![]() |
![]() |

సీనియర్ నటుడు, రచయిత రావి కొండలరావు మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన హృద్రోగ సమస్యలతో బాధపతున్నట్లు సమాచారం. ఆయన వయసు 88 సంవత్సరాలు. ఆయన భార్య, నటి రాధాకుమారి 2012లో మృతి చెందారు.
రావి కొండలరావు నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్టు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి. 1932 ఫిబ్రవరి 11న సామర్లకోటలో జన్మించారు. తండ్రి పోస్టుమాస్టరు పదవీ విరమణ తర్వాత శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. వీరి పూర్వీకులు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కావడంతో అక్కడ స్థిరపడ్డారు.
1958లో ఎన్టీఆర్ ‘శోభ’ చిత్రంతో కొండలరావు సినీ నట జీవితం మొదలైంది. సినిమాల్లోకి రాకముందు రకరకాల పనులు చేశారు. మద్రాసులోని ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్ గా చేశారు. కొన్నాళ్లు ముళ్లపూడి వెంకటరరమణ గారింట్లో ఉన్నారు. మధ్యలో కేరళ వెళ్లి ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాశారు. సీనియర్ రైటర్ డి.వి. నరసరాజు సిఫార్సు ద్వారా కొండలరావుకు పొన్నలూరి బ్రదర్స్‌వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో చేరారు.
కమలాకర కామేశ్వరరావు సిఫార్సుతో 'శోభ' సినిమాలో కొండలరావు తొలిసారి కనిపించారు. ఆదుర్తి సుబ్బారావు తీసిన ‘దాగుడుమూతలు’ సినిమాలో చేసిన డాక్టరు వేషం మంచి పేరు తెచ్చింది. ఓ వైపు నటిస్తూనే విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా చేశారు. చివరిసారిగా నాగార్జున మూవీ 'కింగ్' (2008)లో అతిథి పాత్ర చేశారు.
![]() |
![]() |