![]() |
![]() |
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘ఓజీ’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా హై బజ్ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అవుతున్న సెప్టెంబర్ 25 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. తమ అభిమాన హీరో సినిమా మొదటి రోజే చూసెయ్యాలన్న క్రేజ్ ఫ్యాన్స్‌లో ఉంటుంది. క్రౌడ్ ఎక్కువగా ఉన్న కారణంగా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. అలాంటి ఓ ఘటన ‘ఓజీ’ ప్రదర్శిస్తున్న థియేటర్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. భద్రాచలంలోని ఏషియన్ థియేటర్‌లో ఓజీ సినిమా ప్రదర్శన సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. అభిమానులు అధిక సంఖ్యలో థియేటర్‌లోకి రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో స్పీకర్లు కింద పడి ఇద్దరు అభిమానులకు తీవ్ర గాయాలయ్యాయి. కెపాసిటీకి మించి సుమారు 1200 మందిని లోపలికి అనుమతించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, లోపల ఉక్కిరిబిక్కిరి అయ్యామని అభిమానులు ఆరోపిస్తున్నారు. థియేటర్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో గత ఏడాది విడుదలైన ‘పుష్ప2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు కోమాలోకి వెళ్ళిపోయి కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్ళీ జరగకుండా థియేటర్ యాజమాన్యం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నప్పటికీ ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.
![]() |
![]() |