![]() |
![]() |
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగాయో అందరూ చూశారు. పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్‌ను ఓడిరచి, గద్దె దించాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అనుకున్నది సాధించారు. చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా చేశారు. ఈ విజయానికి కారణమైన రేవంత్‌రెడ్డి అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 7న రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే.. రేవంత్‌రెడ్డికి వీరాభిమాని అయిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ గెలుపు పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ముందు రోజే ఎల్.బి. స్టేడియంకి వెళ్లి పడుకుంటానని, మరుసటి రోజు కార్యక్రమం అయిపోయే వరకు అక్కడే ఉంటానని అన్నారు బండ్ల గణేష్. అంతేకాదు, ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్‌రెడ్డి బయోపిక్ తీస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు. రేవంత్ అంగీకరిస్తే ఆయన కథతో సినిమా తీస్తానని చెబుతున్నాడు గణేష్. రేవంత్‌కి ఇక్కడ చాలా మంది విలన్లు వున్నారని, ఆయన్ని జైల్లో పెట్టి చాలా ఇబ్బంది పెట్టారని అన్నారు గణేష్. తెలంగాణలో పది సంవత్సరాల తర్వాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే దానికి కారణం రేవంత్‌రెడ్డేనని బండ్ల గణేష్ అన్నారు.
అయితే హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కి ఒక్క స్థానం కూడా రాకపోవడం ఎంతో బాధ కలిగించిందని, వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌లో తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఆకాంక్షించారు బండ్ల గణేష్. రేవంత్‌రెడ్డి బయోపిక్ తీస్తానని ప్రకటించడం సినీ వర్గాలను షాక్‌కు గురిచేసింది. అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారనే విషయం బండ్ల గణేష్ చెప్పలేదు. ఒకవేళ బయోపిక్ తీసేందుకు అన్నీ అనుకూలిస్తే అందులో హీరోగా ఎవరు చేస్తారు అనేది ఈ ప్రాజెక్ట్ ఓకే అయితేనే తెలుస్తుంది.
![]() |
![]() |