![]() |
![]() |

బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తుకు బిహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును అంగీకరించినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది. ఫలితంగా రెండు రాష్ట్రాలు బిహార్, మహారాష్ట్ర మధ్య చిక్కుకొన్న ఈ కేసులో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఫిబ్రవరిలోనే తన కొడుకు జీవితం ప్రమాదంలో ఉందని చెప్పినా ముంబై పోలీసులు స్పందించలేదని సుశాంత్‌సింగ్ తండ్రి ఆరోపించిన తర్వాత బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్రానికి ఈ సిఫారసు చేశారు.
సీబీఐ దర్యాప్తును సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసింది. రాజకీయ ప్రేరేపణతోటే పాట్నాలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారనీ, ఈ కేసు ఏ రకంగానూ బిహార్ పోలీసుల పరిధిలోకి రాదనీ అది వాదించింది. జూన్ 14న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్‌సింగ్ మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చినప్పట్నుంచీ ముంబై పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
కాగా ఈ కేసులో స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాల్సిందిగా ముంబై పోలీసులను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. "ఆ నటుడి మృతి వెనుక వాస్తవం బయటకు రావాలి" అని కోర్టు వ్యాఖ్యానించింది.
![]() |
![]() |