![]() |
![]() |

తమ అభిమాన హీరో వారసుల సినీ రంగ ప్రవేశం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కూడా వారిని స్క్రీన్ మీద చూసుకోవాలని తపిస్తుంటారు. ఇప్పటికే '1-నేనొక్కడినే' మూవీలో మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ.. చిన్నప్పటి మహేష్ పాత్ర పోషించి అభిమానులకు కనువిందు చేశాడు. త్వరలోనే అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ కూడా బిగ్ స్క్రీన్ మీద సందడి చేయనున్నాడని తెలుస్తోంది.
దాదాపు అందరు హీరోల అభిమానులు ఇష్టపడే సినీ సెలబ్రిటీ కిడ్స్ లో అల్లు అర్జున్ పిల్లలు ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే వీరు సెలబ్రిటీ కిడ్స్ లా కాకుండా.. సాధారణ పిల్లల్లాగే ఉంటారు. అల్లు అర్హ తన ముద్దు ముద్దు తెలుగు మాటలతో ఎందరో మనసు దోచుకుంది. అలాగే ఇప్పటికే 'శాకుంతలం' సినిమాతో తెలుగుతెరకు బాలనటిగా పరిచయమై, ప్రిన్స్ భరత పాత్రలో మెప్పించింది. ఇక అల్లు అయాన్ కి అయితే సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.
సెలబ్రిటీ సన్, స్టేటస్, మనీ.. ఇలాంటివేమీ తెలియకుండా ఒక పదేళ్లలోపు పిల్లాడు.. తనకి నచ్చింది చేసుకుంటూ మనస్ఫూర్తిగా ఎలా ఎంజాయ్ చేస్తాడో అలా ఉంటాడు అయాన్. అందుకే అతన్ని ఇష్టపడేవారు రోజురోజుకి పెరిగిపోతున్నారు. అయాన్ ఏం చేసినా సోషల్ మీడియా వైరల్ అవుతుంటుంది. తన అల్లరితో, తెలిసీతెలియని చేష్టలతో ఎంతగానో నవ్విస్తుంటాడు. కొందరైతే అల్లు అర్జున్ తాతగారు అల్లు రామలింగయ్యే అయాన్ రూపంలో పుట్టారని అంటుంటారు. ఇంకా కొందరేమో 'మోడల్ బోల్తే' అంటూ అయాన్ ఫొటోలను, వీడియోలను తెగ షేర్ చేస్తుంటారు. ఇలా తన చిలిపి అల్లరితో సోషల్ మీడియా ద్వారా ఎందరికో దగ్గరైన అయాన్.. ఇప్పుడు వెండితెరపై సందడి చేయనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప-2' చేస్తున్నాడు. 'పుష్ప-1'తో పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించిన బన్నీ.. 'పుష్ప-2'తో అంతకు మించిన సంచలనాలు సృష్టిస్తాడనే అంచనాలున్నాయి. రోజురోజుకి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాలో అయాన్ నటిస్తున్నాడనే న్యూస్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తోంది. ఈ చిత్రంలో అయాన్ రోల్ కాసేపే ఉన్నప్పటికీ.. కథకి కీలకంగా ఉంటుందట. అయాన్ నిజంగానే 'పుష్ప-2'లో నటిస్తే మాత్రం.. సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీకి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో.. అయాన్ ఎంట్రీకి కూడా ఆ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది అనడంలో సందేహం లేదు.
![]() |
![]() |