జ‌గ‌న్ క‌ల్పించాడంటూ స్తోత్రాలు ప‌ఠిస్తూ ఆయ‌న‌ను కీర్తించ‌డానికి ముహూర్తం ఫిక్స్ చేసుకొంది. జూన్ 9న‌ టాలీవుడ్ త‌ర‌పున పెద్ద‌లుగా చిరంజీవి, నాగార్జున‌, సి. క‌ల్యాణ్‌, డి. సురేశ్‌బాబు, దిల్ రాజు, కె.ఎల్‌. దామోద‌ర్‌ప్ర‌సాద్ వంటి వాళ్లు వెళ్లారు. వైసీపీ పార్టీలో ఉన్న విజ‌య్‌చంద‌ర్ వంటి వాళ్లూ క‌లిశారు. వాళ్ల‌తో పాటు మ‌న ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళీ వెళ్లాడు. దీన్నే ఇప్పుడు చాలామంది త‌ప్పు ప‌డుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా రాజ‌మౌళి రాజీప‌డ్డాడంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. వాట్సాప్‌లో క‌థ‌లు స‌ర్క్యులేట్ చేస్తున్నారు.

ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో త‌న గురించి అవ‌మాన‌క‌రంగా మాట్లాడిన‌, త‌న‌పై సెటైర్లు వేసిన జ‌గ‌న్ వ‌ద్ద‌కు రాజ‌మౌళి ఏ ముఖం పెట్టుకొని వెళ్లాడ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. పైగా ఏ అమ‌రావ‌తి గురించి జ‌గ‌న్ త‌ర‌చూ అవ‌మాన‌క‌రంగా మాట్లాడుతుంటాడో, దాదాపు 180 రోజులుగా అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించాలంటూ ఆ ప్రాంత రైతులు ఆందోళ‌న‌లు చేస్తున్నా ప‌ట్టించుకోకుండా వాళ్ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌వాళ్లు కాద‌న్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నాడో.. ఆ జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు, ఆయ‌న‌కు కీర్తించ‌డానికి ఎలా వెళ్లాడంటూ రాజ‌మౌళిని తిట్టిపోస్తున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అమ‌రావ‌తిని రాజ‌ధానిగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దాని శంకుస్థాప‌న‌కు సాక్షాత్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వ‌చ్చి వెళ్లారు. ఆ అమ‌రావ‌తి రూప‌క‌ల్ప‌న‌లో రాజ‌మౌళిని సంప్ర‌దించారు చంద్ర‌బాబు. 'మ‌గ‌ధీర‌', 'బాహుబ‌లి' లాంటి సినిమాల‌ను తీసిన డైరెక్ట‌ర్ విజ‌న్‌ను అమ‌రావ‌తి డిజైన్‌లో ఉప‌యోగించుకోవాల‌ని చంద్ర‌బాబు భావించారు. రాజ‌మౌళితో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ విష‌యం చాలామందికి తెలుసు. అలాంటి అమ‌రావ‌తితో మాన‌సిక బంధం కూడా ఏర్ప‌ర‌చుకున్న రాజ‌మౌళి.. ఇలా సినీ పెద్ద‌లతో క‌లిసి జ‌గ‌న్‌కు ధ‌న్య‌వాదాలు తెల‌ప‌డానికి వెళ్ల‌డం స‌రైన ప‌నేనా? అని చాలామంది ప్ర‌శ్నిస్తున్నారు.

ఇవాళ అన్ని రంగాల‌కు చెందిన ప‌నులు పునఃప్రారంభ‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే చాలా ప్రారంభ‌మ‌య్యాయి. ఆ రంగాల‌కు చెందిన వాళ్లెవ‌రూ ప‌నిగట్టుకొని వెళ్లి ముఖ్య‌మంత్రుల‌ను క‌లిసి ధ‌న్య‌వాదాలు చెప్ప‌డం లేదు. ఎవ‌రి ప‌ని వాళ్లు చేసుకోక త‌ప్ప‌దు. దానికి అధికార యంత్రాంగం అనుమ‌తులివ్వ‌క త‌ప్ప‌దు. లేక‌పోతే టాక్సుల రూపంలో కానీ, మ‌రో రూపంలో కానీ దానికి ఆదాయం ఎట్లా వ‌స్తుంది! అందుకే సినిమా షూటింగ్‌లకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుమ‌తులు జారీ చేసింది. దానివ‌ల్ల ప్ర‌భుత్వానికీ ఆదాయం వ‌స్తుంది. ఇంతోటి దానికి గుంపుగా వెళ్లి ధ‌న్య‌వాదాలు చెప్పి రావాలా?.. అనే ప్ర‌శ్న‌ను కూడా కొంత‌మంది లేవ‌నెత్తుతున్నారు. ఏదేమైనా మెగాస్టార్‌, మిగ‌తా స్టార్ల సంగ‌తి ఎలా ఉన్నా.. ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టుపెట్టి రాజ‌మౌళి ఆ గుంపులో క‌ల‌వ‌డమేంట‌ని చాలామంది ఆక్షేపిస్తున్నారు.  దీనికి రాజ‌మౌళి ద‌గ్గ‌ర స‌మాధాన‌ముందా?






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.