![]() |
![]() |

విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్‌డమ్' అనే సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత దర్శకులు రాహుల్ సాంకృత్యాన్, రవికిరణ్ కోలాతో సినిమాలు కమిటై ఉన్నాడు విజయ్. ఇప్పుడు రవికిరణ్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. (Vijay Deverakonda)
కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమైన 'రాజా వారు రాణి గారు' చిత్రంతో రవికిరణ్ కోలా దర్శకుడిగా పరిచయమయ్యాడు. 2019 లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 'రాజా వారు రాణి గారు' తర్వాత కిరణ్ హీరోగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటే, రవికిరణ్ మాత్రం దర్శకుడిగా తన రెండో సినిమాని పట్టాలెక్కించడానికి ఏకంగా ఐదేళ్లకు పైగా సమయం తీసుకున్నాడు. మధ్యలో 'అశోకవనంలో అర్జున కళ్యాణం' చిత్రానికి మాత్రం రచయితగా వ్యవహరించి ఆకట్టుకున్నాడు. అయితే లేట్ గా వచ్చినా.. సాలిడ్ కంటెంట్ తో వచ్చి, సర్ ప్రైజ్ చేయడానికి రవికిరణ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా కాంబినేషన్ లో రానున్న క్రేజీ ప్రాజెక్ట్ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి 'రౌడీ జనార్ధన' అనే పవర్ ఫుల్ టైటిల్ ను లాక్ చేశారు. ఈ విషయాన్ని తాజాగా నిర్మాత దిల్ రాజు రివీల్ చేశారు. విజయ్ ని అభిమానులు ముద్దుగా రౌడీ అని పిలుస్తారు. దాంతో, రౌడీ అనే పదం వచ్చేలా టైటిల్ ఖరారు చేయడం ఆసక్తికరంగా మారింది. కాగా, 'రౌడీ జనార్ధన' చిత్రాన్ని 2026 చివరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |