![]() |
![]() |

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న తెలుగు వెబ్ సిరీస్ అంటే 90's అని చెప్పవచ్చు. మిడిల్ క్లాస్ బయోపిక్ గా ఓటీటీ వేదిక ఈటీవీ విన్ లో ప్రదర్శిమవుతున్న ఈ సిరీస్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. శివాజీ, వాసుకి, మౌళి, వసంతిక, రోహన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ కి ఆదిత్య హాసన్ దర్శకుడు. ప్రస్తుతం దర్శకుడు ఆదిత్య పేరు మారుమోగిపోతోంది. 90ల నాటి రోజులను గుర్తు చేస్తూ.. ఎంతో సహజంగా, కుటుంబమంతా కలిసి చూసి హాయిగా నవ్వుకునేలా సిరీస్ ని రూపొందించాడని ప్రశంసలు కురుస్తున్నాయి. అంతేకాదు ఆదిత్య హాసన్ కి దర్శకుడిగా సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. అతను డైరెక్ట్ చేయబోయే మొదటి సినిమాలో హీరోగా నితిన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ చేస్తుంటాడు నితిన్. అయితే 2020లో వచ్చిన 'భీష్మ' తర్వాత నితిన్ ఖాతాలో హిట్ పడలేదు. దీంతో హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ చేతిలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'తమ్ముడు', వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న 'రాబిన్ హుడ్' ఉన్నాయి. వీటితో పాటు ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందనుందట.
నితిన్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఆయన కెరీర్ లో హిట్ గా నిలిచిన సినిమాలను గమనిస్తే కామెడీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాంటి నితిన్ తో.. ఒక్క సిరీస్ తోనే కామెడీపై తనకున్న పట్టుని నిరూపించుకున్న ఆదిత్య హాసన్ జత కడితే కామెడీ అదిరిపోతుంది అనడంలో సందేహం లేదు. అయితే నితిన్ కోసం ఆదిత్య రెడీ చేస్తున్న స్క్రిప్ట్ లో కామెడీతో పాటు కంటెంట్ కూడా విభిన్నంగా అదిరిపోయేలా ఉంటుందట.
శ్రేష్ఠ్ మూవీస్ తో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా ఇప్పటికే దర్శకుడు ఆదిత్య హాసన్ కి అడ్వాన్స్ ఇచ్చిందట. నితిన్ సినిమా హిట్ అయితే మరిన్ని నిర్మాణ సంస్థలు ఆదిత్య వైపు చూసే అవకాశముంది.
![]() |
![]() |